అందరికీ అందుబాటులో సినిమా వినోదం

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలపై అసెంబ్లీలో చర్చ

అసెంబ్లీ: సినిమా వినోదం అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేలా ఉండకూడదని సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేశామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా అనగానే తమకి ఎదురుండకూడదన్న ధోరణిలో కొందరు ఉన్నారని, పేద, మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని, ఇకపై అలాంటి దోపిడీ ఉండకూడదనే చట్టంలో మార్పులు చేశామన్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, తెల్లవారక ముందు నుంచి మొదలుపెట్టి.. అర్ధరాత్రుల వరకు.. రోజుకు 6 నుంచి 8 షోలు వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారన్నారు. 

ఇష్టానుసారం సినిమా టికెట్‌ ధరలను పెంచుకుంటూ పోతున్నారని, రూ. 300, 500, 1000, 1500 ఇష్టానుసారంగా టికెట్లు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని, అందుకే ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని మంత్రి పేర్ని నాని వివరించారు. సినిమా ఉత్సాహాన్ని అడ్డుపెట్టుకొని సినీ అభిమానులను దోపిడీ చేయాలనుకోవడం తప్పు అని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలన్నారు. సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండే ధరకి టికెట్లను తీసుకొస్తామని తెలిపారు. కొనేవాళ్లకు, అమ్మేవాళ్లకు లేని ఆలోచన మీకెందుకని కొందరు అత్యుత్సాహపరులు, అతితెలివి గలవారు మాట్లాడుతున్నారని, సినిమాను అడ్డుపెట్టుకొని ప్రజలను దోపిడీ చేయాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. 

రాష్ట్రంలోని దాదాపు 11 వందల సినిమా థియోటర్లలో ప్రభుత్వం రూపొందించే ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమలవుతుందని చెప్పారు. అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో బస్సు, ట్రైన్, ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నంత సులువుగానే.. సినిమా టికెట్లు కూడా బుక్‌ చేసుకొని దర్జాగా సినిమాకు వెళ్లే పరిస్థితిని కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటు థియేటర్లలో కూడా టికెట్లు లభిస్తాయన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరు తమ విధానాలను స్వాగతించారని చెప్పారు. అందరితో చర్చించి.. సులభమైన, అనువైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.  
 

Back to Top