త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ 

పరిశ్రమలు రావడం ఇష్టం లేకే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం

మంత్రి గౌతమ్‌రెడ్డి
 

 అమరావతి : త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త విధానంలో పారిశ్రామిక రాయితీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం రూ. 2500 కోట్ల రాయితీలు బకాయి పడిందని.. ఆ బకాయిలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశించారు. పరిశ్రమలు రావడం ఇష్టం లేకే కొంతమంది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి రెండు నెలల్లో 800 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 

కృష్ణపట్నం పోర్టులో అదానీలు పెట్టుబడి పెడుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాయితీలపై స్పష్టతనిచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట తప్పకూడదనే కొత్త పాలసీ వచ్చేంతవరకు వేచి చూడమని పారిశ్రామికవేత్తలను కోరారు. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలపై రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరును పారిశ్రామికవేత్తలు  ప్ర‌శ్నిస్తున్నార‌ని చెప్పారు. గతంలో ఇచ్చిన రాయితీలను కచ్చితంగా చెల్లిస్తామన్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని అన్నారు. 

Back to Top