చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చేరినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలోని సంతపేటలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాలు సింగిల్‌గానే వస్తాయని.. అలాగే రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. చిత్తూరులో విజయానంద రెడ్డి సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తారని పేర్కొన్నారు. టీడీపీలో ఎంతమంది చేరినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. చిత్తూరులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు.. ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానని అంటారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో బాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు.. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని దుయ్యబట్టారు.. ఎన్నికల వేళ చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.