గుంపులుగా తిరగొద్దు.. వ్యాధిని కొనితెచ్చుకోవద్దు

ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటేనే మంచిది

కరోనా నియంత్రణ చర్యలపై సీఎం నిరంతరం సమీక్షిస్తున్నారు

విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం

ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియా బాధ్యతాయుతంగా సహకరించాలి

క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు

వలంటీర్లపై టీడీపీ అసత్య ప్రచారాలు చేయడం తగదు

చంద్రబాబు, టీడీపీ నేతలపై మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం

గుంటూరు: విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజూ సమీక్షలు జరుపుతూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వలంటీర్లపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయడం తగదని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ అన్నారు. 

గుంటూరులో మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. "ప్రజలెవరూ గుంపులుగా తిరగొద్దు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వ్యాధిని కొనితెచ్చుకోవద్దు. ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవడమే కరోనా నివారణ ఏకైక మార్గం. గుంటూరులో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్న నిత్యావసర కొనుగోలు సమయాన్ని 6 నుంచి 9 గంటల వరకు కుదించాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సహకారం కావాలి. 

అనవసరంగా యువకులు రోడ్ల మీదకు రావొద్దు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోనే ఉంటే మంచిది. తప్పనిసరి పరిస్థితి అయితే 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే అన్ని చక్కబెట్టుకోండి. ఎక్కడా గుంపులుగా తిరగొద్దు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి వ్యాధిని కొనితెచ్చుకోవద్దు. ప్రజలకు అవగాహన కల్పించే సమాచారం చేరవేసే విషయంలో ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియా బాధ్యతాయుతంగా సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తిగా బాధ్యతాయుతంగా కోవిడ్‌ నియంత్రణకు కృషి చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిరంతరం కరోనా వైరస్‌ నియంత్రణకు సమీక్షలు జరుపుతూ అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రభుత్వ చర్యలను రాజకీయ కోణంలో మాట్లాడుతూ వారి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేని గృహ నిర్బంధం చేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారు.  రాజకీయ పబ్బం కోసం మీ శాసనసభ్యుడు పబ్లిసిటీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే సమర్థిస్తారా.. ఇది ఎంతవరకు సమంజసం. 

వీడియో, టెలికాన్ఫరెన్స్‌లతో రైతుల సమస్యలను తీర్చలేమని 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఆక్వారంగం పూర్తిగా ఇబ్బందుల్లో ఉంటే వారి సమస్యలను పరిష్కరించేందుకు రైతులతో ప్రజాప్రతినిధులుగా చర్చలు జరిపాం. ఆక్వాఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఎగుమతిదారులను ఆదేశించాం. అదే విధంగా రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుంది. 

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సహకరించకపోయినా ప్రజలు ఇబ్బందులు పడకూడదని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 15 కిలోల బియ్యం, కిలో కందిపప్పు అందిస్తున్నాం. ప్రతి ఇంటికి రూ.1000 నగదును వలంటీర్ల ద్వారా అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. కోటి 30 లక్షల మంది లబ్ధిదారులకు రెండ్రోజుల్లోనే బియ్యం, వెయ్యి రూపాయల నగదు అందించాం. వలంటీర్లపై కూడా చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ ఫలాలు అందించడం మంచిదా..? లేక అందరూ గుంపులుగా చేరి తీసుకోవడం కరెక్టా..? హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు" అని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top