ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎలా ముందుకెళ్తారు?

ఈసీ సమావేశం వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటీ..?

నిమ్మగడ్డకు మంత్రి కురసాల కన్నబాబు సూటిప్రశ్న

అమరావతి: రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్‌ ఒక వ్యవస్థగా నడవడం లేదు.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనే వ్యక్తి కమిషన్‌గా నడుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా, ఓ పార్టీ వ్యక్తిగా ఈసీ సమావేశం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని గౌరవ సుప్రీం కోర్టు చెప్పిందని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ అందుకే ఈసీ సమావేశానికి వెళ్లలేదని చెప్పారు. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితి ఏం మారిందని ఈసీ సమావేశం పెట్టారని ప్రశ్నించారు.  

‘డైరెక్ట్‌ కోర్టుకు వెళ్లి నిధులు ఇప్పించండి అని అడుగుతున్నారంటే.. ప్రభుత్వాన్ని శత్రువుగా చూస్తున్నారా..? మీ వ్యక్తిగత ప్రతిష్ట, పట్టుదల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రూ.5 కోట్లు లాయర్లకు ఇవ్వాలా..? అది కూడా కోర్టుకు వెళ్లి డబ్బులు ఇప్పించమని అడుగుతారా..? దీన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటో.. ఎన్నికల కమిషన్‌ వ్యవస్థను ఎలా నడుపుతున్నారో స్పష్టంగా అర్థం అవుతుంది. 

అసలు ఈ సమావేశం వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటీ..? ఓ ప్రైవేట్‌ హోటల్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జరిపిన మంతనాలు ప్రజలంతా చూశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము విజయం సాధిస్తాం. అన్ని వర్గాల వారికి సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి న్యాయం చేస్తున్నారు’ మంత్రి కన్నబాబు అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top