చంద్రబాబును ఏ1గా చేర్చాలి

మాజీ స్పీకర్‌ మృతికి బాబు వైఖరి కారణంగా కనిపిస్తుంది

కోడెల శివప్రసాద్‌ కాల్‌డేటాను పరిశీలించాలి

పది రోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా వేధించారు

సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపు తయారు చేశారు

ఏకంగా సస్పెండ్‌ చేయాలని మీటింగ్‌ కూడా పెట్టారు  

ఏపీ పోలీసులు కోడెలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు

ప్రభుత్వంపై బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

 పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కేసులో చంద్రబాబు పాత్రపై కూడా విచారణ జరిపించాలని, ఏ1గా చంద్రబాబును చేర్చాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు. పది రోజులుగా కోడెలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మూడు రోజుల క్రితం గుంటూరులో చంద్రబాబు మీటింగ్‌ పెట్టిన మాట వాస్తవమా.. కాదా సమాధానం చెప్పాలన్నారు. కోడెల శివప్రసాదరావుపై ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని, ఆయన, ఆయన కుమారుడు, కూతురు బాధితులు ముందుకు వచ్చి కేసులు పెట్టారన్నారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు కోడెలకు నోటీసులు కూడా ఇవ్వలేదని, కనీసం విచారణకు హాజరుకావాలని కూడా కోరలేదన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లుతున్నాడని మండిపడ్డారు.

సచివాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. నిన్న కోడెల శివప్రసాద్‌ చనిపోయిన నాటి నుంచి చంద్రబాబు ఎక్కడ మీడియా కెమెరాలు ఉంటే అక్కడ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి కోడెలను వేధించి ఆయన చావుకు కారణమైందని, సీఎం వైయస్‌ జగన్‌పై 306 కేసు పెట్టాలి. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమాధానం చెప్పాలని చంద్రబాబు అడుగుతున్నాడు. పోలీసు కేసులు ప్రభుత్వం పెట్టలేదు. కోడెల, ఆయన కుమారుడు, కూతురు బాధితులం అని కొంతమంది బిల్డర్లు, కాంట్రాక్టర్లు, బాధితులంతా వచ్చి కేసులు పెట్టారు. కోడెల స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి అసెంబ్లీ ఫర్నిచర్‌ వాడుకుంటున్నాను. అడిగితే ఇచ్చేస్తానని చెప్పిన మాట వాస్తవం. ఎవరు ఏ కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం నుంచి కోడెల, ఆయన కుమారుడు, కూతురుకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. స్టేషన్‌కు రమ్మని, విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరలేదు. ఈ మూడు నెలల్లో ఆయన గుంటూరులో, హైదరాబాద్‌లో ఉన్నా అరెస్టు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. 30 నుంచి 40 మంది కేసులు పెడితే ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత పిరికివాడు కోడెల కాదు. ఎవరైనా పోరాటం చేస్తారు కానీ ఆత్మహత్య చేసుకోరు. మనం నమ్ముకున్న కుటుంబసభ్యులు, పార్టీ, పార్టీ అధ్యక్షుడు మనల్ని వదిలించుకోవాలి. దూరంగా పెట్టాలనే ఆలోచనతో పక్కనబెట్టినప్పుడే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 23 మంది వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ్యులు టీడీపీలోకి వచ్చినా చంద్రబాబు మాట విని వారిపై అనర్హత వేటు వేయకుండా మంత్రులను చేసినా చూస్తూ కూర్చున్నా.. నాకు కష్టం వచ్చినా స్పందించడం లేదు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పార్టీలో ఇన్వాల్వ్‌ చేయడం లేదు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులను పెట్టి కోడెల తప్పు చేశాడు అని మాట్లాడించాడు.

చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో విలేకరు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పాడు. శాసనసభ ఫర్నీచర్‌ వ్యవహారంలో కోడెల శివప్రసాద్‌పై చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా కాదనమని చెప్పాడు. ఇది వాస్తవమా కాదా..? కోడెలను మొదటి నుంచి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. 1999 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్‌ ఇంట్లో బాంబులు పేలాయని కేసులు పెట్టి విచారణ చేసింది వైయస్‌ జగన్‌ జగన్‌నా..? చంద్రబాబా..? 1999లో కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా జూనియర్‌ అయిన ఆళ్లపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చి కోడెలను పక్కనబెట్టారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నర్సరావుపేట నుంచి 2014 ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా సత్తెనపల్లి కేటాయించారు. గెలిచిన తరువాత మంత్రి పదవి కోరుకుంటే ఇవ్వకుండా స్పీకర్‌ పదవి ఇచ్చారు. నారా లోకేష్‌ కోడెల కుమారుడిని పెట్టుకొని కమీషన్లు తీసుకొని వాటాలు పంచుకుంది వాస్తవం కాదా చంద్రబాబూ..?

