కోడిగుడ్డు మీద ఈకలుపీకే రకం చంద్రబాబు 

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం లీజులు పునరుద్ధరించాం

లీజుల వ్యవహారాన్ని సీఎంకు అంటగట్టడం సిగ్గుచేటు

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేకే టీడీపీ దుష్ప్రచారం

ప్రభుత్వంపై బురదజల్లడమే ఎల్లోమీడియా పనిగా పెట్టుకుంది

టీడీపీ హయాంలో ఇచ్చిన 30 లీజుల సంగతేంటి చంద్రబాబూ..?

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక హైదరాబాద్‌లో కూర్చొని తన తోక మీడియాలతో ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నాడని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల లీజుల వ్యవహారాన్ని సీఎం వైయస్‌ జగన్‌కు అంటగట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సరస్వతి పవర్‌ కంపెనీ లీజ్‌ పునరుద్ధరించామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 30 లీజులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘అంతకుముందు ప్రభుత్వం 18–05–2009లో సరస్వతి పవర్‌ కంపెనీకి 30 ఏళ్లకు ఇచ్చిన భూమి లీజ్‌ను 2014లో చంద్రబాబు రద్దు చేశారు. దీనిపై కోర్టుకు వెళితే.. కోర్టు 15–10–2019న డైరెక్షన్‌ ఇచ్చింది. పాత బకాయిలను క‌ట్టించుకొని కోర్టు ఉత్తర్వుల ప్రకారం 12–12–2019న లీజ్‌ను పునరుద్ధించాం. కేంద్ర ప్రభుత్వ (ఎంఎండీఆర్‌) యాక్టు సెక్షన్‌ 8ఏ(2) నిబంధనల ప్రకారం 50 ఏళ్లు లీజ్‌ పొడిగిస్తూ 08–06–2020న ఉత్తర్వులు ఇచ్చాం. సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. దీనిపై చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు 30 కంపెనీలకు 50 సంవత్సరాలకు భూములు లీజుకు ఇచ్చాడు. హైకోర్టు డైరెక్షన్‌ ప్రకారం లీజ్‌ను పునరుద్ధరించాం. 

చంద్రబాబు అధికారంలో ఉండగా 30 కంపెనీలకు లీజ్‌లు ఏ విధంగా ఇచ్చారు. 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. భూముల లీజులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఆపాదించడం సిగ్గుచేటు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క లీజ్‌ కోసం పత్రికలు అర పేజీ కథనం రాస్తే.. 30 లీజుల కోసం ఎన్ని అర్థపేజీల్లో కథనాలు రాయాలో ఆ పత్రికలే ఆలోచించుకోవాలి. తప్పుడు వార్తలతో గోబెల్స్‌ ప్రచారం చేయడం మానుకోవాలి. 

2016 నుంచి ఎన్నికలకు ముందు 12–2–2019 వరకు వివిధ కంపెనీలకు చంద్రబాబు లీజులు ఇచ్చాడు. 395.150 హెక్టార్ల భూమిని కొలిమిగుండ్ల అనే గ్రామ సమీపంలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు ఇచ్చాడు. ఇండస్ట్రీస్‌కు సర్వసాధారణంగా ఇచ్చే లీజ్‌లను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. హైదరాబాద్‌లో కూర్చొని ఏం పనిలేక కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని చంద్రబాబు అవలంబిస్తున్నాడు. ఆయన మాటలను కొన్ని పత్రికలు, చానళ్లు వాస్తవాలుగా ప్రచారం చేయడం దురదృష్టకరం. 

ఈ మధ్యకాలంలో పంచాయతీ రాజ్‌ డిపార్టుమెంట్‌పై పచ్చపత్రికలు అసత్యప్రచారాలు చేశాయి. నిబంధనల ప్రకారం బ్లీచింగ్‌ కొనుగోలు చేస్తే.. రూ.70 కోట్లకు కొన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు ప్రచారం చేసింది. వాస్తవానికి రూ.5.90 కోట్లకు కొనుగోలు చేశాం. రూ.74.69 లక్షలు మాత్రమే చెల్లించాం. ఇంకా రూ.5.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. బ్లీచింగ్‌ నాణ్యతపై అనుమానాలు వచ్చి ల్యాబ్‌లకు పంపించాం. ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తరువాత కొనుగోలు చేసిన గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్‌ పంచాయతీ రాజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా రిపోర్టులు వస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. రూ.5.90 కోట్లకు కొనుగోలు చేస్తే.. రూ.70 కోట్లకు కొనుగోలు చేశామని వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. 

ఎన్నికల్లో రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు.  రూ.87,612 రైతు రుణాలను మాఫీ చేయకుండా.. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అని చెప్పి రూ.24 వేల కోట్లకు కుదించి దాంట్లో కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చి మొత్తం రుణమాఫీ చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు.’ 
 

Back to Top