కృష్ణా: ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆరాటపడే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొడాలి నాని ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి ప్రజా సంక్షేమ పాలన గురించి వివరించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. గుడివాడలో ముఖ్య సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కనీవినీ ఎరుగని విధంగా గుడివాడను అభివృద్ధి చేస్తానన్నారు. వైయస్ జగన్ జీవించి ఉన్నంత కాలం మనం ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని, అందుకోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలన్నారు.
గడప ముందుకే పాలన..
చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు పేద ప్రజలను దోచుకుతిన్నాడని మండిపడ్డారు. వైయస్ జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్లు లేక పేదలు అల్లాడుతుండేవారన్నారు. డిసెంబర్ 21 ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజున గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని, నియోజకవర్గంలో ఇల్లు లేదని ఒక్క పేదవాడు అడిగినా 2024లో ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. నాలుగు లక్షల మంది వలంటీర్లతో ప్రజలకు పాలన అందుబాటులోకి తెచ్చామని, ప్రతి సంక్షేమ పథకం పేదల గడప ముందుకే వస్తుందని చెప్పారు.
అనుకూల ఓటు మాత్రమే ఉంది..
పని పాటాలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడతామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని, మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన వైయస్ జగన్ ప్రభుత్వానికి అనుకూల ఓటు మాత్రమే ఉందన్నారు. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా.. వైయస్ఆర్ సీపీకి ఊడేది ఏమీ లేదని, మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలన్నారు. 151సీట్లు పక్కగా తిరిగి వైయస్ఆర్ సీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.