బాధ్యులెవరైనా వదిలిపెట్టం

ఎంతటివారైనా సరే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధ్యులెవరైనా వదిలిపెట్టే సమస్య లేదని, ఎంతటివారైనా సరే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల బృందం గ్యాస్‌ నియంత్రణ చేస్తోందని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ట్యాంకర్‌లో ఉన్న రసాయనంలో 60 శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుందని, ఇందుకు 48 గంటల సమయం పడుతుందని నిపుణులు వెల్లడించారని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 86 కంపెనీలను గుర్తించామని, ఈ కంపెనీల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. పరిశీలన తరువాతే కంపెనీలు పునః ప్రారంభించనున్నామని వివరించారు. నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

ముందు జాగ్రత్త కోసమే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలను వేరే చోటకు తరలించామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులను పరామర్శించారని, ప్రజల బాధను కళ్లారా చూశారు కాబట్టే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఎవరూ ఊహించని విధంగా ఆర్థికసాయం ప్రకటించారన్నారు.
 

Back to Top