రేషన్‌ సరుకుల్లో కోత లేదు.. వాస్తవాలు తెలుసుకోండి

అన్ని చోట్లా బియ్యం, కందిపప్పు సరఫరా చేస్తున్నాం

చంద్ర‌బాబు హయాం కంటే ఇంకా ఎక్కువే సరఫరా చేశాం

ఇకనైనా బాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం ఆపాలి

దేశంలోనే ఆదర్శంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉంది.. ఎక్కడా లోటు లేదు

రోడ్ల మరమ్మతు పనులూ వేగంగా జరుగుతున్నాయి

పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

తాడేపల్లి: రేష‌న్ స‌రుకుల్లో కోత‌లేద‌ని, అన్ని చోట్లా బియ్యం, కందిప‌ప్పు ల‌బ్ధిదారుల‌ ఇంటి వ‌ద్ద‌కే స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 76.81 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయగా, అందుకోసం రూ.12,377 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేశార‌ని, అదే వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం కేవలం రెండేళ్ల 10 నెలల్లో 81.68 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింద‌ని, ఇందుకోసం రూ.12,379 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి నాగేశ్వ‌ర‌రావు ఏం మాట్లాడారంటే.. 

``ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పౌర సరఫరాల శాఖలో వినూత్న మార్పులు చేసిన సీఎం వైయస్‌ జగన్, ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. నాణ్యమైన (సార్టెక్స్‌) బియ్యం సరఫరా చేయడంతో పాటు, రేషన్‌ సరుకులను కూడా ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా, ఎల్లో మీడియా రోజూ ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. చంద్రబాబు కరపత్రాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఆయన్ను జాకీతో ఎత్తాలని నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయినా ఏ మాత్రం లాభం లేదు. ఈ ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులు, క్వాలిటీ బియ్యం ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తుంది. 

అందుకే దుష్ప్రచారం..
కేవలం రెండేళ్ల 10 నెలల్లో 81.68 లక్షల టన్నుల బియ్యాన్ని మా ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.12,379 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ స్థాయిలో రేషన్‌ బియ్యం పంపిణీ చేసి, అంత మొత్తాన్ని ఇంత తక్కువ సమయంలో ఖర్చు చేసినా..  చంద్ర‌బాబు, ఎల్లో మీడియాకు కనపడదు. చెప్పినా వినపడదు. కానీ ఎంతసేపూ ఏ రకంగా బురదచల్లాల‌న్నదే వారి ఆలోచన. సీఎం వైయ‌స్‌ జగన్ చిన్న వయస్సులోనే పదవి చేపట్టి, చక్కగా పరిపాలిస్తున్నారు. ఎక్కడా ఏ వివక్ష చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో తమకు ఇక భవిష్యత్తు లేదని గుర్తించిన చంద్రబాబు, తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు.

నాడు కందిపప్పు ఇవ్వలేదు..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్‌ షాపుల్లో 2014 నుంచి 2016 వరకు కందిపప్పు ఇవ్వలేదు. అప్పుడు ఎల్లో పత్రికలు ఏమయ్యాయి? ఎందుకు ఆపారని కూడా ప్రశ్నించలేదు. ఆ తర్వాత 2016 నుంచి 2018 వరకు రేషన్‌ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం మొదలు పెట్టినా దాన్ని కేవలం గిరిజన ప్రాంతాల్లోనే అమలు చేశారు. అది కూడా మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే, రూ.23 సబ్సిడీ ఇస్తూ, రేషన్‌ షాపుల్లో కిలో కందిపప్పు రూ.40 చొప్పున ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రంజాన్‌ సమయంలోనూ, సంక్రాంతికి మాత్రమే 2 కేజీల కందిపప్పు రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చారు. అయినా ఆ రెండు పత్రికలు మాట్లాడలేదు.

