బాబు అధికారంలో లేకపోతే వ్యవసాయం అంతా నాశనమైనట్టా...!?

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు  

 బాబులా ప్రకృతి వైపరీత్యాలను ఆపేస్తామని మేం చెప్పం

  వ్యవసాయంపై ఈనాడు దుర్మార్గమైన రాతలు రాస్తుంది.. బాబుకు కొమ్ముకాసే రాతలు మానండి

  రూ. 16 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఈనాడు ఏ ప్రాతిపదికన రాతలు రాస్తుంది..?

  బాబు హయాంలో  బికినీల పండుగలు జరపాలనుకుంటే తప్పు అనిపించలేదా..?

 బాబు హయాంలో కోడిపందేలు సంబరాలు అయితే.. ఇప్పుడు జూద క్రీడలా..?

  సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే వేడుకలపైనా దుష్ప్రచారమా..?

  సీఎం వైయ‌స్‌ జగన్ గారిపైన ఉన్న ద్వేషంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తారా..?

 సీఎం వైయ‌స్ జగన్ గారిని చిరంజీవి కలిసినా.. కొన్ని పార్టీలు, ఎల్లో మీడియా విషం చిమ్ముతున్నాయి

  చంద్రబాబు లైనే... తన లైన్ అన్నట్టుగా సీపీఐ నారాయణ మాట్లాడుతున్నాడు

 రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు చేశాం

 కాకినాడ‌:  చంద్ర‌బాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్టు.. లేకపోతే వ్యవసాయం అంతా నాశనమైనట్టా...!? అని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అని నిల‌దీశారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా  పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించినట్లు రకరకాలుగా ఎల్లో మీడియాలో వార్తలు కనిపించాయి. కొన్ని పచ్చ పత్రికలు, చానల్స్‌ ఒక అడుగు ముందుకు వేసి మరింత దారుణంగా, దుర్మార్గంగా చూపించాయి. జల్లికట్టు, కోడిపందేలు అనేవి ప్రజలు సంప్రదాయంలో భాగంగా భావిస్తున్నారు.  రాష్ట్రంలో ఇవేమీ కొత్తకాదు. తమ సంప్రదాయాల్లో ఇదొక భాగం అంటూ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. 

- సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ పందేలు అనేవి అక్కడో, ఇక్కడో జరుగుతాయనేది సహజం. కానీ ఇవాళ మీడియాలో రాసిన రాతలు చూస్తే ఈ సంక్రాంతికి ఏదో విచ్చలవిడిగా జరిగిపోయినట్లుగా చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా చూపించాలని ప్రయత్నం చేశాయి. 

- చంద్రబాబు నాయుడు హయాంలో కోడిపందేలు జరిగితే సంక్రాంతి సంబురాలు అని రాస్తారు. ఇప్పుడు కోడి పందేలు జరిగితే జూద క్రీడలు అని రాస్తున్నారు. ఇది తేడా. వాళ్లు చూసే చూపులో ఉ‍న్న తేడా ఇది. 

- చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి సీఎం సీటులో కుర్చుంటే వీళ్లకు సంక్రాంతి ఉన్నట్లు కనిపిస్తుంది. బాబు అధికారంలో లేకుంటే పరిస్థితులు చాలా దారుణంగా, దుర్మార్గంగా మారిపోయినట్లు కనిపిస్తాయి. సభ్యత మరిచి అసభ్యంగా నృత్యాలు చేశారంటూ చూపిస్తున్నారు. సంక్రాంతికి జరిగిన వేడుకలలో ఏది కొత్త అని అడుగుతున్నాం. కృష్ణాజిల్లాలో ఏకంగా క్యాసినో పెట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని మీద ప్రత్యేకించి టార్గెట్ గా మాట్లాడుతున్నారు. కరోనాతో ఆయన ఎక్కడో ఐసోలేషన్‌లో ఉంటే... మంత్రి ఇలాకాలో ఏదో జరిగిందంటూ పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు.

- గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి జరిగితే సంక్రాంతి సంబురాలు అద్భుతం.. అమోఘం అని రాస్తారు. ఇప్పుడు ఏదో ఘోరం జరిగినట్లు రాతలు రాస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బికినీల పండుగలు చేయాలని, ముద్దుల పోటీలు పెట్టాలని ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు అధికారంలో ఉంటే ఏ పోటీలు అయినా పెట్టొచ్చు. ఇప్పుడు ముగ్గుల పోటీలు పెట్టినా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు సతీ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో గోపూజ చేసి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎల్లో మీడియాకు  ఇవేమీ కనిపించవు. వాళ్లకు ఎంతసేపు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ ప్రచారం చేయడమే సరిపోతోంది. 

- అసలు కోడిపందేలు వేయాలో, వద్దో అనేది మీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని చెప్పమనండి. మీ హయాంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలు ఎలా జరిగాయో చెప్పండి. అప్పటికన్నా ఇప్పుడు తక్కువ జరిగాయో, ఎక్కువ జరిగాయో చూడమనండి. మీరు ఎవర్ని కించపరుస్తున్నారు. 

- ప్రభుత్వం మీద, జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద ద్వేషంతో ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న సంప్రదాయాన్ని ఒక దుర్మార్గపు చర్యగా బయట ప్రపంచానికి చూపించాలని ప్రయత్నం చేయడం తప్పు. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కూడా కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నం చేయవద్దు.  ఏ అంశాన్ని అయినా గోరంతల్ని కొండంతలుగా చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. 

బాబు లైనే.. సీపీఐ నారాయణ లైన్..

    సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవిగారు వచ్చి ముఖ్యమంత్రిగారితో సమావేశం అయ్యారు. దాని మీద కూడా పుంఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నారు. కమ్యూనిస్ట్‌ నాయకుడు నారాయణ అయితే చిరంజీవి ఎందుకు వచ్చారో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం రమ్మని చెప్పిందా? అని నోటికొచ్చినట్లు ఏదోదో మాట్లాడుతున్నారు. చిరంజీవిగారు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే.. రాజకీయ కోణాల్లో రకరకాల వక్రభాష్యాలు చెబుతున్నారు. వాటన్నింటిని ఖండించినా అదేబాట, అదే ధోరణి కొనసాగిస్తున్నారు. "సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రిగారి దృష్టికి తెచ్చామని, తప్పకుండా అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రిగారు చెప్పారని, తనను చాలా గౌరవంగా భోజనానికి ఆహ్వానించారని, ఇరువురు ఓ మంచి వాతావరణంలో చర్చించుకున్నట్లు" చిరంజీవిగారు చెప్పినా..  కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పక్షాలు పనిగట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 

సీపీఐ నారాయణగారు అయితే ఎప్పుడూ  కమ్యూనిస్టు పార్టీ లైన్‌ మాట్లాడరు. చంద్రబాబుగారి లైనే తన లైన్ అన్నట్టు మాట్లాడతారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా సస్యశ్యామలంగా, పచ్చగా ఉన్నట్లు, లేకుంటే మొత్తం అంతా కట్టుతప్పిన సంప్రదాయాలుగా వీళ్ళకు కనిపిస్తాయి. 

- ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందని గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో చెప్పింది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ రంగం చాలా పురోభివృద్ధి సాధిస్తోందని గణాంకాలతో సహా చాలా తెటతెల్లంగా చెప్పారు.  ఆరోజు నుంచి కడుపులో కుళ్లు పెట్టుకుని, రగిలిపోతూ రైతాంగానికి అన్యాయం జరిగిపోతుందంటూ, వ్యవసాయం అసలు బాగోలేదన్నట్లుగా  చాలా పచ్చిగా, దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈనాడు దిగజారుడు రాతలు..
    సంక్రాంతి గడిచి 24 గంటలు కూడా పూర్తి కాలేదు. సంక్రాంతికి  రైతులు సంతోషంగా ఉన్నారని, వారిని మానసికంగా దెబ్బతీయాలనుకునేలా తెల్లారే సరికి  ‘వ్యవసాయం అసలు బాగోలేదని, రైతులు నిండా మునిగిపోతున్నారంటూ’ఈనాడు బ్యానర్‌ స్టోరీ వేశారు. 16వేల కోట్ల పెట్టుబడులు రైతాంగం నష్టపోయిందంటూ పెద్దవార్త రాసేశారు. ‘రాష్ట్రంలో వ‍్యవసాయం అసలు బాగోలేదు, వ్యవసాయం పూర్తిగా దెబ్బతినిపోయింది. రైతాంగం నష్టపోయారు అయినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు’ అనే దుర్మార్గపు ప‍్రచారం చేయాలని ప్రతిరోజూ ఈనాడు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని గోబెల్స్‌ ప్రచారం చేస్తూనే ఉంది.

