బాబు పోరాటం స్టేట్ కోసం కాదు.. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే.. 

వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు  

సొంత సంపదకు విఘాతం కలుగుతుందనే చంద్రబాబు బాధ 

 600 రోజుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి టీడీపీ పండగ చేసుకుంటుంది..  

 5 ఏళ్ళూ కాలయాపన చేసి, కాగితాల మీదే అమరావతిని ఇడ్లీ పాత్రల గ్రాఫిక్స్ లో చూపించారు. 

  మంగళగిరిలో లోకేష్ ను ఓడించినా.. చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదు. 

 గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రెఫరెండం కాదా బాబూ..? 

 వికేంద్రీకరణకు మద్దతుగా దళితుల ఉద్యమాన్ని కించపరిచినందుకు బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి 

 వికేంద్రీకరణే ఈ ప్రభుత్వ విధానం.. అమరావతి అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. 

 ప్రజల మీద దమనకాండ చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు 

తాడేపల్లి: అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన వ్య‌క్తి.. ఇప్పుడు ఉద్యమం పేరుతో మభ్యపెట్టాలనే ప్రయత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు పోరాటం స్టేట్ ప్రయోజనాల కోసం కానేకాదని.. తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమేనని  దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం వైయ‌స్‌ జగన్ భావించారని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారని, ఆయన చేసిన తప్పిదాల వల్లే దారుణంగా ఓటమి చెందారని మంత్రి ఎద్దేవా చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు.  

చంద్రబాబు కలలుగన్నట్టుగా తాను, తన చుట్టూ ఉండే తన బినామీల సొంత సంపద సృష్టికి విఘాతం కలుగుతుందనే బాధతోనే అమరావతి ఉద్యమం పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారని  కన్నబాబు ధ్వజమెత్తారు. . అమరావతి ఉద్యమం పేరుతో ఆ ప్రాంత ప్రజలను భ్రమల్లో ఉంచి, 600 రోజుల పేరుతో టీడీపీ పండగ చేసుకుంటుందని, ఇకనైనా ఆ భ్రమల్లో నుంచి చంద్రబాబు బయటకు రావాలని హితవు పలికారు. అమరావతి ఆందోళనాకారులపై ఏదో జరిగిపోతుందంటూ ఉదయం నుంచి టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియా గోరంతను కొండంత చేసి చూపించే ప్రయత్నం చేస్తుందని, టీడీపీ హయాంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద దమనకాండ చేయదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. 

ప్రజల హృదయాల్లో నుంచి, ఉద్వేగం నుంచి పుడితే వాటిని ఉద్యమాలు అంటారుకానీ, స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం,  కొంతమంది వ్యక్తుల భవిష్యత్తు కోసం మాట్లాడే మాటల్ని, చేసే చేతలను ఉద్యమాలు అనరు, వాటిని డ్రామాలు అంటారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని తానే పెంచి పోషిస్తున్నాను అనుకుంటూ ఓ కృత్రిమ ఉద్యమాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోకుండా కేవలం "నా స్వార్థం.. నా ప్రయోజనాలే ముఖ్యం" అన్నట్లు చంద్రబాబు  ప్రవర్తిస్తున్నారన్నారు. 

అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో లోకేష్ ను ఓడించినా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల నుంచి గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదని అన్నారు. గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని, అయినా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో, అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికి గెలిపించారని, ఇది రెఫరెండం కాదా అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళూ అమరావతి రాజధాని పేరుతో కాగితాల మీద ఇడ్లీ పాత్రలు లాంటి గ్రాఫిక్స్ తో  కాలయాపన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే అమరావతి ప్రాంతంలో వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న దళితులను అవమానించినందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.  

 రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మూడు రాజధానులు ఉండాలని సంకల్పించారు.  రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, గతంలో హైదరాబాద్‌లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమవ్వడంతో మిగతా ప్రాంతాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఆ పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా, అదే పొరపాటు మళ్ళీ చేశారు. అయిదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో జనాన్ని మభ్యపెట్టారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు.

  రాజకీయాల్లో సీనియర్‌ నేత అయిన చంద్రబాబు తీరు చూస్తుంటే విస్మయం కలిగిస్తోంది. అమరావతి ఉద్యమం మొదలై 600 రోజులు అయిందంటూ తెలుగుదేశం పార్టీ ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇదంతా చూస్తుంటే టీడీపీవాళ్లు పండుగ చేసుకుంటున్నట్లు ఉన్నారు. ఆ ఉద్యమానికి ఎవరెవరు ఊపిరి పోస్తున్నారో, కొన్ని మీడియా సంస్థలు లేని ఉద్యమానికి ఎలా ఊపిరి పోస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. మొదటిలో అంతర్జాతీయ ఉద్యమం అంటూ వేరే దేశాల్లో ఉన్నవాళ్లు కూడా అమరావతి కావాలన్నట్లు చిత్రీకరించారు. ఆ తర్వాత జాతీయ ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ వీధుల్లో కదం తొక్కుతున్నట్లు కథనాలు రాశారు. 

  రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 ఏళ్ళ పాలనలో ఒక ఉద్యోగం లేదు, పరిశ్రమలు లేవు, ఉన్న పరిస్థితులను వినియోగించుకోనే పరిస్థితి లేదు. ఎవరైనా నిరుద్యోగి ఉద్యోగం కావాలంటే హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ సరిచేస్తూ రాష్ట్రం అంతా ఒకేరకంగా అభివృద్ధి చెందాలి,  అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధిని సాధించాలి అని జగన్ మోహన్ రెడ్డిగారు మూడు రాజధానుల పేరుతో వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. 
- అదే చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి తమకు కావాల్సిన వారి రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం అమరావతిని  రాజధానిగా ప్రకటించారు. గ్రాఫిక్స్‌, బొమ్మలు, ఐకానిక్ వంతెనలు.. అంటూ అయిదేళ్లు కాలయాపన చేసి కాగితాలమీద ఇడ్లీ పాత్రల డిజైన్లు, బోర్లించిన గిన్నెలు తరహాలో గ్రాఫిక్స్‌ చూపిస్తే.. చివరికి 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఓడించారో చూశాం.  చంద్రబాబు నాయుడుగారి తనయుడు లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయాడు. ఓటమి తర్వాత అయినా మైండ్‌ సెట్‌ మార్చుకుంటారేమో అనుకుంటే అదీ లేదు.  స్వార్థం, స్వప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలకు ఆయనకు పట్టవు.

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందరి అభిప్రాయాలు తీసుకుని మూడు రాజధానులు ఉండాలని సంకల్పిస్తే... విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలు న్యాయపరమైన రాజధానిని తీసుకురావాలనుకున్నారు.  అయితే చంద్రబాబు మాత్రం వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ, అమరావతి ప్రాంత ప్రజలు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. 600 రోజుల ఉద్యమాన్ని.. 6వ శతదినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. 

  స్థానిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గుంటూరు నడివీధుల్లో మీకు రోషం లేదా అంటూ ఎంత దారుణంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదు. విజయవాడలోనూ అదేవిధంగా మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. చివరికి ఫలితాల్లో గుంటూరు కార్పొరేషన్‌లో 57 డివిజన్లు ఉంటే 44 వైయస్సార్‌ సీపీకి, టీడీపీకి 9 వచ్చాయి, విజయవాడలో 64 డివిజన్లు ఉంటే, వైయస్సార్సీపీకి 49, టీడీపీకి  కేవలం 14 వచ్చాయి.  ఈ ఫలితాలు చూస్తే ప్రజలు ఏ పక్షాన నిలబడ్డారు. ఏ నేత పట్ల ఆదరణ ఉందో అర్థం కావడం లేదా? ఏకపక్షంగా వైఎస్‌ జగన్‌గారి నిర్ణయాలకు మంగళగిరి, గుంటూరు, విజయవాడ ప్రజలు మద్దతుగా నిలిచారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన పంచాయతీలు కూడా వైయస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచారు.
 ఇంకా రిఫరెండమ్‌ అంటూ అమరావతి అంటూ మీరు భ్రమల్లో ఉండి.. ప్రజలు అదే భ్రమల్లో ఉంచి ఉద్యమాలు, ర్యాలీలు అంటూ మొదలుపెట్టి, పోలీసులు వారిపై లాఠీలతో దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేయడం  తగునా. లోకేష్.. ఎవరో రాసిస్తే ట్వీట్‌లు పెట్టడం సరికాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు నిన్నే చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది వ్యక్తులను ముందు పెట్టి, టీడీపీ అవసరాల కోసం రాజకీయంగా డ్రామాలు ఆడించి  ఏదో జరిగిపోయినట్లు డ్రామాలు చేస్తున్నారు. మీకు మాదిరిగా ప్రజల మీద దమనకాండ చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. 

 శిబిరాల్లో నిరసన చేసుకోండి అంటే ర్యాలీలు చేస్తామంటూ హడావుడి చేశారు. హైకోర్టు వరకూ వెళ్లి దాడి చేసినట్లు మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అల్లరి మూకలతో పోటీ ఉద్యమాలు పెట్టించారంట? మీరు చేస్తే నిజమైన ఉద్యమాలు, దళిత సంఘాలు ఉద్యమం చేస్తే వాళ్లు అల్లరి మూకలా? మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? దళితులు ఉద్యమం చేస్తుంటే వారిని అల్లరి మూకలు అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర సంపదపై దాడి అని మీరు భావిస్తున్నారు కాబట్టే.. రోడ్లు ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. మీకు, మీ బినామీల కోసం, మీరు కన్న కలలు చెదిరిపోతున్నాయన్న బాధతో రోడ్డు ఎక్కారు. వికేంద్రీకరణ జరిగితే వేలు, లక్షల్లో కొన్న భూములు కోట్లలో అమ్ముడుపోవనేదే మీ బాధ. చెల్లాచెదురు అవుతున్నవి  ప్రజల కలలు కాదు.. కొంతమందికి చెందిన సంపద సృష్టికి మీరు కన్న కలలు చెల్లాచెదురు అవుతున్నాయి.
 
విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమే కదా అభివృద్ధి చెందేది. శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటికీ మేలు జరుగుతుంది కదా? అచ్చెన్నాయుడు ఎందుకు ఉత్తరాంధ్ర ఆకాంక్షపై పెదవి విప్పడం లేదు. అచ్చెన్నాయుడు అమరావతి తెలుగుదేశం అధ్యక్షుడిగా మాట్లాడారే తప్ప, ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదు. చాలా చిత్రంగా ఉంది. మిమ్మల్ని చంద్రబాబు... అమరావతికి అధ్యక్షుడిగా చేసే స్థాయికి దించేశారనేది గుర్తుంచుకోవాలి.
- మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం. అమరావతిని కూడా అబివృద్ధి చేయడం ఈ ప్రభుత్వం బాద్యత. అమరావతి శాసన రాజధానిగా ఉంటే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఎవరికీ అన్యాయం చేసే మనస్తత్వం కాదు వైఎస్‌ జగన్‌ గారిది. 

  యనమల రామకృష్ణుడు మోసం, దివాళాకోరుతనం అని మాట్లాడుతున్నారు. వాటి గురించి ఆయనే చెప్పాలి. చంద్రబాబు ఎన్టీఆర్‌ను మోసం చేసినప్పుడు స్పీకర్‌గా ఉన్న ఆయన ఏం చేశారో చెప్పాలి. గోదావరి జిల్లాకు చెందినవారుగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆర్థికమంత్రిగా మీరు చేసిందేమిటో చెప్పాలి. విశాఖను పరిపాలన రాజధానిని చేస్తే మీకేంటి ఇబ్బంది. దివాళాకోరుతనం అనేది టీడీపీకి పేటెంట్‌ హక్కు. ఎవరు నియంతగా పాలించారో, వారినే ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారు, ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. 
 సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ఎలాంటి అపవాదును అద్దలేరు. ఆయన ఒక మాట చెబితే చేస్తారు. చేయలేనంటే సాధ్యం కాదంటూ కుండబద్ధలు కొట్టినట్టు చెబుతారు. మూడు రాజధానులు ఈ రాష్ట్రంలో వచ్చి తీరుతాయి. అది ప్రజల ఆకాంక్ష. ప్రజలును ఇంకా  మభ్యపెట్టే కార్యక్రమం చేయవద్దు.

 మిగతా రాజకీయ పార్టీల విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ లైన్ లోనే ఆయా పార్టీలు ప్రయాణిస్తున్నాయి. కృత్రిమ ఉద్యమాలను ఎక్కువ కాలం నడిపించలేరని టీడీపీ గ్రహించాలి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ చేసిన నమ్మకద్రోహానికి, ఆ పార్టీ చర్యలకు రాష్ట్రంలో ఎలాంటి స్థానం ఉందో అందరికీ తెలిసిందే. 

 లోకేష్‌ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అమరావతిలో రోడ్లు తవ్వించేసిందని, మహిళలపై దాడులు చేస్తున్నారని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. జనంలోకి వస్తే తెలుస్తుంది. స్థానిక ఎన్నికల ఫలితాలు చూసైనా మార్పు చెందుతారా అంటే అదీ లేదు. రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసమే ఇదంతా.  అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి జరగాలని... ముఖ్యమంత్రిగారు భావిస్తే..  చంద్రబాబు ఇప్పటికైనా 600 రోజుల పండుగ, వెయ్యి రోజుల పండుగను చేయడం మానేస్తే మంచిది. 

  చంద్రబాబు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను పప్పు బెల్లాలులా పంచారు. 139 ప్రాజెక్టులు వెళ్లిపోయాయని చంద్రబాబు చెబుతున్నారు.. అక్కడ పరిశ్రమలు పెట్టలేనివాళ్లే పారిపోయారు. ఆ పరిశ్రమలు ఎందుకు వెళ్లిపోయాయి.?  సామర్థ్యం లేకే కదా ఆ పరిశ్రమలు వెళ్లిపోయాయి. అది ఎవరి వైఫల్యం. సమర్థత లేనివారికి చంద్రబాబు భూములు ఇచ్చారనే కదా అర్థం?

 మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశాం. చట్టం చేశాకా దాన్ని అమలు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. దాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. మూడు రాజధానులు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మట్టీ,నీళ్లు తెచ్చుకుని పండుగ చేసుకునే ప్రభుత్వం మాది కాదు. గత ప్రభుత్వం చేసిన పాపాలను కడగడానికే మాకు సమయం సరిపోతోంది. 
- మత రాజకీయాలు వైయస్సార్‌ సీపీ ఎప్పటికీ చేయదు. అభద్రత ఎవరికి ఉంటుంది? అప్రతిహతమైన విజయాన్ని ప్రజలు మాకు కట్టబెట్టారు. ఇప్పటివరకూ జరిగిన ఏ ఎన్నికల్లో అయినా ఎవరి పక్షాన ప్రజలు నిలబడ్డారో అందరికీ తెలుసు అని మంత్రి క‌న్న‌బాబు పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top