చనిపోయిన నాటి నుంచి కోడెల శివప్రసాద్‌ చంద్రబాబుకు పల్నాటి పులిగా కనిపిస్తున్నాడు. ఇటీవల తొమ్మిది రోజులు వైయస్‌ఆర్‌ సీపీ బాధితుల శిబిరం అని పల్నాడులో చంద్రబాబు ఏర్పాటు చేశాడు. ఆ శిబిరానికి కోడెలను రానివ్వకుండా ఎందుకు అడ్డం పడ్డావు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనకు పల్నాటి పులిని ఎందుకు రానివ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపును తయారు చేసింది ఎవరూ..? కోడెలను అక్కడ తీసివేయాలని గ్రూపును తయారు చేసిన వ్యక్తులు ఎవరూ..? కోడెలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా సత్తెనపల్లి వెళ్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే నువ్వు గుడ్డి గుర్రాలుక పళ్లు తొవ్వావా..? కోడెలకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి ఆయన్ను పార్టీ నుంచి తప్పించాలని గుంటూరులో మూడు నాడు నాయకులతో చర్చించిన మాట వాస్తవమా.. కాదా సమాధానం చెప్పాలి. పది రోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా వేధించిన మాట వాస్తవమా.. కాదా..? హైదరాబాద్‌లో కలుద్దామని చెప్పి అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా కోడెలను పొద్దటి నుంచి సాయంత్రం వరకు వెయిట్‌ చేయించిన మాట వాస్తవమా.. కాదా..? నిన్న ఉదయం 9:30 గంటల అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూసి చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుంటే కోడెల ఉరివేసుకొని చనిపోయింది నిజమా.. కాదా..?

కోడెల చనిపోయిన నాటి నుంచి మృతదేహం పక్కనే కూర్చొని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నాడు. శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్లలా..? కోడెల పులి అయితే చంద్రబాబు నక్క. పులిని నక్క మోసం చేసినట్లే కోడెలను చంద్రబాబు మోసం చేసి చంపేశాడు. ఆ రోజు ఎన్టీఆర్‌ మీద పద్ధతి ప్రకారం చావుకు కారణం అయ్యాడు. చనిపోయిన తరువాత శవం దగ్గర కూర్చొని దొంగ ఏడుపులు ఏడ్చి శవయాత్రలో పాల్గొన్న వ్యక్తి చంద్రబాబే. ఎన్టీఆర్‌ చావుకు కారణం తెలియాలి. సీబీఐ ఎంక్వైరీ వేయాలని మంత్రి పదవికి నందమూరి హరికృష్ణ రాజీనామా చేశారు. ఆ తరువాత సీబీఐ ఎంక్వైరీ వేయలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. పార్టీ నుంచి హరికృష్ణను వెల్లగొట్టాడు. కోడెల బతికి ఉండగా ఈ మూడు నెలల్లో ప్రభుత్వం వేధిస్తుందని ఒక్కసారైనా చంద్రబాబు మాట్లాడాడా..? పల్నాడు శిబిరానికి ఎందుకు రానివ్వలేదు. కోడెల నుంచి సస్పెండ్‌ చేయాలని చర్చలు జరిపాడు. సస్పెండ్‌ చేస్తే నక్కజిత్తుల బతుకంతా ఎక్కడ బయటపెడతాడోనని భయపడి కోడెల చనిపోవడానికి ప్రేరణ కల్పించి ఆయన్ను వదిలించుకున్నాడు.

కోడెల శివప్రసాద్‌ కాల్‌డేటాను పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. చంద్రబాబును కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడో.. కోడెల చావుకు బాబు ఏరకంగా కారణమయ్యాడో బయటకు తీయాలని కోరుతున్నా. ఓటుకు కోట్ల కేసులో కూడా చంద్రబాబును వదిలేశారు. కోడెల కేసులో చంద్రబాబు పాత్రపై కూడా విచారణ జరగాలి. ఏ1గా చంద్రబాబును పెట్టాలి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిస్పక్షపాత విచారణ జరిపించాలని కోరుతున్నా. ఎన్టీఆర్‌ శవయాత్రలో చంద్రబాబుపై జనం చెప్పులు విసిరారు. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు చేసిన ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తున్నారు. మనిషిని ఎలా వాడుకుంటావనేది. నక్కజిత్తులు, నీచమైన ఆలోచనలు ప్రజలంతా గమనిస్తున్నారు. ఒకవేళ ప్రజలు దాడి చేస్తే ప్రభుత్వంపై నిందలు వేయొద్దు. సూసైడ్‌ నోటు ఉందేమోనని బాబు నిన్న రాత్రి వరకు దాక్కున్నాడు. తెలంగాణ పోలీసులు ఏ నోటు లేదని చెప్పగానే బయటకు వచ్చాడు.

సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎవరి మీద కక్షసాధింపు చర్యలకు దిగదు. ఎవరైనా కేసులు పెడితే పోలీసులు విచారణ చేస్తారు. కోడెల కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదు. ఆయన నమ్ముకున్న పార్టీ, నాయకుడు, ఆయన కుటుంబసభ్యుల వల్లే జరిగిన అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న ఉద్దేశం కనిపిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top