- ప్రకృతి వైపరీత్యాలను, తుపానులను ఆపుతామంటూ చంద్రబాబు నాయుడులా కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది. ప్రకృతి వైపరీత్యాలను ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాంటి అబద్ధాలను మేము ప్రచారం చేసుకోం. ఈమధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో మిర్చి పంటకు తామర పురుగు సోకి  చాలావరకూ దెబ్బతింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి వ్యవసాయ, శాస్త్రవేత్తల బృందాలను పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఏవిధంగా మిర్చి రైతుల్ని ఆదుకోవాలి, వారిని ఏవిధంగా ఆ నష్టం నుంచి బయట​కు తీసుకురావాలనే యోచన ప్రభుత్వం చేస్తోంది. ఇతర పంటల మీద ఈ తెగులు సోకకుండా చర్యలు చేపట్టాం.

- పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో మొత‍్తం వ్యవసాయ రంగమే నాశనం అయిపోయినట్లు, రైతులు బతికి బట్టకట్టే స్థితిలో లేనట్లుగా ఈనాడు దినపత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇది దుర్మర్గం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబుకు కొమ్ము కాసే వార్తలు రాయవద్దని కోరుతున్నాం. 

- అలాగే ఈమధ్య కాలంలో చంద్రబాబు నాయుడు విత్తనం నుంచి విక్రయం వరకూ దగా అంటూ ఓ కార్యక్రమం చేస్తే... దానికి అనుగుణంగా ఈనాడులో వార్తలు రాశారు. ముసుగులో నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబుకు బహిరంగంగానే మద్దతు ఇచ్చే కార్యక్రమాలను ఈనాడు చేస్తుంది. ఇటువంటి రాతలు వల్ల, ఎవర్ని నష్టపరుస్తున్నారో ఈనాడు రామోజీరావు అర్థం చేసుకోవాలి.

- మీరు వండి వార్చిన వార్తలకు సంబంధించి అధికారికంగా సమాచారం తీసుకుంటే.. 2021-22 వరకూ సెకండ్‌ అడ్వైజరీ ఎస్టిమేషన్స్‌ వచ్చాయి. ఆ ప్రకారం చూస్తే ధాన్యం విషయంలో పంట కొద్దిగా దెబ్బతిన్నా దిగుబడి ఎక్కడా దెబ్బతినలేదు. అంటే వర్షాలు వల్ల ధాన్యం రంగు మారవచ్చు. మొలకలు రావచ్చు, ​కొన్ని ప్రాంతాల్లో పంటే చేతికి రాకుండా ఉండవచ్చు. 2021-22  ఖరీఫ్‌లో 80.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాం. ఒక ఎకరానికి 1997 కేజీలు వస్తుందని అంచనా వేశాం. అప్పటికీ తూర్పు, పశ్చిమ, నెల్లూరు, కడప జిల్లాల్లో పంట నష్టపోయినా కూడా యావరేజ్‌గా ఎకరానికి 20 క్వింటాళ్లుగా ధృువీకరించాం. గత ఏడాది తీసుకుంటే దిగుబడులు ఎకరానికి ధాన్యం 1700 కేజీలే. అదే ఈ ఏడాది దిగుబడి 1997 కేజీలు వచ్చింది. 
- ఏ మిల్లర్లు, దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, రైతు భరోసా కేంద్రాలలో తమ పేరును రైతులు నేరుగా నమోదు చేసుకుంటే.. ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రవేశపెట్టారు. విత్తనం వేసినప్పటి నుంచి విక్రయం వరకూ అన్నింటిని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేసే విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి. 

