ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ ఆమోదం

3 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ  విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు

ఇసుక కొత్త పాలసీకి కేబినెట్‌ ఆమోదం

సొంతంగా ఆటో, కార్లు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు

 మంత్రి పేర్ని నాని

అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలపినట్లు మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు కొత్త ఇసుక పాలసీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సచివాలయంలో ఉదయం నుంచి నిర్వహించిన కేబినెట్‌ సమావేశం వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ సిబ్బందికి వర్తిస్తాయన్నారు. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. బస్సు చార్జీ నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీకి ఉన్న రూ.330 కోట్ల నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రజా రవాణా శాఖ కాంట్రాక్టులోకి ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులు వస్తారని చెప్పారు. 

సరసమైన ధరకే ఇసుక: 
గతంతో పోల్చితే భారీగా ఇసుక ధర తగ్గనుందని చెప్పారు. చట్టబద్ధంగా నేరుగా వినియోగదారులకు ఇసుక అందించడమే లక్ష్యంగా కొత్త ఇసుక పాలసీని రూపొందించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లను సిద్ధం చేశామన్నారు. వీటిని ఆక్టోబర్‌ మాసానికి 70 స్టాక్‌ పాయింట్లు చేస్తామన్నారు. క్రమేనా ఇంకా పెంచాల్సి ఉందన్నారు. ప్రజలకు అతి సులభంగా సరసమైన ధరలకు ఇసుక అందిస్తామన్నారు. టన్ను ఇసుక రీచ్‌ల వద్ద రూ.370గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతుల పట్టా భూముల్లో ఇసుక నిక్షేపం ఉంటే దాన్ని ప్రభుత్వం టన్నుకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.60 చొప్పున చెల్లించి తీసుకుంటామన్నారు. ఏపీఎంబీసీనే నేరుగా ఇసుక తవ్వుకొని వినియోగదారులకు అందజేస్తుందన్నారు. ఇసుక రవాణాలో అత్యంత పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక అందజేస్తామన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు వినియోగదారులకు అందజేస్తామన్నారు. జీపీఎస్‌ అమర్చిన వాహనాల్లో ఇసుక చేరవేస్తామన్నారు. ఇసుక కొనుగోలుదారు లారీ నంబర్‌తో సహా ట్రాక్‌ కూడా ఫాలో కావచ్చు అన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు సరసమైన ధరకే ఇసుక అందజేస్తామన్నారు. ఇసుక స్టాక్‌ యార్డు పెట్టుకునేందుకు ఏపీఎంబీసీకి మాత్రమే అనుమతి ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాను నిషేధించామని చెప్పారు. 
సొంతంగా ఆటో, కారు నడుపుకునే వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. ఇందులో భార్య, భర్త ఒక యూనిట్‌గా, ఆ కుటుంబంలో మేజరైన కొడుకు, కూతురు ఇదే వృత్తిలో ఉంటే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణిస్తామన్నారు. ఈ ఆర్థికసాయం పొందిన వారు వాహనాల ఫిట్‌నెస్‌, రిపేర్లు చేయించుకోవడం, ఇన్సూరెన్స్‌కు ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని వర్గాలకు మంచి చేయాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి తోడుగా నిలవాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top