బాబూ..అసెంబ్లీకి రండి చర్చిద్దాం

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అట్టర్‌ ప్లాప్‌

రోడ్డెక్కి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు

ప్రజా చైతన్యం అంటే ఏమిటో చంద్రబాబుకు ఎన్నికల్లో జనం చూపెట్టారు

 అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు స్వజన ఉద్యమం

భవిష్యత్‌పై భయంతోనే బాబు దిగజారి మాట్లాడుతున్నారు

 ఇండియాకు ట్రంప్‌ వచ్చిన వెంటనే చంద్రబాబును అడిగారట

వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు

మంత్రి కన్నబాబు

కాకినాడ:  భవిష్యత్‌పై భయంతోనే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, దమ్ముంటే వైయస్‌ జగన్‌ తొమ్మిది నెలల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మంత్రి కన్నబాబు సవాలు విసిరారు. సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లడం కరెక్ట్‌ కాదని, ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమయ్యారని, ప్రజా చైతన్యం అంటే ఏమిటో గత ఎన్నికల్లో చంద్రబాబుకు చూపెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబుకు  ఉక్రోషం, ఆవేదన దేనికోసమని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి చంద్రబాబు దిగజారి మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇదేనా మీ రాజకీయ అనుభవమని ప్రశ్నించారు.  కాకినాడలో మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు.  
ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించి..అబద్ధాలు, అవాక్కులు, చవాక్కులు పేల్చుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టుమని పది మంది కూడా చంద్రబాబు మీటింగ్‌లో లేరు. టీవీలు ఎంతసేపు చంద్రబాబును క్లోజప్‌లో చూపించారే తప్ప జనాన్ని చూపించలేదు. ప్రజలు చైతన్యవంతమైన టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించారు. ప్రజా చైతన్యమంటే ఏంటో చూపించారు. ఆ ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందో అని చంద్రబాబుకు తగిలిన దెబ్బతో అర్థమైంది. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు రోడ్డెక్కారు. అసలు చంద్రబాబు ప్రజలను ఏమని చైతన్యపరుస్తారు?. ఎక్కడైనా ప్రతిపక్ష పాత్రలో ఉన్నవారు అధికార పార్టీకి సమయం ఇస్తారు. అవసరమైతే సలహాలు, సూచనలు ఇస్తారు. ఎన్నికల సమయంలో వేడెక్కించేలా మాట్లాడుతారు. కానీ చంద్రబాబు మాత్రం వైయస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమానికి తెర లేపారు. లేనిది ఉన్నట్లు అబద్దాలు చెబుతున్నారు. ఇది నరకాసుర పరిపాలన అంటూ చంద్రబాబు చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. తొమ్మిది నెలల్లో ఏం నరకాసుర పరిపాలన జరిగింది?. అమ్మ  ఒడి కింద రూ.15 వేలు ఇవ్వడం నరకాసుర పాలనా?. రైతులకు పెట్టుబడి సాయం చేయడం తప్పా?. ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులకు ఆర్థికసాయం చేయడం వల్ల నరకాసురుడయ్యారు. జగనన్న వసతి దీవెన, కంటి వెలుగు పేరుతో వైద్యం చేయిస్తే జగన్‌ నరకాసురుడు అయ్యారా?. పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే నరకాసురుడు అయ్యాడా?. లక్ష 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నరకాసురుడు అయ్యారా?. అందుకే చంద్రబాబుకు మేం చెబుతున్నాం. రేపు జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో రండి..చర్చిద్దాం. రోడ్డెక్కి సొంత మీడియా ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు. అవినీతిని నిర్మూలించవద్దా?. మద్యం రేట్లు పెరిగితే బాధపడిన ఏకైన నాయకుడు చంద్రబాబు  ఒక్కరే. ఎవరైనా పేదవాడి పొట్ట కొడుతారు. కానీ చంద్రబాబు మాత్రం తాగుబోతుల పొట్ట గొడుతారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. 
అమరావతిలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. అమరావతిని మహానగరంగా నిర్మించినట్లు మాట్లాడుతున్నాడు. జోలె కట్టి ప్రజల నుంచి డబ్బులు లాక్కున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఓడిపోయాక ప్రజల వద్ద వసూలు చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు స్వజన ఉద్యమం.ఆయన పార్టీ ఉనికి కోసం, ఆయనను నమ్ముకున్న వారి ఆస్తుల కోసం 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి నాలుగు గ్రామాల్లో ఉద్యమం నడుపుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు ఉన్నాయా?. మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు మేలు చేసే విధంగా నవరత్నాలు అమలు చేస్తూ బహుజన ఉద్యమంలా పాలన సాగిస్తుంటే..