తాగునీటిపై మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి

ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేయాలి

జీవీఎంసీ అధికారులకు మంత్రి కన్నబాబు ఆదేశం

విశాఖ: విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారుతున్నందున భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తాగునీటిపై మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా అధికారులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, జీవీఎంసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పరిపాలనా రాజధానితో విశాఖలో జనాభా పెరుగుతారని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని, ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు నెరవేర్చారన్నారు. లక్షలాది పేదలకు పెద్దస్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం దేశంలోనే ఇదేప్రథమం అన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చాలా ప్రాధాన్యతగా తీసుకున్నారన్నారు. జూలై 8వ తేదీన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. 

ఒక్క‌సెంట్ కూడా క‌బ్జాకు గురికాకూడ‌దు
విశాఖలో భూములు కబ్జాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, విశాఖ సిటీలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని అధికారులను మంత్రి కన్నబాబు ఆదేశించారు. ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, ఒక్క సెంట్‌ భూమి కూడా కబ్జాకు గురికాకూడదని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల అక్రమాలపై సిట్‌ విచారణ జరుగుతోందన్నారు. 

పారిశ్రామికరంగం కూడా పెరిగే అవకాశం: ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్నందున తాగునీటి వనరులపై దృష్టిపెట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులకు సూచించారు. పరిపాలనా రాజధానితో పాటు పారిశ్రామికరంగం కూడా పెరిగే అవకాశం ఉన్నందున జీవీఎంసీ పరిధిలో 30 శాతం జనాభా పెరుగుతారన్నారు. రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటిపై మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు. 

ప్రభుత్వ ఆస్తిని ఎవరు దోచుకున్నా శిక్షార్హులే
గతంలో విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, ప్రభుత్వ ఆస్తిని ