చంద్రబాబుకు అసలు సిగ్గనేది ఉందా..?

అయితే రాజకీయం.. లేదంటే ఆదాయం.. ఇదే టీడీపీ సిద్ధాంతం

రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన నీచ చరిత్ర బాబుది

మా ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేసింది

రైతు భరోసా కేంద్రాలు రైతు నాలెడ్జ్‌ సెంటర్లుగా పనిచేస్తాయి

ఏడాది పాలనలో రైతుభరోసా ద్వారా రూ.10,209 కోట్ల సాయం చేశాం

30వ తేదీన 10,641 ఆర్‌బీకేల ప్రారంభం

5 లక్షల మంది రైతులనుద్దేశించి సీఎం ప్ర‌సంగం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయని, రైతులకు నాలెడ్జ్‌ సెంటర్లుగా పనిచేస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని, ఏడాది కాలంలోనే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10,209 కోట్లు  రైతుభరోసా ద్వారా రైతుల అకౌంట్లలో జమ చేశారన్నారు. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభిస్తారని, ఆ రోజునే 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారని, కోవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఆర్‌బీకేలో 50 మంది రైతులను కూర్చోబెట్టాలని సూచించడం జరిగిందన్నారు. గ్రామాల్లో కూర్చున్న కొంతమంది రైతులతో సీఎం మాట్లాడుతారని చెప్పారు. రైతు సంక్షేమం పేరు వింటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకువస్తారని, వైయస్‌ఆర్‌ను మరిపించేలా రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. 

సచివాలయంలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తిచేసుకున్న రోజున రైతులతో మాట్లాడటమే ఒక పండుగ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భావించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. రైతుల పట్ల సీఎంకు ఎంత ప్రేమ ఉందో ఈ కార్యక్రమాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్‌బీకేల పర్యవేక్షణ కోసం జిల్లాల్లో ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామని చెప్పారు. 

ఒక నాయకుడు లేదా అధికారి వ్యవసాయానికి సంబంధించి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక చోట కూర్చొని మాట్లాడితే రాష్ట్రంలోని 10,641 ఆర్‌బీకేల్లో రైతులు కూర్చొని ప్రత్యక్షప్రసారం చూసే వీలు కల్పిస్తున్నామన్నారు. ఇంటర్‌నెట్‌ ద్వారా ఆర్‌బీకేలన్నింటినీ అనుసంధానం చేశామన్నారు. వీటికి అనుసంబంధంగా మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనే గ్రామ సచివాలయాల్లో నియమించిన వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన, సెరికల్చర్, ఫిషరీస్‌ అసిస్టెంట్లు కూర్చుంటారని, వారికి సేవలు అందించే మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా ఆర్బీకేకి అనుసంధానం చేస్తున్నామన్నారు. పంటల పరిస్థితి ఏంటని ప్రతిరోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సీఎం యాప్‌ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాడన్నారు. 

ఆర్‌బీకేలు ప్రారంభించిన అనంతరం 30వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు శాసనసభ్యులు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. వైయస్‌ఆర్‌ పొలంబడి కార్యక్రమాన్ని కూడా వారం రోజుల్లో ప్రారంభించాలని మంత్రులు, శాసనసభ్యలకు సూచించామన్నారు. జూన్‌ 1 నుంచి రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. 

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ రోజు జూమ్‌నాడు చేశారని, ఎన్టీఆర్‌కు   వెన్నుపోటు పొడిచి జీవితం నుంచి నిష్క్రమించే వరకు వేధించి ఇవాళ నివాళులు అర్పించడం చంద్రబాబుకే దక్కిందన్నారు. రైతుల నడ్డివిరిచిన జగన్‌ సర్కార్‌ అని చంద్రబాబు తీర్మానం చేసినట్టున్నాడని, తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనేది ఉందా..? రైతుల గురించి మాట్లాడేందుకు చంద్రబాబు బిడియపడడం లేదా..? అని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంకా పాతకాలం నాటి తీర్మానాల్లో కూరుకుపోవడం సిగ్గుచేటన్నారు. అయితే రాజకీయం.. లేదంటే ఆదాయం చూసి పనిచేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీదన్నారు.

రైతు సంక్షేమం కోసం గత సంవత్సరకాలంలో చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసి చూపించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని, ఏయే పథకానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారో తెలియకపోతే అడిగి తెలుసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ రూ.87,612 వేల కోట్ల రుణాలు మాపీ చేస్తానని, అక్కచెల్లెమ్మలు బంగారం విడిపించుకోవద్దని ఒకపక్క ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారికి ఏం చేశారని ప్రశ్నించారు. రూ.87,612 వేల కోట్ల రుణమాఫీని ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే చేసి పసుపు కరపత్రాలను బాండ్లు అని వారి చేతిలో పెట్టి కుర్చీదిగి వెళ్లిపోయాడన్నారు. 

ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతుల అకౌంట్లలో ఎంత జమ చేశారో మీకు తెలుసా.. కనీస అవగాహన అయినా ఉందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ సర్కార్‌ రైతు భరోసా పథకం కింద రూ.10,209 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో వేసిందన్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2000 కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ ఇస్తున్నారని, చంద్రబాబు బకాయిలు పెట్టిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.960 కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారని గుర్తుచేశారు. ఇవే కాకుండా వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం, వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకం.. ఇలా చెప్పుకుని పోతే వేల కోట్ల రూపాయలతో ఇవాళ రైతు సంక్షేమానికి ఈ ప్రభుత్వం ముందుకుపోతుంది.

 

Back to Top