పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం

ఒక పార్టీ అధినేతగా పూర్తి సమాచారంతో స్పందించు

కాపుల కోసం తొలిఏడాదిలో రూ.4770 కోట్లు ఖర్చు చేయడం తప్పా..?

కాపులపై టీడీపీ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయడం తప్పా..?

గత ప్రభుత్వంలో కాపులకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు

ముద్రగడ దీక్షను చంద్రబాబు అడ్డుకుంటే అప్పుడేమైంది మీ ప్రశ్నించేతత్వం

మహిళలపై అక్రమ కేసులు పెట్టినప్పుడు పవన్‌ ఎందుకు స్పందించలేదు

పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు ప్రపంచ సంస్కర్త

వాస్తవాలను వక్రీకరించి మాట్లాడడం ఇకనైనా మానుకో..

పవన్‌ వ్యాఖ్యలకు మంత్రి కురసాల కన్నబాబు కౌంటర్‌

విజయవాడ: కాపు సంక్షేమంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పత్రికా ప్రకటన హాస్యాస్పదంగా ఉందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరివాడిగా ముందుకుకెళ్తుంటే ఎందుకంత ఓర్వలేని తనం ప్రదర్శిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. కుల, మత రహిత రాజకీయాలు చేస్తానని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌.. ప్రతి రోజు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాడన్నారు. ఐదేళ్లు కాపులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గతంలో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపులకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి తొలి బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే తప్పుగా కనిపించలేదా..? సంవత్సరానికి రూ.2 వేల కోట్లు ఇస్తామని చెప్పి రూ.4770 కోట్లు ఖర్చు చేసిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తప్పుగా కనిపిస్తుందా..? అని పవన్‌ను ప్రశ్నించారు.

విజయవాడలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..  ఒక పార్టీ అధినేతగా పూర్తి సమాచారం తెలుసుకొని స్పందించాలి తప్ప.. అరకొర సమాచారంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదని పవన్‌ కల్యాణ్‌కు సూచించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేసినప్పుడు, తూర్పుగోదావరి జిల్లాలోని మహిళలపై అక్రమ కేసులు పెట్టినప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలన్నారు. 

మంత్రి కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. 

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా పేద మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం కింద రూ.353.81 కోట్లను 2,35,873 మంది లబ్ధిదారులకు ఇవ్వడమే కాకుండా మరో నెల రోజుల పాటు అర్హత ఉన్నవారు నమోదు చేసుకుంటే తప్పకుండా సాయం చేస్తామని ప్రకటించారు. ఆ రోజు అణచివేతకు గురైన కాపు మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ చేయూతను ఇచ్చారు. 

నిజానికి కాపు రిజర్వేషన్‌ ఉద్యమం, కాపు ఉద్యమం గురించి మాట్లాడితే గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గుర్తుకువస్తుంది. కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏరుదాటి తెప్ప తగలేసిన చందాన చంద్రబాబు పాలన చూశాం. నిధులు, రిజర్వేషన్‌ల సంగతి ఏంటీ అని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే దాన్ని ఉక్కుపాదంతో అణచివేసే కుట్ర కళ్లారా చూశాం. వారికి మద్దతు ఇచ్చినందుకు కాపు యువతను, మహిళలను వేధించి అక్రమ కేసులు పెట్టిన∙సంఘటనలు చూశాం.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ చేసిన పత్రికా ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. కాపులకు డబ్బులు ఇవ్వడం ద్వారా రిజర్వేషన్‌ ఉద్యమాన్ని బయటకు రాకుండా చేసే కుట్ర దాగి ఉందన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కాపులకు కార్పొరేషన్‌ ద్వారా రూ.2 వేల కోట్ల వరకు ఆర్థికసాయం అందిస్తానని మాటిచ్చి తొలి ఏడాది పాలనలో అన్ని పథకాల్లో కలిపి రూ.4,415 కోట్లు, కాపు నేస్తం ద్వారా మరో రూ.354 కోట్లు వెరసి రూ.4,769.46 కోట్లను ఒక్క సంవత్సరంలో ఇస్తే అది తక్కువగా కనిపిస్తుందా..? కుల, మత రహిత రాజకీయం చేస్తానని చెప్పుకునే పవన్‌.. ప్రతి రోజు కుల ప్రస్తావన తీసుకువస్తాడు. 

ఎలాంటి అవినీతికి తావు లేకుండా.. పారదర్శకంగా సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే పవన్‌కల్యాణ్‌కు ఎందుకంత కంటగింపు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కాపుల తరుఫున ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయాడు. 

ముద్రగడను వేధించి ఆస్పత్రిలో నిర్భందించినప్పుడు.. వారి భార్యను, కొడలు, కుమారులను పోలీసులతో చంద్రబాబు పచ్చిబూతులు తిట్టించినప్పుడు పవన్‌ ఎందుకు మాట్లాడలేదు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చిరంజీవి, ఇతర పెద్దలను రాజమండ్రి ఎయిర్‌పోర్టులో గత ప్రభుత్వం నిర్బంధిస్తే అప్పుడెందుకు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడలేదు. 

తొలి ఏడాదిలో ఇస్తామన్న రూ.2 వేల కోట్లకు అదనంగా మరో రూ.2770 కోట్లు ఇస్తే అది తప్పుగా కనిపిస్తుందా..? చంద్రబాబుపై పట్ల ప్రేమను దాచుకోలేని తత్వం ఇది కాదా..? ఏ ప్రభుత్వమైనా కార్పొరేషన్‌ నుంచే పథకాలు అమలు చేస్తుంది. కాపులకు ఒక్కరికే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఆయా కార్పొరేషన్‌ల నుంచి పథకాలు అమలవుతున్నాయి. గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్‌ల ద్వారానే ఇచ్చింది. 

