కళ్లు మూసుకుపోయి.. దేవుడి ఉత్సవాలపై దుష్ప్రచారం

వినాయక ఉత్సవాలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

చవితి ఉత్సవాలకు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధన పెట్టలేదు.. 

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది

ప్రభుత్వం మీద బురదజల్లుతున్న వారికి చట్టప్రకారం చర్యలు తప్పవు

దేవాదాయా శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరిక

విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై తగ్గిన చర్యలు తీసుకుంటామని, దేవుడి మహోత్సవాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వంపై బురదజల్లాలనుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, గతంలో ఉన్నవే కొనసాగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘ప్రతిపక్షాలకు చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి రిలాక్స్‌ అయ్యాం. ఈ సంవత్సరం విస్తృతంగా వినాయక చవితి మహోత్సవాలు వీధి వీధినా జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది. దానికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వినాయక మండపాల వద్ద ఉపయోగించే మైక్‌ కోసం పోలీసులు రోజుకు రూ.100 వసూలు చేస్తారు. అది ఎప్పటి నుంచో ఉంది. అంతకు మించి ఎక్కడా ఏ రకమైన వసూలు జరగడం లేదు. కార్పొరేషన్‌ ఏరియాలో ఫైర్‌ సర్వీస్, ఇతర సర్వీస్‌ల కోసం రూ.500 రుసుము, మున్సిపాలిటీల్లో రూ.200 వసూలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కాదు. గ్రామాలకు సంబంధించి ఎక్కడా ఒక్క రూపాయి వసూలు చేయకూడదని ఆదేశాలిచ్చాం. 

దుర్మార్గమైన ప్రతిపక్షాలు దేవుడితో ఆడుకుంటున్నాయి. అహంకారంతో కళ్లు మూసుకుపోయి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎక్కడా ఏరకమైన రుసుము వసూలు చేయమని చెప్పలేదు. మైక్‌ పర్మిషన్‌ గతం నుంచి కొనసాగుతోంది. డీఎస్పీ పర్మిషన్‌ ఇస్తారు. డీఎస్పీ దగ్గరకు వెళ్లాలంటే దూరభారం అవుతుందని దగ్గరలో ఉన్న సర్కిల్‌ ఇనిస్పెక్టర్‌ వద్ద అప్లయ్‌ చేస్తే ఆన్‌లైన్‌లో డీఎస్పీకి పంపించి అప్రూవల్‌ ఇచ్చేస్తారు. ఇంతకు మించి ఏరకమైన ఆదేశాలు ఇవ్వలేదు. 

వినాయక ఉత్సవాలకు లైటింగ్‌ ఆనవాయితీగా వస్తుంది. మండపానికి విద్యుత్‌ సరఫరా కోసం సంబంధిత డిపార్టుమెంట్‌ నుంచి పర్మిషన్‌ తీసుకుంటారు. వేలకు వేలు అనే ప్రచారం తప్పు. మండపానికి ఎక్కడో ఒక చోట నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుంటారు.. ఎన్ని యూనిట్లు కాలితే దానికి అంత బిల్లు ఇస్తారు. దానిలో తప్పు ఏముంది.  గతంలో ఎలా ఉన్నాయో అవే తప్ప కొత్తగా ఎలాంటి నిబంధనలు లేవు. వీధుల్లో పెట్టే మండపాలకు వారికి మాత్రమే పోలీసు పర్మిషన్‌ తప్ప.. అపార్టుమెంట్లలో, ఇళ్లలో విగ్రహాలు పెట్టి ఉత్సవాలు జరుపుకునేవారికి ఏరకమైన ఇబ్బందులు లేవు. దుర్మార్గులు అక్రమంగా, అన్యాయంగా దేవుడితో ఆడుకుంటూ ట్రోలింగ్‌ చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారో వారంతా శిక్షార్హులు. వారిపై చర్యలు ఉంటాయి. భగవంతుడితో చెలగాటం ఆడి.. ప్రభుత్వంపై బురదజల్లాలని అనుకుంటున్నవారిని దేవుడే శిక్షిస్తాడు. తప్పుడు ప్రచారం చేసేవారిపై దేవాదాయ శాఖ నుంచి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.  
 

Back to Top