- కానీ చంద్రబాబు వ్యూహ కమిటీలు అని మీటింగ్‌లుపెట్టి ధాన్యం కొనుగోలు చేయనట్లు, రైతులుకు డబ్బులు చెల్లించనట్లు మాట్లాడుతున్నారు. ఖరీఫ్‌ క్రాప్ నే తీసుకుంటే దాదాపుగా 8వేల ఆర్బీకేలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి ఇప్పటివరకూ 20.36లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రబీని తీసుకుంటే నార్మల్‌ ఏరియాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 53శాతం నాట్లు పడ్డాయి. రబీలో పంటల విస్తీర్ణం పడిపోతుందేమో అనుకున్నామని, అయితే అధికారుల అంచనాలు, క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం రబీలోనూ సాధారణ విస్తీర్ణాన్ని సాధించబోతున్నాం. గోదావరి డెల్టాలో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే రబీ పంటలు వేశారు. కనీసం జనవరి 20వ తేదీకి నాట్లు పూర్తి చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. ఇప్పటివరకూ చూస్తే 53శాతం పూర్తయింది.

- తూర్పు గోదావరి జిల్లాలో తీసుకుంటే సాధారణ విస్తీర్ణంలో దాదాపు 88శాతం పూర్తయింది. కనీసం నెలాఖరుకు నాట్లు పూర్తవుతాయని అంచనా. మొక్కజొన్న తీసుకుంటే సెకండ్‌ అడ్వాన్స్‌ ఎస్టిమేట్‌లో 18.62 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని... ఎకరానికి 2,472 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. ఇది గత ఏడాదికన్నా అధిక దిగుబడి. కందుల విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారం ప్రకారం పంట దిగుబడి బాగుందని అంచనా, ఇప్పటివరకూ లక్ష మినీ కిట్స్‌ విత్తనాలు ఇచ్చాం. నార్త్‌ కోస్టల్‌ జిల్లాల్లో ఫ్రీ ఆఫ్‌ కాస్ట్‌ ఇస్తున్నాం. కాటన్‌ విషయానికి వస్తే సగటు దిగుబడి కన్నా కొంతమేర దిగుబడి తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. హార్వెస్టింగ్‌ కంప్లీట్‌ అయింది... ఎకరానికి ఆరు క్వింటాళ్లు వచ్చింది. గతంలో కంటే 0 .5 క్వింటాళ్లు మాత్రమే తగ్గింది. అయితే ఇప్పటివరకూ చూస్తే, మార్కెట్‌లో ధర అత్యధికంగా పత్తి క్వింటాల్  రూ.10వేలు వచ్చింది. తామర పురుగు రావడం వల్ల మిర్చి పంట దెబ్బతింది. దీనికి సంబంధించి టెక్నికల్‌ కమిటీలు నియమించి... నివారణ చర్యలపై దృష్టిపెట్టాం.

- దీనితో పాటు పంట నష్టపరిహారం సకాలంలో ఇవ్వాలని ముఖ్యమంత్రిగారి సంకల్పం. దాని ప్రకారమే గులాబ్‌ తుపాన్‌కు సంబంధించి పంట నష్టపోయిన 45 రోజుల్లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీని 34,586మంది రైతుల ఖాతాల్లో రూ.22కోట్లు వేయడం జరిగింది. రబీలో పంట నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీ మీద విత్తనాలు అందించాం. గత ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.9,032 కోట్లు చెల్లించాం. దాంతో పాటు వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కింద రూ.1735కోట్లును ఖరీఫ్‌ పంట కింద సెటిల్‌ చేశాం. ముఖ్యమంత్రిగారు బటన్‌ నొక్కగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయిన విషయం అందరికీ తెలిసిందే.

