దళిత సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..?

చంద్రబాబు మరోసారి ఛాలెంజ్‌ విసిరిన మంత్రి మేరుగు నాగార్జున

సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరిగిందని బాబు నిరూపించగలడా..?

ఇన్నోవా కార్లు ఎవరికి, ఎంతకి ఇచ్చారో చర్చకు లోకేష్‌ సిద్ధమా..?

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తుంది 

అమరావతి: చంద్రబాబు నిజమైన మనిషివి అయితే.. రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎస్సీల సంక్షేమంపై చర్చకు రావాలి.. దళిత సంక్షేమం, దళిత అభివృద్ధి, దళితులపై దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో పైసా అవినీతి జరిగిందని చంద్రబాబు నిరూపించగలడా అని సవాల్‌ విసిరారు. దళితుల మీద తుపాకీ పెట్టి ముఖ్యమంత్రిని కాల్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు.  దళితులకు సహాయం చేసే వ్యక్తిని, పేదలకు అండగా ఉండే వ్యక్తిని, మమ్మల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువస్తున్న నాయకుడి మీద బురదజల్లాలని, కుయుక్తులు పన్నాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

అమరావతిలోని సచివాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ముఖ్యమంత్రులు కూడా ఇంతగా దళితుల అభ్యున్నతికి కృషిచేయలేదని, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. . 

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 4 వేల ఇన్నోవాలు ఇచ్చానని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. చర్చకు లోకేష్‌ వస్తాడో, చంద్రబాబు వస్తాడో రండీ.. టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై చర్చిద్దామన్నారు. ఇన్నోవా కార్లు ఎవరికి ఇచ్చారో, ఆ కార్ల కోసం ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారో అంతా చర్చిద్దామని లోకేష్‌కు సవాల్‌ విసిరారు. టీడీపీ హయాంలో ఇన్నోవాలన్నీ బినామీలకే ఇచ్చారని, పేదవాడికి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 
 
వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు. మా నాయకుడు పేదప్రజలను పైకి తీసుకురావాలనే ఆలోచనలతో పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం.. ప్రజల్లో నిరంతరం ఉంటాం.. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోరతాం అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఒక పక్క రైతులను మోసం చేయాలని చంద్రబాబు, ప్రజలను మోసం చేయాలని కొడుకు రోడ్ల వెంట తిరుగుతున్నారన్నారు. 
 

Back to Top