సెప్టెంబర్‌ 1 నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం 

పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని

అమరావతి : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌ 1 నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40 శాతం బియ్యం తినడానికే వీలులేకుండా చేశారని ధ్వజమెత్తారు. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకే ప్యాక్‌ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.

ప్యాకింగ్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.. రూ.12 వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్‌ 2 నుంచి కొత్త రేషన్‌కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. గతంలో టీడీపీ 15 లక్షల రేషన్‌ కార్డులను అనర్హులకు ఇచ్చిందని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top