ఈ నెలాఖరు లోగా రైతుల బకాయిలన్నీ చెల్లిస్తాం

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
 
 ప్రతి పైసా కచ్చితంగా చెల్లించే ప్రభుత్వం మాది

 కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలే రూ.5056 కోట్లు

 అందులో రూ.1600 కోట్లు ఈనెల 25న ఇస్తామని వారంటున్నారు

 మరో రూ.1600 కోట్లు నాబార్డు నుంచి రెండు రోజుల్లో రానున్నాయి

21 రోజుల్లోపే చెల్లించాన్నది సీఎం వైయ‌స్‌ జగన్‌ గారి నిర్ణయం

గతంలో చంద్రబాబు 2018 నాటి బకాయిలనే ఎగ్గొట్టి అధికారం నుంచి దిగిపోయాడు

తాడేప‌ల్లి: ఈ నెలాఖరు నాటికి రైతుల బ‌కాయిల‌న్నీ చెల్లిస్తామ‌ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు రూ.1600 కోట్లు.. నాబార్డు నుంచి వచ్చే రుణం మరో రూ.1600 కోట్లతో ఈ నెలాఖరు నాటికి రైతులకు ప్రతి పైసాతో సహా మొత్తం చెల్లిస్తామ‌ని తెలిపారు.  రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని ధైర్యం చెప్పారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని చెప్పారు.  చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో సగటున 55 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తే, సీఎం వైయ‌స్ జగన్‌ గారి ప్రభుత్వం సగటున ఏటా 83 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించింద‌ని,  అంటే పండే పంట పెరిగింది. కొనుగోలు కూడా పెరిగింది.  వీటన్నింటినీ చూసి బాబు, ఎల్లో మీడియా ఎందుకు ఏడుస్తున్నారో వారే చెప్పాలని ప్ర‌శ్నించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

ఏటా 83 లక్షల టన్నుల ధాన్యం:
    ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు విపక్షనేత చంద్రబాబు, అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులు డబ్బులు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. దాన్ని ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు రైతుల ముసుగులో కొందరు టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ వారినే రైతులుగా చూపుతూ చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు’.
    ‘చంద్రబాబు తన పాలనలో 2014 నుంచి 2019 వరకు చూస్తే, ఏటా సగటున 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించారు. అదే మేము అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో చూస్తే, ఏటా 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం. ఆ విధంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కంటే దాదాపు 28 లక్షల టన్నుల ధాన్యం అదనంగా సేకరించింది. రైతులు బాగుండాలని భావించే సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారి కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు’.

రెట్టింపు చెల్లింపులు:
    ‘ఇక చంద్రబాబు తన హయాంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఏటా చెల్లించిన సగటు మొత్తం రూ.8,500 కోట్లు మాత్రమే. 
అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ రెండేళ్లలో ఏటా రూ.16 వేల కోట్ల చొప్పున, మొత్తం రూ.32 వేల కోట్లు చెల్లించాం. అంటే దాదాపు రెట్టింపు, గిట్టుబాటు ధర కూడా పెంచి, వారికి సకాలంలో డబ్బులు చెల్లించాం’.

ఆ నిబంధన సీఎం వైయ‌స్ జగన్‌ గారిదే:
    ‘ధాన్యం సేకరించిన తర్వాత 21 రోజుల్లో రైతులకు నగదు చెల్లించాలన్న నియమం స్వయంగా నిర్దేశించుకుంది సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. నిజానికి ఆ నిబంధన కేంద్రం కూడా పెట్టలేదు. చంద్రబాబు అసలు ఆ ఆలోచన కూడా చేయలేదు. ఇంకా చంద్రబాబు తన పాలనలో రైతులకు రెండు, మూడు నెలల తర్వాత పైకం చెల్లించేవారు. అందుకే ఆయనకు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు, ఆయనకు బాకా ఊదుతున్న మీడియా సంస్థలు గుర్తించాలి’.

వక్రీకరణ వద్దు:
    ‘అదే విధంగా మేము రైతుల డబ్బు వాడుకున్నామని చంద్రబాబు, కొందరు బీజేపీ నేతలతో పాటు, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి’.

కేంద్రం బకాయిలు రూ.5056 కోట్లు:
    ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రూ.5,056 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. మేము రైతుల నుంచి ధాన్యం సేకరించి, అదనంగా ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తాం. దానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రూ.5,056 కోట్లు రావాల్సి ఉంది. ఆ నిధుల కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయడంతో ఈనెల 25న రూ.1600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. అదే విధంగా నాబార్డు నుంచి మరో రూ.1600 కోట్లు వచ్చే రెండు, మూడు రోజుల్లో (మంగళ, బుధవారాలు) రానున్నాయి. అవి రాగానే వెంటనే రైతులకు చెల్లిస్తాం.
రైతులకు ఇంకా రూ.3,393 కోట్ల బకాయిలు ఉన్నాయి’.
    ‘ఈ ఏడాది మేము రైతులకు ఇప్పటి వరకు దాదాపు రూ.3,400 కోట్లు జమ చేశాం. ధాన్యం సేకరించిన తర్వాత 21 రోజుల్లో రైతులకు నగదు ఇవ్వాలన్న నిబంధన ప్రకారం ఇచ్చాం’.

ఆ మొత్తం రూ.1204 కోట్లు మాత్రమే:
    ‘అయితే 21 రోజులు దాటిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.1,204 కోట్లు మాత్రమే. ఆ డబ్బును కూడా వచ్చే రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తాం. రైతులకు బకాయి పడిన మొత్తం రూ.3,400 కోట్లలోనే ఆ మొత్తం కూడా ఉంది’.

