ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..?

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున బహిరంగ సవాల్‌

ఎస్సీ, ఎస్టీల‌కు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు

దళిత లోకమంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తుంది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సామాజిక పథకాలే రాష్ట్రానికి శ్రీరామరక్ష 

అమరావతి: సమాజంలో ద‌ళితుల‌ను తలెత్తుకొని తిరిగేలా చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంటే దళిత లోకం నడుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో తనతో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఏనాడైనా దళిత, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన మేలును మంత్రి మేరుగు నాగార్జున లెక్కలతో సహా వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘స్వయం ఉపాధి పథకాలు, బ్యాంక్‌ రుణాలకు సంబంధించి గతం కంటే వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అవకాశాలు, అభివృద్ధి జరిగింది. చంద్రబాబు హయాంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి పేదరికంపై గెలుపు అనే పేరుతో ఐదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రూ.3010.08 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో వైయస్‌ఆర్‌ చేయూత, ఆసరా ఏ పథకం అయినా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లలో రూ.7,132.08 కోట్ల ఆర్థికసాయం అందింది. చంద్రబాబు ఐదేళ్ల పాలన కంటే సీఎం వైయస్‌ జగన్‌ మూడేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాల కింద రూ.4,122 కోట్లు అధికంగా అందాయి. 

బ్యాంక్‌ రుణాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 2019–20లో రూ.15,791 కోట్లు, 2020–21లో రూ.18,689 కోట్లు, 2021–22లో రూ.28.577 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.63,057 కోట్ల ఆర్థిక సాయాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అందించింది. ఈ లెక్కలన్నీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తెలియపర్చిన వాస్తవాలు. 

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు రద్దు చేశారని, బ్యాంక్‌ రుణాలు అందించడం లేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. మళ్లీ మళ్లీ అడుగుతున్నా.. సంక్షేమం, సబ్‌ప్లాన్‌ ఖర్చు, స్వయం ఉపాధికి సంబంధించి బ్యాంక్‌ రుణాల విషయంపై నాతో బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్‌ విసురుతున్నా..

అంతేకాకుండా 6,15,504 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ద్వారా ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతమంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. స్టడీ సర్కిల్, విశాఖపట్నంలో సివిల్, విజయవాడలో గ్రూప్స్, తిరుపతిలో బ్యాంక్‌ శిక్షణలకు సంబంధించి 10,976 ఎస్సీ విద్యార్థుల కోసం మూడున్నరేళ్లలో రూ.12.75 కోట్లు ఖర్చు చేశాం. పచ్చి అబద్ధాలతో రాష్ట్రంలోని దళితులను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. 

విదేశీ విద్య పేరుతో చంద్రబాబు హయాంలో అనేక అవకతవకలు జరిగాయి. దీనిపై విజిలెన్స్‌ ఎంక్వైరీ జరుగుతోంది. ఒక కోర్సుకు పర్మిషన్‌ తీసుకొని మరొక కోర్సు, ఒక దేశమని చెప్పి మరో దేశం, ఒక ఇంట్లో ఒకరికే అవకాశమని.. ఇద్దరు ముగ్గురు ఇలా అనేక అవకతవకలు జరిగాయి. దాన్ని మూలనపెట్టి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయాడు. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం గరిష్టంగా రూ.1.20 కోట్ల నగదును 200 టాప్‌ యూనివర్సిటీల్లో చదివే పిల్లలకు అందజేస్తుంది. దాన్ని కూడా డిపార్టుమెంట్‌ వారీగా బైఫరికేషన్‌ చేశాం. 

కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ఎత్తేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సమాజంలో చదువే విలువైనది అని, చదువుతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆలోచించిన సీఎం వైయస్‌ జగన్‌.. వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫాకు పదో తరగతి ఉత్తీర్ణత నిబంధన తెచ్చారు. అక్షరాస్యత పెంచేందుకు తీసుకున్న నిర్ణయం కూడా చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తోంది. పేదలు చదుకోకూడదా..? పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోవాలని చంద్రబాబు ఉద్దేశమా..? 

జగనన్న ఇళ్ల పథకం కింద ఎస్సీల్లో 6,36,732 మందికి రూ.15,918 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను అందించాం. అందులో 4,18,646 మందికి రూ.10,949 కోట్లతో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. చంద్రబాబు పట్టుమని పది ఇళ్లు ఇచ్చాడా చెప్పమనండి. 

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పట్ల సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ఈ గణాంకాలే గీటురాయి. మమ్మల్ని నాయకులిగా నిలబెట్టిన సీఎం వైయస్‌ జగన్‌ వెంటే దళితలోకం నడుస్తుంది. కల్లబొల్లి మాటలు చెప్పే చంద్రబాబు లాంటి వ్యక్తిని  ఎవ్వరూ నమ్మరు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి, సామాజిక పథకాలే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్షగా మిగలబోతున్నాయి’’ అని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.  
 

Back to Top