విజయవాడ: అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులను మంత్రి మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్ వర్కులు అనుకున్న సమయానికి పూర్తవుతాయని తెలిపారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు.. మంత్రి కి వివరించారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలని మంత్రి సూచించారు. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్‌కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.