కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌కు మున్సిప‌ల్ ఫ‌లితాలే నిద‌ర్శ‌నం

కుప్పం ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలి

టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఇస్తే మంచిది

హైదరాబాద్‌కు పరిమితమై.. పరువు కాపాడుకోవాలి

మాపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా స్పందిస్తానో మున్ముందు చూస్తారు

చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిక

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పట్టారని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోంది కాబట్టే.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ భూస్థాపితమైందన్నారు. కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, హైదరాబాద్‌కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. కుప్పం వచ్చి చంద్రబాబు, లోకేష్‌ నోటికి వచ్చినట్టుగా మాట్లాడారని, ఎవరైనా మా గురించి చెడ్డమాటలు మాట్లాడితే.. దానికి ఏ విధంగా స్పందిస్తానో మున్ముందు నీకే తెలుస్తుందని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.  

కుప్పం మున్సిపాలిటీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమికి సాకులు వెతికే పనిలో చంద్రబాబు ఉన్నారని, ప్రజా తీర్పును గౌరవించడం చేతగాని చంద్రబాబు.. దొంగ ఓట్లు వేయించారని మరోసారి వైయస్‌ఆర్‌ సీపీ మీద బురదజల్లడానికి ప్రయత్నిస్తాడన్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా దౌర్జన్యం చేసిందో రాష్ట్రమంతా చూసిందన్నారు. విజయవాణి హైస్కూల్‌ను మొత్తం ధ్వంసం చేసి.. అక్కడున్న  మహిళలపై దాడి చేశారన్నారు. దౌర్జన్యకాండను అడ్డుకొని ఎన్నికలు జరిగాయి కాబట్టే టీడీపీ పరాజయం పాలైందన్నారు. 

సర్పంచ్‌ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు గెలిచారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధించిందన్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. కుప్పం మున్సిపల్‌ కౌంటింగ్‌కు  స్పెషల్‌ ఆఫీర్‌ను నియమించి, కౌంటింగ్‌ను రికార్డు చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చారని, అందుకు వైయస్‌ఆర్‌ సీపీ సంతోషిస్తుందన్నారు. ప్రజలంతా ఛీ కొట్టిన తరువాత కూడా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడుతాడని అనుకోవడం లేని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఎన్టీఆర్‌ పార్టీని లాక్కొని.. ఆ పార్టీని సున్నాకు తీసుకువచ్చాడని, సొంత నియోజకవర్గంలోనే పార్టీ మూలాలు లేకుండా చేసుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగడం హేయంగా ఉంటుందన్నారు. ఇకనైనా తప్పుకొని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. 

వైయస్‌ఆర్‌ కుమారుడు చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. నా కుమారుడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఇన్ని బాధలు ఉన్న చంద్రబాబు.. వయస్సు రీత్యా కూడా ఆలోచన చేసి తక్షణమే హైదరాబాద్‌కు పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదని సూచించారు. అయినా రాజకీయాల్లో కొనసాగుతాను.. నాకు సిగ్గు, ఎగ్గు ఏమీ లేదు అని అనుకుంటే ఆయన ఇష్టమన్నారు. 

 

Back to Top