అందుకే బాబు గుండె తరుక్కుపోతుందేమో? 

రైతుల మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మాది   

మంత్రి కురసాల కన్నబాబు..

తాడేపల్లి: కష్టకాలంలో సైతం రైతుల కోసం వైయస్‌ఆర్‌సీపీ  ప్రభుత్వం శ్రమిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకు గుండె తరుక్కుపోతుందో అర్థం కావడం లేదని.. బహుశా సీఎం వైయస్‌ జగన్‌ రైతులను ఆదుకోవడానికి స్పందిస్తున్న తీరు చూసి గుండె తరుక్కుపోతుందేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. టమోటా పంటలు కొనుగోలు చేస్తున్నందుకు ఆయన బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నీ హయాంలో ఎందుకు చేయకలేకపోయావంటూ చంద్రబాబును నిలదీశారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించమని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని కన్నబాబు తెలిపారు.

ఫైనల్ లిస్ట్ ఇంకా తయారు  కాలేదు
 రైతు భరోసా ఫైనల్ లిస్ట్ ఇంకా తయారు  కాలేదని మంత్రి కన్నబాబు తెలిపారు. అప్పుడే 4 లక్షల మంది రైతులను తొలగించారంటున్నారు. ఎక్కడ తొలగించారో చంద్రబాబే చెప్పాలి. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయబట్టే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. తడిసిన ధాన్యంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయిన వారిని వెంటనే ఆదుకుంటున్నాం. రైతుల మన్ననలు పొందుతున్నామని ఆయనకు కడుపు మంట అంటూ చంద్రబాబుపై కన్నబాబు నిప్పులు చెరిగారు.
 
పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించాం
 ఆరు చోట్ల పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించామని.. మిగిలిన ప్రాంతాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కన్నబాబు పేర్కొన్నారు. ఒంగోలు రెడ్ జోన్ కావడంతో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. పట్టణంలోకి వేరే ప్రాంతాల ద్వారా రైతులు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామని..  పొగాకు రైతులు, వ్యాపారులకు రక్షణ చర్యలు తీసుకున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

Back to Top