అదే మా ప్రభుత్వం వచ్చాక బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.106 ఉంటే, దానిపై రూ.39 సబ్సిడీ మీద రూ.67కే ఇస్తున్నాం. అప్పటి ప్రభుత్వం 5 ఏళ్లలో 16 వేల మెట్రిక్‌ టన్నుల కందిపప్పు సరఫరా చేసి, అందుకోసం రూ.254 కోట్లు ఖర్చు చేయగా, మా ప్రభుత్వం రెండేళ్ల 10 నెలల్లో 5.14 లక్షల మెట్రిక్‌టన్నులు పంపిణీ చేసింది. ఇక అందుకోసం చేసిన వ్యయం రూ.1350 కోట్లు.    ఈ తేడాను ఒక్కసారి ఎల్లో పత్రికలు గమనించాలి. ఇప్పటికైనా వాస్తవాలు రాయాలి. ఏ ప్రభుత్వం కోతలు పెట్టిదన్నది చెప్పాలి. పత్రికలు విశ్వసనీయత కోల్పోవద్దు.

పంచదార వివరాలు..
పంచదారకు సంబంధించి గత ప్రభుత్వం 5 ఏళ్లలో 2.48 లక్షల టన్నులు ఇచ్చి రూ.314 కోట్లు ఖర్చు చేసింది. అదే మా ప్రభుత్వం ఈ రెండేళ్ల 8 నెలల్లోనే 2.70 లక్షల టన్నులు సరఫరా చేయగా, అందు కోసం చేసిన వ్యయం రూ.541 కోట్లు. ఇవన్నీ చూస్తూ చంద్ర‌బాబు, ఎల్లో మీడియా ప్ర‌తినిధులు ఓర్చుకోలేకపోతున్నారు.

సీఎం వైయ‌స్ జగన్‌ సుపరిపాలన.. 
చంద్రబాబు తన సుదీర్ఘ 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక సెంటు భూమి కొనలేదు. ఎవరికీ ఇంటి స్థలం ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వం ఇప్పటికే 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, రెండో విడతలో మరో లక్షకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అందరికీ ఇళ్లు కూడా కట్టిస్తోంది. కాబట్టి ఇకనైనా రామోజీరావు వాస్తవాలు తెలుసుకోవాలి. నిజాలు రాయాలి. దుష్ప్రచారం మానాలి. దేశంలోనే సీఎం వైయస్‌ జగన్‌ అత్యుత్తమంగా పరిపాలిస్తున్నారు. అందులో అవార్డులు కూడా పొందారు. కానీ అది మీరు రాయరు. సీఎం తన పథకాలతో ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు. బంధువుగా మారారు.

మా ప్రభుత్వం ఏ పథకంలోనూ వివక్ష చూపడం లేదు. చివరకు విపక్ష టీడీపీ సభ్యులకు కూడా అర్హత ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయి. అభినందిస్తున్నాయి. ముఖ్యంగా సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌. కర్ణాటక బృందాలు పర్యటించాయి కూడా.

అందుకే అన్నారేమో?..
రాష్ట్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు నేనూ విన్నాను. తనకు ఎవరో ఫ్రెండ్‌ చెప్పారని ఆయన అన్నారు. నిజానికి మంత్రి మెప్పు పొందడం కోసం ఆ ఫ్రెండ్‌ కావాలనే అలా చెప్పాడని అనుకుంటున్నాం. లేదా ఆ వ్యక్తి మా పార్టీకి వ్యతిరేకం అయి ఉండొచ్చు. ఇవాళ ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. ఎక్కడా లోటు లేదు. పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నాం. నా నియోజకవర్గంలోనే రూ.200 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. వేసవిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామన్నారు. కానీ ఇచ్చారా? కానీ ఈ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతోంది. కేటీఆర్‌ మాట్లాడినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమీ లేదు. సీఎం వైయ‌స్ జగన్ దేశమంతా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆయనను ఒక మాట అంటే తనకు ప్రచారం వచ్చి, ఎదగొచ్చని తెలంగాణ మంత్రి అనుకున్నారేమో?.

బీసీల పక్షపాతి..
తమది బీసీల పార్టీ అని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ నిజానికి సీఎం వైయస్‌ జగన్  హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతోంది. ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు, మంత్రివర్గంలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు`` అని మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top