పథకాలన్నీ పేదలకు చేరాలన్నదే సీఎం లక్ష్యం

వరి చేనుకు, చేపల చెరువుకు తేడాతెలియని మేధావి లోకేష్‌

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి ప్రతీ హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా సీఎం వైయస్‌ జగన్‌ భావిస్తున్నారన్నారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రూపంలో రైతులకు పంట పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తున్నామన్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్నారు. అదే విధంగా ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్త‌నాలు, పురుగు మందులు, ఎరువులు అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదలకు చేరాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. 

2024లో టీడీపీని కొల్లేరులో కలపడం ఖాయం
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని, బాబుకు డబ్బా కొట్టేందుకే రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్‌ నాయుడు ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు లోకేష్‌ తీరు ఉందన్నారు. వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని మేధావి లోకేష్‌ అని ఎద్దేవా చేశారు. 2024లో తెలుగుదేశం పార్టీని నారా లోకేష్‌ కొల్లేరులో కలపడం ఖాయమన్నారు. 
 

Back to Top