జెండాలు తప్పితే ఎజెండా లేని పార్టీలు టీడీపీ, బీజేపీ

టీడీపీ, బీజేపీలు విషప్రచారంపైనే ఆధారపడ్డాయి

కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కుంది చంద్రబాబే..

కొడుక్కు మంచి బుద్దులు నేర్పించలేని బాబు.. తండ్రిగా ఫెయిల్‌

ప్రజారోగ్యం దృష్ట్యా సీఎం సభ వాయిదా వేసుకున్నారు

ఆంధ్రరాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి..?

ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: చేతుల్లో జెండాలు తప్పితే ప్రజల కోసం ఎజెండా లేని పరిస్థితుల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఉన్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ఏం చేశామో చెప్పి ఓటు అడిగితే స్థితి భారత దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి లేకపోవడం విచారకరమన్నారు. కేవలం విష ప్రచారం మీద ఆధారపడి చంద్రబాబు, బీజేపీ తిరుపతిలో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. నరం లేని నాలుక అనే సామెతకు చంద్రబాబు, లోకేష్‌ ఉదాహరణ అని దుయ్యబట్టారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ముందు వైయస్‌ జగన్‌ ఏం చెప్పారో అవన్నీ అమలు చేశాం.. ఇదీ మా మేనిఫెస్టో.. చెప్పి చేసినవి ఇవీ.. చెప్పకుండానే చేసినవి ఇవీ.. ప్రజా సంక్షేమానికి బాటలు వేశాం.. కాబట్టి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి అని వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి అడిగే వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. 

తిరుపతి ఉప ఎన్నికపై సీఎం ఆశ వదులుకున్నారు.. ఓడిపోతారనే భయంతో బహిరంగ సభకు రావడం లేదని చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తండ్రీకొడుకులను చూస్తే పాతరోజుల్లో ఒక సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ అనే నటుడి పాత్ర గుర్తొస్తుందన్నారు. టీడీపీ, బీజేపీది నోటికి శుద్ధి లేని జన్మ అయిపోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ దెబ్బకు టీడీపీ కార్యకర్తలే భయపడే పరిస్థితి ఉందన్నారు. 

కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సభకు లక్షల్లో జనం వస్తారు కాబట్టి ప్రజారోగ్యం దృష్ట్యా సీఎం వైయస్‌ జగన్‌ తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారని చెప్పారు. జనం చచ్చినా పర్వాలేదు మా పబ్బం గడిస్తే చాలనే చంద్రబాబు, లోకేష్‌ లాంటి తత్వం సీఎం వైయస్‌ జగన్‌కు లేదన్నారు. సమాజ హితం కోసం తిరుపతి ఎన్నిక బహిరంగ సభను సీఎం రద్దు చేసుకున్నారని వివరించారు. 

కరోనాకు భయపడి రావడం లేదని ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయని,  కరోనాకు భయపడి ఇంట్లో దాక్కుందెవరూ..? హైదరబాద్‌కు పరిపోయి ముసుగుతన్ని పడుకున్నదెవరూ..? అని మంత్రి పేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలంతా తండ్రీకొడుకుల పని అయిపోయిందని భావిస్తున్నారని, పార్టీని జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తే తప్ప కాపాడలేరనే భావనలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు. ఆఖరికి బుచ్చయ్య చౌదరి కూడా ఇదే మాట మాట్లాడారని గుర్తుచేశారు. 

తండ్రీకొడుకులు నిర్లజ్జగా మాట్లాడుతున్నారని, ఇదంతా జూ.ఎన్టీఆర్‌ అనే భయంలోంచి వచ్చిన దిగజారుడు రాజకీయమేనని తేటతెల్లం అవుతుందన్నారు. కొడుక్కు మంచి మాటలు, బుద్దులు చెప్పలేకపోయిన చంద్రబాబు.. తండ్రీగా ఫెయిల్‌ అయిపోయాడు అని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలన్నారు.  

బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ఓటు వేయాలని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఎంతసేపు మతం, దేవుడు, చీకట్లో దేవతామూర్తుల ప్రతిమలను ధ్వంసం చేయడం.. ఉదయాన్నే మళ్లీ పొర్లుదండాలు పెట్టడం, గుండెలు బాధుకోవడం బీజేపీ వంతు అయిందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది మతం కాదు.. మానవత్వం కావాలి. మానవత్వం లోపించి.. మత విద్వేషాలను ఎజెండాగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

 

Back to Top