గుజరాత్‌ నుంచి మన మత్స్యకారులను తీసుకువస్తున్నాం

సీఎం వైయస్‌ జగన్‌ చొరవతోనే ఇది సాధ్యమైంది 

3,838 మందిని 65 బస్సుల్లో తీసుకువస్తున్నాం

క్వారంటైన్‌ పూర్తయిన తరువాతే వారందరిని ఇంటికి పంపిస్తాం

వలస కూలీలను స్వగ్రామాలకు పంపిస్తాం

పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

తాడేపల్లి: గుజరాత్‌లో చిక్కుకున్న సుమారు 4 వేల మంది మత్స్యకారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహనరెడ్డి చొరవతో రాష్ట్రానికి చేరుకుంటున్నారని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. 65 బస్సుల్లో వారందరినీ రాష్ట్రానికి తీసుకువస్తున్నామని మంత్రి చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. మూడు రాష్ట్రాలను దాటి తీసుకురావాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీలతో ఇప్పటికే మాట్లాడారు. 

65 బస్సుల్లో మత్స్యకారులందరినీ రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. సొంత గ్రామాలకు చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తోంది. వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ రూ. 3 కోట్ల నిధులను కేటాయించారు. 3,838 మందిని 65 బస్సుల్లో రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. 54 బస్సులు ఇప్పటికే బయల్దేరాయి. మరో 2 గంటల్లో మిగిలిన బస్సులు కూడా బయల్దేరుతాయి. రాష్ట్రానికి వస్తున్న అందరినీ క్వారంటైన్‌కు పంపిస్తాం. క్వారంటైన్‌ ముగిసిన తరువాతే ఇళ్లకు పంపిస్తాం. 

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న వలస కూలీలను కూడా స్వగ్రామాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వలస కూలీలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆక్వా ఉత్పత్తులకు తొలిసారి ప్రభుత్వమే ధరలు నిర్ణయించి రైతులను ఆదుకుంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే.. మరోవైపు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం' అని మంత్రి మోపిదేవి వెంకట రమణ వివరించారు.  
 

Back to Top