అన్ని ప్రాంతాల అభివృద్ధి మా బాధ్యత

అభివృద్ధి ఒకే చోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉంది

సీఎం నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు

చంద్రబాబు రైతులను ముంచేసి మళ్లీ రెచ్చగొడుతున్నాడు

జైలుశిక్ష తప్పించుకోవడానికి సుజనాచౌదరి బీజేపీలో చేరారు

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

సచివాలయం: అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం ఉందని, అభివృద్ధి ఒకే చోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మెజార్టీ ప్రజలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు. సచివాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా వాసిగా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో కాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటూ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారన్నారు.

చంద్రబాబు రైతులను ముంచేసి మళ్లీ రెచ్చగొడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కేఈ కృష్ణమూర్తి సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు ఏం మాట్లాడితే అదే చెప్తున్నాడన్నారు. రాజధాని రాష్ట్ర మధ్యలో ఉండాలంటే.. ఢిల్లీ తీసుకువచ్చి దేశం మధ్యలో పెట్టమంటారా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి ఒకే చోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై కొంతకాలంగా డిమాండ్‌ ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని, అందుకే సీఎం వైయస్‌ జగన్‌ మూడు ప్రాంతాల అభివృద్ధిపై మాట్లాడారని చెప్పారు. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, కొంపలు మునిగిపోయినట్లుగా చంద్రబాబు, పవన్‌ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం వైయస్‌ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారన్నారు. సుజనా చౌదరి మాటలకు బీజేపీలో విలువ లేదని, జైలుకు పోకుండా తప్పించుకోవడానికి సుజనా బీజేపీలో చేరారన్నారు. రైతులు ఆందోళన చెంది చంద్రబాబు ఉచ్చులో పడొద్దని, చంద్రబాబు చెప్పే గ్రాఫిక్స్‌ వాస్తవంగా సాధ్యం కాదన్నారు. నగరాలు నిర్మించడం ఎవరికీ సాధ్యం కాదని, హైదరాబాద్, చెన్నై ముంబైని ప్రభుత్వాలు నిర్మించాయా..? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. మెజార్టీ ప్రజలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  

 

Back to Top