ప్రజలను మభ్యపెట్టేందుకే ‘ఈనాడు’ తప్పుడు రాతలు

కంకరకు వంకర లేదు.. నేతలకు మేత అంతకంటే లేదు

ఈ రాతలతో బాబు తలరాతను మార్చాలనుకోవడం దురదృష్టకరం

తప్పు ఎక్కడ జరిగిందో నిరూపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఈనాడు పత్రిక కల మాత్రమే

చంద్ర‌బాబు హయాంలోనే విశాఖ‌లో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ భూకుంభకోణం జరిగింది

విద్యుత్, అటవీ, గనులు, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

విజయవాడ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక క్యాప్షన్‌ పెట్టి.. వార్త రాసి.. ఈ రాతలతో చంద్రబాబు తలరాత మార్చాలనుకోవడం చాలా దురదృష్టకరమని విద్యుత్, అటవీ, గనులు, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిర్దిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ తన శాఖలో ఏదో తప్పు జరిగిపోయిందని వక్రీకరించేలా రాతలు రాయడం బాధాకరమన్నారు. కంకరకు వంకర లేదు.. నేతలకు మేత అంతకంటే లేదని ఈనాడు తప్పుడు వార్తలను కొట్టిపారేశారు. తన శాఖలో తప్పు జరిగితే పలానా చోట, పలానా వ్యక్తి చేశాడని రాస్తే బాగుంటుంది.. అదేదీ లేకుండా ప్రభుత్వం మీద బురదజల్లేలా తప్పుడు రాతలు రాయడం మంచిది కాదన్నారు. ఈనాడు విషపు రాతలను ఖండిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన శాఖలో తప్పులు జరిగి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే చాలా మంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నాం. అవకతవకలకు పాల్పడిన లీజుదారులపై కూడా చర్యలు తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా కేవలం వక్రీకరించాలి. ఏదోరకంగా చంద్రబాబును పైకి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. కానీ, రాజకీయంగా చంద్రబాబుకు నడిచే సామర్థ్యమే లేదని,  అలాంటి వ్యక్తిని ఎంత పైకిలేపినా మళ్లి చతికిలపడిపోవడమే తప్ప టీడీపీ అధికారంలోకి రావడం ఈనాడు పత్రిక కల అని మంత్రి పెద్ది అన్నారు. 

విశాఖ రాజధాని కాకూడదని, మూడు రాజధానుల నిర్ణయం అమలు జరగకూడదని చంద్రబాబు సహకారంతో ఎల్లోమీడియా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని బాబు పత్రికలు కుయుక్తులు పన్నుతున్నాయన్నారు. విశాఖలో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ ల్యాండ్‌ స్కామ్‌ టీడీపీ హయాంలో జరిగిందని ఇదే ఎల్లో పత్రికల్లో రాశారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. దొంగ ఒకరైతే మరొకరిని దొంగను చేసి.. తప్పు చేసిన దొంగను దొరను చేసేలా ఈనాడు పత్రిక ప్రవర్తిస్తోందని, కుక్కతోకలా బుద్ధి కూడా వంకరగానే ఉంటే ఏం చేయలేమన్నారు.

 

Back to Top