సీఎం వైయస్‌ జగన్‌ దేశానికి రోల్‌మోడల్‌

2019 రైతు సంక్షేమ సంవత్సరం

మార్పు కోసం ఇచ్చిన తీర్పును పటిష్టంగా అమలు చేస్తున్నాం

రాజధానిలో అమరావతి ఉండదని ఎవరు చెప్పారు..?

బాబుకు 29 గ్రామాలు తప్ప.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవా..?

అమరావతిలో మాట్లాడే పవన్‌.. గాజువాకకు వెళ్లి మాట్లాడుతాడా..?

రియలెస్టేట్‌ వ్యాపారులకు మద్దతుగా చంద్రబాబు ఆందోళన

వికేంద్రీకరణ వద్దూ అని కర్నూలు, ఉత్తరాంధ్ర వెళ్లి మాట్లాడే ధైర్యం బాబుకు ఉందా?

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

 

కాకినాడ: మార్పు కోసం ప్రజలు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గౌరవిస్తూ పటిష్టంగా జనం కోసం అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 2019ని రైతు సంక్షేమ నామ సంవత్సరంగా భావించాలన్నారు. రైతుకు సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే వెనకడుగు వేసేది లేదని సీఎం చెప్పారని, రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విప్లవాత్మక పథకాలు, అవినీతి రహిత పాలన, సంస్కరణలు ఆరు నెలల పాలనలోనే సీఎం వైయస్‌ జగన్‌ రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లారంటే.. ‘కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని ఇచ్చి చరిత్ర సృష్టించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.40 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, వలంటీర్‌ వ్యవస్థతో పరిపాలనను గుమ్మం ముందుకు తీసుకువచ్చారు. పెన్షన్ల పెంపు నుంచి మొదలుకొని, 80 శాతం మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేశారంటే.. నిజమైన పరిపాలకుడు ఏ విధంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ చూపించారు. సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం ఒక చరిత్ర.

రైతు భరోసా పథకం విప్లవాత్మకమైన పథకం, దీంతో పాటు వడ్డీలేని రుణాలు, ఉచిత పంటల బీమా, ఉచితంగా బోర్లు వేయించడం,  రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్, ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో, జిల్లాస్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు క్వాలిటీవి విక్రయించే విధంగా ప్రభుత్వం విధానాలు తీసుకువస్తుంది. భూయజమాన్యానికి ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు హక్కు కల్పించాం. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.

రైతుభరోసా కేంద్రం పేరిట అగ్రి ఇన్‌పుట్‌ వర్క్‌షాపును ప్రారంభిస్తున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మూడు దశల్లో ఫిబ్రవరి నుంచి ప్రారంభించబోతున్నాం. ఫిబ్రవరి 1న 3300 కేంద్రాలను, మార్చి, ఏప్రిల్‌ నాటికి 11,500 కేంద్రాలను కూడా ఈ రాష్ట్రంలో పనిచేయించే కార్యక్రమం చేస్తాం. అదే కాకుండా రైతు భరోసాలో చివరి విడత జనవరి 2వ తేదీన రైతుల అకౌంట్లలో వేయాలని సీఎం ఆదేశించారు.
 
ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి విత్తనాలకు సంబంధించి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని విత్తనాలు కొనుగోలు చేసి సరఫరా చేయించాం. ఖరీఫ్, రబీలో విత్తనాల కొరత లేకుండా చేశాం. విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి గ్రామంలో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటి వరకు మండల, జిల్లా స్థాయిల్లో మాత్రమే కేంద్రాలను గుర్తించాం. వచ్చే ఖరీఫ్‌ నుంచి అన్ని కేంద్రాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటాం. రైతు భరోసా కేంద్రాలను పంట కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అగ్రికల్చర్‌ మార్కెట్‌ వ్యవస్థను సమూలంగా మార్చాలని చెప్పారు. అగ్రికల్చర్‌ మిషన్‌ ఏర్పాటు చేసి ప్రతి నెలా మీటింగ్‌ పెట్టి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు.

3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో శనగ రైతులకు మార్కెటింగ్‌ ఇంట్రవెన్షన్‌ కింద రూ.330 కోట్లు చెల్లింపు నిర్ణయం విప్లవాత్మకం. పామాయిల్‌ రైతులకు తెలంగాణతో సమానంగా ధర వచ్చేలా నిర్ణయం తీసుకొని రూ. 85 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. పెదవేగిలోని అయిల్‌ ఫాం ఫ్యాక్టరీని రైతు యాజమాన్యానికి అప్పగిస్తున్నాం. కాగితపు మిల్లు కర్రతోలిన రైతులకు బకాయి పడితే రూ.5.50 కోట్లు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. 2019 రైతు నామ సంవత్సరంగా, రైతు సంక్షేమ సంవత్సరంగా భావించాలి. రైతుకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

జగనన్న అమ్మ ఒడి జనవరి 9వ తేదీన ప్రారంభం కాబోతుంది. దాదాపు 49 లక్షల తల్లుల అకౌంట్లలో రూ.15 వేలు జమ చేయనున్నాం. మార్పు కోసం ఇచ్చిన తీర్పును పటిష్టంగా జనం కోసం అమలు చేస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా విజన్‌ 2020 అనేవాడు.. నిజమైన 2020 విజన్‌ ప్రజలు చూపించారు. 2020 వచ్చే సరికి చంద్రబాబు లేకుండా చేయడం ప్రజల విజన్‌. 1995 నుంచి అబద్దాలు, తప్పుడు ప్రచారాలు, భ్రమలు కల్పించి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా రాష్ట్రాన్ని తయారు చేశాడు. విజన్‌ 2020 నాటికి బ్రహ్మాండమైన రిజల్ట్‌ ఇచ్చారు.

ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా బురదజల్లాలి అని ప్రతిపక్షం భావిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు, వారి పాట్నర్‌షిప్‌ పార్టీలు అదే పనిమీద ఉన్నాయి. అప్పుడు ఇంగ్లిష్, ఇసుక, ఇప్పుడు రాజధాని అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకొని భజన బృందాలను వేసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. అమరావతిలో రాజధాని ఉండదని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారా..? అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది. శాసనసభ వ్యవహారాలు, అసెంబ్లీ వ్యవస్థ అమరావతిలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని పెద్ద డిమాండ్‌ స్టార్ట్‌ అయ్యింది. ఆ డిమాండ్‌ ప్రకారం జీఎన్‌రావు కమిటీ వేసి దేశంలో నిపుణులైన వారందరినీ దాంట్లో పెట్టి నివేదిక తెప్పించాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే నిర్ణయం తీసుకున్నట్లుగా.. అమరావతిని ఎడారిగా వదిలేసినట్లుగా చంద్రబాబు, ఆయన భజన బృందాలు ప్రచారం చేస్తున్నారు.

ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలి. పరిపాలన వికేంద్రకరణ జరగాలి. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఉంటుందని ప్రతిపాదన మొదలైంది. అమరావతిని ఎడారిగా చేసినట్లుగా చంద్రబాబు అండ్‌ కో ప్రచారం చేస్తున్నారు. 29 గ్రామాల ప్రజలను ఉద్యమాన్ని ప్రేరేపించి ఎదో జరుగుతున్నట్లుగా గందరగోళం చేస్తున్నారు. 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలే తప్ప.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవా..? వాళ్ల మీద తప్ప ప్రపంచంలో ఎవరి మీద ప్రేమ ఉండదు. అమరావతిలో నడిబొడ్డున ఏం మాట్లాడుతున్నారో.. అవే మాటలు విశాఖ, కర్నూలుకు వెళ్లి మాట్లాడుతారా..? అంత ధైర్యం మీకుందా..? ఏ పూటకు ఆ పూట నాలుక మడత వేస్తూ ఎంతకాలం ఈ విధంగా ప్రజలను మభ్యపెడతారు.

శ్రీకృష్ణ కమిటీని విభజన సమయంలో వేశారు. ఆ తరువాత శివరామకృష్ణన్‌ కమిటీ వేశారు. ఆ కమిటీలు రాజధాని రెండు చోట్ల ఉండాలని చెప్పాయి. జీఎన్‌రావు కమిటీ కూడా పాలన వికేంద్రీకరణ జరగాలని చెబుతుంది. జీఎన్‌రావు కమిటీ.. నారాయణ లాంటి కమిటీ కాదు. చంద్రబాబు వేసిన కమిటీ ఒకే చోట రాజధాని ఉండాలని నివేదిక ఇస్తే చూపించండి. మసిపూసి మారేడు కాయ చేసి కేవలం అక్కడున్న భూములు, ఆస్తులు పోతాయన్న కొంతమంది ఆందోళనను రాష్ట్ర ప్రజల బాధగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు. లక్షల్లో ఉన్న భూములను కోట్లకు తీసుకెళ్లి రియలెస్టేట్‌ దందా నడిపిస్తున్న వారికి మద్దతు ఇవ్వడం కాదా చంద్రబాబు ప్రయత్నం.
 
ఈ రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రకరణ జరగొద్దా.. కేవలం ఒకే చోట లక్షల కోట్లు పెట్టి మిగతా ప్రాంతాలను ఎడారిగా వదిలివేయాలా..? పవన్‌ కల్యాణ్, చంద్రబాబును చెప్పమనండి. చంద్రబాబు అమరావతిలో ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5700 కోట్లు. దాంట్లో 2500 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి, రూ.15 వందల కోట్లు కేంద్రం ఇస్తే.. మిగతాది అప్పు తీసుకువచ్చారు. ఆ అప్పుకు ప్రతి సంవత్సరం రూ.570 కోట్లు వడ్డీ కడుతున్నాం. లక్ష కోట్ల రూపాయల అప్పు ఇచ్చే వారు ఎవరు.. ఇస్తే కట్టేవారు ఎవరు.. ఎలా తీర్చాలి.. అంటే ఇలా దశలవారీగా డెవలప్‌ చేస్తే.. ఎన్నాళ్లకు హైదరాబాద్, బెంగళూరును తలదన్నేలా తయారవుతాం. విశాఖలాంటి నగరం ఉంటే అది త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని సీఎం ఆలోచన చేస్తున్నారు. పద్ధతి ప్రకారం మంచి చెడు చర్చ పెట్టిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టంగా చెప్పారు. అమరావతిలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్‌ గాజువాక వెళ్లి మాట్లాడుతారా..? పూటకు ఒక మాట మాట్లాడే అలవాటు జగన్‌కు లేదు. అనుకున్నది అనుకున్నట్లు నికార్సుగా చెబుతారని మంత్రి కన్నబాబు చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top