    ‘రైతులకు 21 రోజుల్లో డబ్బు చెల్లించాలన్న నియమం మేము పెట్టుకున్నదే. కానీ చంద్రబాబు ఆ డిమాండ్‌ చేస్తూ, రైతులను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు’.

అసత్య ప్రచారాలు మానండి:
    ‘మేము ఈ రెండేళ్లలో రైతులకు ధాన్యం సేకరణ కింద దాదాపు రూ.32 వేల కోట్లు చెల్లించాం. ఇంకా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.3,400 కోట్లు కూడా ఈ నెలలోనే ఇవ్వబోతున్నాం. ఇంత చేస్తున్నా చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతూ, విమర్శలు చేస్తుంటే, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా, రైతులకు అన్యాయం జరుగుతోందని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాబట్టే, ఆయనను గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితం చేసి, గోతిలో పాతి పెట్టారు’.

రికార్డు స్థాయిలో పదవులు:
    ‘నిన్న (శనివారం) ఒకేసారి 137 నామినేటెడ్‌ పదవులు (కార్పొరేషన్‌ పదవులు) భర్తీ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఒక చరిత్ర సృష్టించారు. చంద్రబాబు ఏనాడూ ఒకేసారి కార్పొరేషన్‌ పదవులు ప్రకటించలేదు. సామాజిక న్యాయం అంటే, ఆయన కేవలం తన సామాజిక వర్గానికే న్యాయం చేశారు’.
    ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన క్యాబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 56 శాతం పదవులు ఇస్తే, ఇవాళ కార్పొరేషన్‌ పదవుల్లో వారికి మరో 2 శాతం ఎక్కువగా, 58 శాతం పదవులు ఇచ్చారు.
ఆయనను ప్రభావితం చేయాలని ఎందరు ప్రయత్నించినా, ఎక్కడా వెనక్కు తగ్గకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు న్యాయం చేస్తానన్న మాటకు కట్టుబడి ఆ పదవులు ఇచ్చారు. మహిళలకు మొత్తం పదవుల్లో 50 శాతం ఇచ్చారు’.

చంద్రబాబు గాలికొదిలేశారు:
    ‘అయితే కళ్లు లేని కబోదులు, సీఎం గారిని అల్లరి చేయాలని చెప్పి, లేనిపోని విమర్శలు చేస్తున్నారు. గతంలో రాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు కలలు కన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని, ఆయనకు వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అదే ఎన్టీఆర్‌ మహిళల కోసం ఆస్తిలో వాటాను ప్రవేశపెట్టారు. వారికి చట్టసభల్లో మూడో వంతు పదవులు ఇవ్వాలని తలంచారు. కానీ చంద్రబాబు వాటన్నింటినీ గాలికొదిలేశారు’.

గాంధీజీ కలల సాకారం:
    ‘నాడు మహానేత వైయస్సార్‌ బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో పాటు పడితే, ఆయన వారసుడిగా గాం«ధీగారి కలలను సాకారం చేస్తూ, గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. క్యాబినెట్‌ ఏర్పాటులోనూ సామాజిక న్యాయం అమలు చేశారు. అదే విధంగా రైతులకు మేలు చేయడం కోసం వారికి 21 రోజుల్లో పైకం చెల్లించాలన్న నిబంధన పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు అబద్ధాలు చెబుతూ, పెద్ద బిల్డప్‌ ఇస్తున్నారు’.

విపక్ష హోదా కూడా రాదు:
    ‘చంద్రబాబూ నీ పని అయిపోయింది. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇస్తే, చంద్రబాబు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ఆనాడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు? వారు ఎలాగూ చేయలేదు కాబట్టి, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మీద బురద చల్లుతున్నారు’.
    ‘ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎం గారిపై దేవుడి దయ, ప్రజల ఆదరణ ఉంటుంది. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేవు. 2024 ఎన్నికల్లో నీకు కనీసం ప్రతిపక్షం హోదా కూడా రాదు. నీ కొడుకు పప్పు ఏమీ చేయలేడని తెలుసు. అందుకే బిజేపీతో జత కట్టాలని చూస్తున్నావు. నీ పార్టీని బీజేపీలో కలిపేయి’.

కరోనా కష్టకాలంలోనూ..:
    ‘దాదాపు రెండేళ్లుగా కరోనా అన్నింటినీ అస్తవ్యస్తం చేసింది. అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. అయినా సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఏనాడూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. కొన్నింటిని గడువు కంటే ముందే అమలు చేశారు. మీ దృష్టిలో ప్రభుత్వం బాగుంది అంటే, గల్లాలో డబ్బులు ఉండాలి. కానీ అది కాదు. ప్రజల గురించి ఆలోచించే, వారికి మంచి చేసేదే ప్రభుత్వం. వారి బాగోగుల కోసం పని చేసేదే ప్రభుత్వం’.

అలా మాట్లాడడం సరికాదు:
    ‘మొన్న తిరుపతి ఉప ఎన్నికలో కూడా దారుణంగా ఓడి పోయారు. మీకు రాష్ట్రంలో డిపాజిట్‌ రాదు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
ప్రభుత్వం ఎలా నడపాలో సీఎం గారికి తెలుసు. బీజేపీ నేతలు అర్ధం లేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మంత్రికి రూ.3 కోట్లతో ఇల్లు కట్టించి ఇచ్చారంటున్నారు. ఆ వివరాలు చెబితే, ప్రభుత్వమే దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటుంది’.
    ‘అధికారంలో లేని పార్టీ వారు తమకు తోచింది మాట్లాడతారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా అలా మాట్లాడడం ఏ మాత్రం సరి కాదు’.. అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top