అర్హులైన ప్రతి కుటుంబానికి బియ్యం కార్డు

రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల లబ్ధిదారుల గుర్తింపు

అర్హత ఉండి అందకపోతే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో అందజేస్తాం

లబ్ధిదారులకు రైస్‌ కార్డులు అందజేసిన మంత్రి కొడాలి నాని

 

విజయవాడ: అర్హులైన ప్రతి కుటుంబానికి బియ్యం కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత పరిశీలించి ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని వివరించారు. విజయవాడలోని జాయింట్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నూతన బియ్యం కార్డులను లబ్ధిదారులకు మంత్రి కొడాలి నాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డుల పరిశీలన అనంతరం 1.29 కోట్ల మందిని బియ్యం కార్డులకు అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. గతంలో 1.47 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా.. వాటిలో దాదాపు 2 లక్షల కార్డులకు  సరైన అడ్రస్‌లు లేవని, 6 లక్షల మంది తమకు అర్హత ఉన్నా కార్డులను తొలగించారని దరఖాస్తు చేస్తున్నారని, వాటిని ఈ నెలాఖరు లోగా అర్హులను పరిశీలించి ఇస్తామన్నారు. మరో 8 లక్షలు మంది ఆరోగ్యశ్రీ, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఉంటే చాలని రేషన్‌ కార్డులను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారన్నారు. బియ్యం కార్డులు అందించేందుకు కృషి చేస్తున్న వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి మంత్రి నాని అభినందనలు తెలిపారు.

బియ్యం కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో 365 రోజులు దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి సూచించారు. బియ్యం కార్డులకు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, రాష్ట్రంలో 10లక్షల కుటుంబాలు మినహా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. బియ్యం కార్డులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కార్డులు ఆరోగ్యశ్రీ కోసం, 1.40 కోట్ల కార్డులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం గుర్తించడం జరిగిందన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు నూటికి నూరు శాతం అందించాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్, సబ్‌ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌ పనిచేస్తున్నారన్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రజల్లో ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం బతికి ఉండడానికి సీఎం వైయస్‌ జగన్‌ కారణమన్నారు.

Back to Top