రూ. 16 వేల కోట్లు నష్టం అని ఎలా రాస్తారు?
- అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో వేరుశెనగ రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చూస్తుంది. ఇదీ వాస్తవ పరిస్థితి.  అయితే ఎంఎస్పీ కన్నా పంటల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. ముఖ్యమంత్రిగారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేస్తున్నాం. కానీ సంక్రాంతి ముగిసిన తెల్లారే సరికి రైతు నిండా మునిగిపోతున్నాడంటూ ఈనాడు పత్రికలో అబద్ధాలు, అసత్యాలతో రాతలు రాసి ప్రచారం చేస్తున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ ప్రచారం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏం సాధించాలని ఈ ప్రచారం చేస్తున్నారు? రైతులను ఎందుకు భయాందోళనలకు గురి చేస్తారు? రూ.16వేల కోట్లు నష్టపోయారని ఎలా రాస్తారు? ఏ ప్రాతిపదికన రాస్తారు.? 

- గతంలో రైతులకు కౌలు కూడా రావడం లేదని ఇవ్వలేకపోతున్నారని, ఇప్పుడేమో ఎకరానికి రూ.50వేలు ఉందని రైతుల నష్టపోతున్నారని రాస్తున్నారు. ఏది కరెక్ట్‌? ఏం చేయాలి? తాను వలిచిందే రంభ అనే సామెత లా ఈనాడు రాతలు ఉన్నాయి.  మీకు నచ్చినవాడే నాయకుడు. అది చంద్రబాబు నాయుడు. రోజుకు ఒకసారి అయినా నిరూపించుకునే ప్రయత్నం ఈనాడు రామోజీరావు చేస్తున్నారు. 

- జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం రైతులకు ఏం చేయడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ రైతులకు వాస్తవాలు తెలుసు. ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తూ మా ప్రభుత్వం రైతులను ఏవిధంగా చేయిపట్టి నడిపిస్తుందో వారికి తెలుసు. నేరుగా చెల్లింపులు చేస్తున్నాం. రైతుల కోసం, వ్యవసాయం కోసం సూక్ష్మస్థాయిలో ఆలోచించి పని చేస్తున్నాం.

ఆర్బీకేల్లో ఎరువులు అమ్మితే తప్పేంటి?
- తూర్పుగోదావరి జిల్లాలో 93శాతం నాట్లు పూర్తి అయ్యాయి. మధ్య డెల్టాలో 73శాతం, మెట్ట ప్రాంతంలో 92 శాతం పూర్తవగా యావరేజిన 88శాతం నాట్లు పూర్తి అయ్యాయి. నెలాఖరుకు వందశాతం రీచ్‌ అవుతాం. ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 5లక్షల 9వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. లోన్‌లు, సబ్సిడీ నగదు కూడా రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ అయ్యేలా చేస్తున్నాం.  - రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజిల్లాలో వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఎప్పుడు ఏం కావాలో అనేదానిపై ముఖ్యమంత్రిగారు మమ్మల్ని ప్రతినిమిషం కార్యోన్ముఖులను చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. 
- ఎక్కడా ఎరువులు కొరత లేకుండా చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్బీకేల్లో ఎరువులు అమ్మితే తప్పేంటి? ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మాలని మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. 
- వ్యవసాయానికి ఏ లోటు రాకుండా రైతుకు చేయూత ఇస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. చెప్పినదానికన్నా ముందుగానే, చెప్పినదానికన్నా ఎక్కువగానే రైతులకు మంచి చేయాలన్న మా ముఖ్యమంత్రిగారి సంకల్పంతో మేము కూడా కలిసి పనిచేస్తున్నాం. మీకు అధికారం పోయిందని, మాకు అధికారం వచ్చిందని, వైయస్సార్‌ సీపీని తీవ్రంగా వ్యతిరేకించే శక్తులు ఇకనైనా సంయమనం పాటిస్తే మంచిదని క‌న్న‌బాబు హితవు పలికారు.

Back to Top