అందుకే టీడీపీని పక్కన పెట్టారు

వికేంద్రీకరణ ఎందుకు కుదరదో టీడీపీ సమాధానం చెప్పాలి

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యంమంత్రి కురసాల కన్నబాబు

 తాడేప‌ల్లి: ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టించుకోనందు వల్లే టీడీపీని ప్ర‌జ‌లు పక్కన పెట్టార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల ‌క‌న్న‌బాబు పేర్కొన్నారు. రాజ్యాంగం నిబంధనల పట్ల టీడీపీ నేతలు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. బిల్లులను అడ్డుకోవడం ద్వారా టీడీపీ స్వలాభం చూసుకుంటోందని విమ‌ర్శించారు. శుక్ర‌వారం క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ప్రయోజనాలన్నీ అమరావతితో ముడిపడి ఉన్నాయని, అందుకే ఇతర ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రజాభిప్రాయాన్ని టీడీపీ నేతలు తెలుసుకోవాలని కన్నబాబు హితవు పలికారు. శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా పరిపాల వికేంద్రీకరణ అవసరమని చెప్పిందని, చంద్రబాబు చెప్పినట్లు చేస్తేనే సక్రమంగా జరిగినట్లు భావించడం సరికాదన్నారు.

ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో ప్ర‌తిప‌క్షాలు చెబుతున్నాయి..
 గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిపక్షాలు చెబుతున్నాయని క‌న్న‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మండలిని శాసించాలని ప్రయత్నించారు. మండలి ఛైర్మన్ నిబంధనలు పట్టించుకోకుండా విచక్షణాధికారం అన్నారు. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలో నిపుణుడైన యనమల రామకృష్ణుడు.. గవర్నర్‌కు లేఖ రాయడం దౌర్భాగ్యం’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. కొంతమంది ప్రయోజనాల కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని, వికేంద్రీకరణ ఎందుకు కుదరదో టీడీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? అని క‌న్న‌బాబు ప్రశ్నించారు.

చంద్ర‌బాబుది క‌ప‌ట ప్రేమ‌
చంద్రబాబుకు అమరావతిపై ఉన్నది కపట ప్రేమ. ఐదేళ్లలో అమరాతి అభివృద్ధిని పట్టించుకోలేద‌ని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడమే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యం. ప్రాజెక్టుల పూర్తికి సహకరించకుండా టీడీపీ సమస్యలు సృష్టిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై సీఎం - వైయ‌స్ జగన్‌ సమీక్షించి ఆదుకోవాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. రైతులందరికి భరోసా ఇచ్చే ప్రభుత్వం.. వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వమన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నదే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యమని, వైయ‌స్సాఆర్‌ రైతు భరోసాతో రైతులను ఆదుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు.

ఆ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..
మద్యం పాలసీ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు. దశలవారి మద్యపాన నిషేధానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి మద్యం షాపులను తప్పించారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో పెట్టిన 43 వేల బెల్ట్ షాపులతో పాటు, 4500 పర్మిట్ రూమ్ లను తొలగించాం. మద్యం అక్రమాలను అరికట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌ ‌మెంట్‌ బ్యూరో తెచ్చా’’మని తెలిపారు. ఇలా చేస్తే బెల్ట్ షాపుల కోసం మహిళలు బారులు తీరారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహిళలను కించ పరిచే విధంగా ఫోటోలు ప్రచురించడం దారుణమన్నారు. దేశంలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. మద్యం పాలసీ వల్ల సుమారు 50 శాతం మద్యం వినియోగం తగ్గిందని కన్నబాబు వివరించారు.

Back to Top