తాడేపల్లి: చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా ఒకటిన్నర సంవత్సరంలోనే మేనిఫెస్టోలోని వాగ్దానాలను 90 శాతం అమలు చేయడంతో పాటు.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేసిన ఏకైక సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విలక్షణ పాలన సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో చూస్తున్నామన్నారు. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలను భాగస్వామ్యం చేస్తూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముందుకెళ్తున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది డ్వాక్రా సంఘాలకు వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం అమలు కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ఏం మాట్లాడారంటే.. ఇప్పటి వరకు అమ్మఒడి, వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర్ చేయూత ఇలా 21 పథకాల ద్వారా 4.65 కోట్ల లబ్ధిదారులకు రూ.82,368 కోట్ల 31 లక్షలు ఇవ్వడం చరిత్ర. గత సంవత్సరం చంద్రబాబు పరిపాలనలో ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు కూడా మాఫీ చేయలేదు. సున్నావడ్డీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు ప్రయత్నించారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక గత ఏడాది 8,78,874 సంఘాలకు రూ.1400 కోట్లు ఇవ్వడం జరిగింది. సీఎం వైయస్ జగన్ మాటిస్తే నెరవేరుస్తారనే నమ్మకంతో స్వయం సహాయక సంఘాలన్నీ రుణాలు సకాలంలో చెల్లించడంతో ఈ సంవత్సరం ఎక్కువ సంఘాలకు వడ్డీ చెల్లిస్తున్నాం. దాదాపు 9,34,852 సంఘాలకు ఈ సంవత్సరం వడ్డీ రూ.1109 కోట్లు ఇస్తున్నాం. సీఎం వైయస్ జగన్ స్టేట్ లెవల్ బ్యాంకర్లతో మాట్లాడి అంతకు ముందున్న 12.5 శాతం వడ్డీ భారాన్ని 9.5 శాతానికి తగ్గించారు. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.590 కోట్లు ఆదా అయ్యింది. ఇది ఎక్కువగా రుణాలు తీసుకునే లబ్ధిదారులకూ ఉపయోగపడుతుంది. సీఎం వైయస్ జగన్ మాట ఇచ్చారంటే నెరవేరుస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఒక క్యాలెండర్ ఇచ్చి తేదీలు ముందుగానే ప్రకటించి పథకాలు అమలు చేస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. ప్రతి పథకం అక్కచెల్లెమ్మల పేరుమీద అమలు చేస్తున్న సీఎం వైయస్ జగన్‌కు మహిళా లోకం అంతా అండగా ఉంటారు’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.