సాహస వీరులకు నగదు ప్రోత్సాహకం

కచ్చులూరి ఆపరేషన్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

బోటు ప్రమాదంపై విచారణ కమిటీ

బోటు బయటకు తీసేవారికి ప్రభుత్వ సహకారం ఉంటుంది

ఆచూకీ దొరకని వారి డెత్‌ సర్టిఫికెట్లపై త్వరలోనే నిర్ణయం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

అమరావతి: కచ్చులూరు వద్ద బోటు మునిగిన సంఘటనలో గిరిజనులు ఎంతో సహసం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారని, అలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. బోటు బయటకు తీస్తామంటూ చాలా మంది వస్తున్నారని, ఎవరైనా బయటకు తీస్తామంటే ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఈవిషయంపై ప్రతిపక్ష నేతలు అనవసరమైన విమర్శలు మానుకోవాలన్నారు. బోటు మునక ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని మంత్రి కన్నబాబు అన్నారు. దేవిపట్నంలో బోటు బోల్తా ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కమిటీ వేస్తామని తెలిపారు. బోటును బయటకు తీయడం సంక్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. బోటును బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, రాజకీయాల కోసం ప్రతిపక్ష నేతలు విమర్శలు మొదలుపెట్టారని ఫైర్‌ అయ్యారు. దేశంలో ఇంతవరకు ఇంత లోతులో ఉన్న లాంచీని ఎప్పుడు చూడలేదన్నారు. ఎవరైనా తీస్తామని ముందుకు వస్తే ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. 
సంఘటన జరిగిన వెంటనే కచ్చులూరి గ్రామస్తులు కొంత మంది ఒడ్డు నుంచి చూసి ప్రమాదంలో ఉన్న 26 మందిని కాపాడారని చెప్పారు. వారిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారని చెప్పారు. గిరిజనుల విషయాన్ని సీఎంకు వివరించామన్నారు. ఆ రోజు సహసం చేసి ప్రయాణికులను కాపాడారో వారికి నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.25 వేలు ప్రోత్సహక నగదు  ఇస్తున్నామన్నారు. వారి సహసం 26 మందిని కాపాడిందని, వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక సేవా కార్యక్రమం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచూకీ లభ్యం కాని వ్యక్తులకు సంబంధించి డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని బాధితుల బంధువులు కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘటనలోని బాధితులకు అండగా నిలబడిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. 
 

Back to Top