తాడేపల్లి: కోవిడ్-19 నియంత్రణకు మరో వినూత్న ఆలోచన చేశామని, కరోనా పేషెంట్లను ట్రాక్ చేసేందుకు పరికరాన్ని రూపొందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్ మాడ్యూల్‌ను తయారు చేస్తామని, ఇప్పటికే పలు కంపెనీలతో చర్చించడం జరిగిందన్నారు. త్వరలో పైలెట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు. కరోనా పేషెంట్లకు ఈ పరికరాన్ని అమర్చవచ్చని, పాజిటివ్ వ్యక్తిని ఈ పరికరం ద్వారా నిరంతరం ట్రాక్ చేయొచ్చన్నారు. దేశంలో మొదటిసారి ఏపీలోనే చేపడుతున్నామని, భవిష్యత్‌లో ఈ మాడ్యూల్ అవసరం చాలా ఉంటుందని వివరించారు.
ముమ్మాటికీ సీఎం వైయస్ జగన్ చెప్పింది వాస్తవం
కరోనాపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మంత్రి గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ చెప్పింది ముమ్మాటికీ వాస్తవమని, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రపంచమంతా కరోనా ఉంటుందన్నారు. దేశంలో అందరికంటే ఎక్కువగా కరోనా నియంత్రణ చర్యలను సీఎం వైయస్ జగన్ చేపడుతున్నారని చెప్పారు. కరోనా పరీక్షల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని, టెస్టింగ్ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి సీఎం వైయస్ జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో గ్రీన్ జోన్‌లో ఉన్న పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.