ఐఎస్‌బీతో ఒప్పందం.. పాల‌న‌లో కొత్త ఒర‌వ‌డి ప్రారంభం

ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డంలో ఐఎస్‌బీది కీల‌క పాత్ర‌

రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యం

ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి

విజయవాడ: ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం జ‌రిగింద‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఐఎస్‌బీ ఒప్పందం కుదుర్చుకోవడంతో పరిపాలనలో కొత్త ఒరవడి ప్రారంభమైందన్నారు. మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఐఎస్‌బీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంఓయూ జ‌రిగిందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్‌బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో శ్రీకారం చుట్టామన్నారు. ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం ల‌భించ‌నుంద‌ని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్‌బీ కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని పేర్కొన్నారు.

భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతాలే లేని రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తపిస్తున్నారని మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, నైపుణ్య, ఐటీ, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టిసారించామ‌న్నారు.  అధ్యయనం, విజ్ఞానం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకెళ్తున్న‌ట్లు వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఐఎస్‌బీ ఒప్పందం దేశంలోనే తొలిసారని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్టణాన్నిఆంధ్రప్రదేశ్ ఆర్థికవనరుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top