విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ధృడ సంకల్పంతోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యమైందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే ధృడ సంకల్పం వైయస్ జగన్‌ది అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి పేర్నినాని మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఆర్టీసీ కుటుంబం తరఫున సీఎం వైయస్ జగన్ తెగువైన నిర్ణయానికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్టీసీని సంపూర్ణంగా విలీనం చేసేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో, ప్రభుత్వంలో చట్టాలు ఉంటాయి. రూల్స్ ఉంటాయి. కోర్టులు ఉంటాయి. వీటన్నింటిని తప్పుకుంటూ గమ్యం చేరాల్సిన పరిస్థితి. బస్సులో కూర్చున్న ప్రయాణికుడికి ఏం తెలుసు..బస్సు నడిపే డ్రైవర్ బాధలు. బస్సు బయటకు తీసినప్పటి నుంచి దారిలో ఎవడు తాగి వస్తాడో, బాధ్యత లేకుండా ఎవరు నడుతుంటారో అన్న భయంతో ఉంటారు. పద్మవ్యూహ్యం కృష్ణుడి మాదిరిగా ఛేదించాల్సిందే. ఎక్కడా యాక్సిడెంట్ కాకుండా, నిద్రపోకుండా జాగ్రత్తగా ప్రయాణికుడిని గమ్యం చేర్చాలంటే ఎంత ఓపిక ఉండాలో డ్రైవర్‌కే తెలుసు. వైయస్ జగన్ కూడా బస్సును గమ్యం చేర్చే వరకు మీకు తోడుగా ఉంటారు. 2014 ఎన్నికల్లో రైతులందరికీ బేషరత్తుగా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంత డబ్బు సృష్టించడం తన వల్ల కాదని వైయస్ జగన్ రుణమాఫీ హామీ ఇవ్వలేదు. చంద్రబాబు అలవి కాని మాటలు చెబుతున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే..నా అనుభవంతో రైతుల అప్పులన్ని మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయనను రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. వారితో పాటు ఆర్టీసీ కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. 2017లో చంద్రబాబును కార్మిక సంఘం నాయకులు వార్షికోత్సవ సభలో ఆర్టీసీ విలీనం గురించి ప్రస్తావిస్తే ..విలీనం వంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు..ఆర్టీసీ నాశనం అవుతుందని చెప్పిన అనుభవజ్ఞుడు చంద్రబాబు. వైయస్ జగన్‌కు అలాంటి అనుభవం లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినా సరే ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ అప్పు కొండలా పెరిగిపోతున్నా..పీఎఫ్ డబ్బులు లాగేస్తున్నారు. సీసీఎస్ డబ్బులు కూడా కాజేస్తున్నారు. రిటైర్డు అయిన తరువాత రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. 2013, 2017 పీఆర్సీ అప్పు తీర్చడం లేదు అన్న బలమైన అభిప్రాయంతో ఉన్న ఆర్టీసీ కార్మికులు పాదయాత్రలో వైయస్ జగన్‌ను కలిశారు. ఆర్టీసీని విలీనం చేస్తేనే మాకు భద్రత ఉంటుందని చెబితే..మారు మాట్లాడకుండా, ఎవరితో ఆలోచించకుండా వెనువెంటనే వైయస్ జగన్ ఓ మాట అన్నారు. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తే..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఎలాంటి కమిటీలు వేయకుండా ఆర్టీసీని విలీనం చేయబోతున్నానని ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వైయస్ జగన్ తన నిర్ణయాన్ని ఐఏఎస్ అధికారులకు చెప్పారు. నాతో పాటు అందరూ వైయస్ జగన్ తొందర పడుతున్నారని అనుమానం ఉండేది. ఎలా విలీనం చేస్తారని అందరూ భావించారు. 53 వేల మంది జీతభత్యాలు రూ.4 వేల కోట్లు సంవత్సరానికి భరించే స్థోమత ప్రభుత్వానికి ఉందా? చంద్రబాబు పసుపు కుంకుమకు ఉన్న డబ్బులన్నీ కాజేశారు. ఇది సముచితమైన నిర్ణయం కాదేమో అనుకున్నాం. సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అనుమానంవ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు కూడా నమ్మకం కుదరలేదు. ఇది సాధ్యమా అన్న సందేహాలు ఉండేవి. సంపూర్ణమైన విశ్వాసం కేవలం వైయస్ జగన్‌కు ఒక్కరికే ఉండేది. విలీనం ఎలా సాధ్యం అని మంత్రి కాగానే ఆలోచన చేశాం. వైయస్ జగన్‌కు ఉన్న దృఢమైన సంకల్పం ఉండబట్టే విలీనం సాధ్యమైంది.