చంద్రబాబు హయాంలో 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల పాటు కాపు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కింద ఏం చేశారని చూస్తే మొత్తం ఇచ్చింది రూ.1,874.67 కోట్లు. దీంట్లో స్వయం ఉపాధి పథకం కింద రూ.1,069 కోట్లు, గ్రూప్‌ ఎంఎస్‌ఎంఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి రూ.28 కోట్లు, కాపులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద రూ.540.19 కోట్లు, విదేశీ విద్యా దీవెన కింద రూ.121 కోట్లు, విద్యాంజలి స్కీమ్‌ కింద రూ.30 కోట్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద రూ.35 కోట్లు, కాపు భవనాలకు రూ.21 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్‌ కాస్టుకు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. 

పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కాపు కార్పొరేషన్‌లో ఏ విధంగా చూపించారో సమాధానం చెప్పాలి. ఆ రోజున ఇవన్నీ పవన్‌ కల్యాణ్‌కు తప్పగా కనిపించలేదా..? ఈ రోజు చేసే వక్రీకరణకు మార్గనిర్దేశకులు ఎవరూ..? పూర్తి సమాచారం తెలుసుకొని పార్టీ అధినేతగా స్పందించాలి తప్ప.. అరకొర సమాచారంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. 

చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో 2,54,335 మందికి రూ.1874 కోట్లు ఇచ్చారు. ఈ రోజున వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం కాపు నేస్తం పథకం ద్వారా పేద కాపు మహిళలకు ఇచ్చిన సాయం 2,35,873 మందికి ఇచ్చారు. ఇంకా అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని చెప్పారు. ఇతర పథకాలు ద్వారా చూస్తే 20,53,446 మంది లబ్ధిదారులు వివిధ పథకాల్లో కాపులు లబ్ధిపొందారు. 

కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు తీసిన ఘనత చంద్రబాబుది. ప్రజా సాధికారిక సర్వేను ఏర్పాటు చేసి ఆ సర్వేలో ఏ కులస్థులు ఎంత మంది లబ్ధిపొందారని కరపత్రాలు పంచాడు. అప్పుడు కుల వైశామ్యాలు వెదజల్లేందుకు చేయలేదా..? చంద్రబాబు అయితే ప్రపంచ సంస్కర్తలా పవన్‌కు కనిపిస్తాడు.. సీఎం వైయస్‌ జగన్‌ అంటే నచ్చరు కాబట్టి ఆయన ఏం చేసినా.. ప్రజలు ఎంత గొప్ప తీర్పు ఇచ్చినా పవన్‌కు కనిపించదు. పవన్‌ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో జగన్‌ రెడ్డి అని రాస్తున్నాడు.  

అందరివాడిగా సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తుంటే పవన్‌ కల్యాణ్‌కు ఈ ఓర్వలేని తనం ఎందుకు. కరోనా లాంటి విపత్తును ప్రపంచాన్ని ఊపేస్తున్నా.. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలుపుదల చేయకుండా అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు కూడా ఆశ్చర్యపడుతుంటే ఏంటీ.. ఈ ఉక్రోశం. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కాపుల కోసం పెట్టిన బడ్జెట్‌ రూ.100 కోట్లు. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని రూ.100 కోట్లు ఎందుకు ఇచ్చావని ఒక్కరోజు అయినా అడిగాడా..? సంవత్సరానికి రూ.2 వేల కోట్లు ఇస్తానని రూ.4 వేల కోట్లు ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ను ప్రశ్నిస్తున్నాడు. ఇదేంటో అర్థం కావడం లేదు. 

అర్హత ఉన్నవారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు 2.50 లక్షల మంది పేద కాపులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మంచి చేయొద్దా..? లేక ఇచ్చింది చెప్పుకోవద్దా..? వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా కూడా కాపులకు రూ.6.88 కోట్లు అందింది. జగనన్న చేదోడు పథకం కింద టైలర్లకు సాయం చేస్తే అందులో రూ.14.02 కోట్లు కాపులకు అందింది. ప్రతి వృత్తిలో పేదలు ఉన్నా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని వక్రీకరించడం పవన్‌కు మంచి పద్ధతి కాదు. 

నా నియోజకవర్గంలో కూరాడు అనే గ్రామానికి ఐదేళ్లలో కాపులకు వచ్చిన పథకాల విలువ రూ.15 లక్షలు, అదే వైయస్‌ఆర్‌ సీపీ పాలనలోని తొలి ఏడాదిలో కాపు నేస్తం పథకం ద్వారా రూ.23 లక్షలు వచ్చింది. ఏ ప్రభుత్వం కాపుల పట్ల నిబద్ధతతో ఉన్నారని అర్థం కావడం లేదా..? 

గత ప్రభుత్వం కాపులపై పెట్టిన అక్రమ కేసులన్నీ సీఎం వైయస్‌ జగన్‌ ఎత్తివేశారు. రెండు సంవత్సరాల పాటు తూర్పుగోదావరి జిల్లాలో 144, 30 సెక్షన్‌లను అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. ఉద్యమం చేస్తున్న వారిని పోలీసులతో అమ్మనాబూతులు తిట్టిస్తే పవన్‌కు తప్పుగా అనిపించలేదా..? అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

Back to Top