చంద్రబాబుకు కన్ను కుట్టి, మీ రాజకీయ పీఠాలు కదిలిపోతాయనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న సభలో సీఎంను పట్టుకొని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు.  వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా? ఉత్తరాంధ్రలోని విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలనుకోవడం తప్పా?, కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ పెట్టాలనుకోవడం తప్పా?. అమరావతిలో శాసన రాజధాని కొనసాగించాలనుకోవడం తప్పా?..సీఎం వైయస్‌ జగన్‌ చేసిన తప్పేంటి?. చంద్రబాబు ఓర్వలేక కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కారు. ఆయన తనయుడికి రాజకీయ భవిష్యత్‌ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది. వికేంద్రీకరణ జరిగి తీరుతుంది?. అమరావతిలో మహా నగరాన్ని నిర్మించే ఆర్థిక స్థోమత ఈ రాష్ట్రానికి లేదు. ఆ రోజు శాసన మండలిలో ఈ బిల్లును అడ్డుకొని, చైర్మన్‌ను ప్రభావితం చేసేలా గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని ఎలా వ్యవహరించారో చూశాం. సిట్‌ వేస్తే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు చేస్తే భయపడాలి..ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో అవినీతి జరిగితే వెలికి తీసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ట్రంప్‌ పర్యటనలో సీఎం వైయస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని చంద్రబాబు అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. వైయస్‌ జగన్‌కు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న కోరికలు ఏమీ లేవు. నిరంతరం ప్రజల్లో ఉండాలి..ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌కు కోరిక ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌కు ట్రంప్‌ ప్రక్కన కూర్చోనే స్థాయి ఉన్న వ్యక్తే..వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాలకు తీసుకెళ్లారు. ఇవాళ ట్రంప్‌ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచారు. ఇది చంద్రబాబుకు తప్పుగా కనిపించింది. చంద్రబాబును వైయస్‌ జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా?. ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు. వైయస్‌ జగన్‌ను ఓడిస్తానని రాష్ట్రమంతా తిరిగితే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. దేశమంతా చంద్రబాబు తిరిగి మోదీని ఓడిస్తానన్నారు. చంద్రబాబును జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూశాం.  ఇప్పుడేమో మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని అంటున్నాడు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి వలస పంపించారు. ఇదేం రాజకీయమో అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నాయకులు ఉంటారా అని ఆవేదనగా ఉంది. వైయస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు పుడుతుంది. యువకుడు 50 శాతం ఓట్లు సాధించడం ఏంటని భయపడుతున్నారు. ఇదే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు వణికిపోతున్నారు. తాజాగా వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వాలంటీర్‌ వ్యవస్థపై పడ్డారు. వాలంటీర్లు అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను కించపరిచినట్లు కాదా?.  ఇదే వాలంటీర్లుగా జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం సృహతో మాట్లాడాలి. 
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రయోగం దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రోజు కర్ణాటక, జార్ఖండ్‌ లాంటి రాష్ట్రాలు ఈ ఆలోచనలు చేస్తున్నాయి. దిశ చట్టం గురించి ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సమాచారం కోరుతున్నాయి. రైతు భరోసాపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. దేశమంతా వైయస్‌ జగన్‌ వైపు చూస్తోంది. ఇవన్నీ బయటకు కనిపించకూడదని వైయస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమాలు చంద్రబాబు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇవాళ రాజధాని రైతులకు వైయస్‌ జగన్‌ మేలు చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రెస్టేషన్‌ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. నరకాసుర పాలనపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మంత్రి కన్నబాబు చంద్రబాబుకు సవాలు విసిరారు. రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లు బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మరోసారి మీకు తగిన బుద్ధి చెబుతారని కన్నబాబు హెచ్చరించారు. 

 

Back to Top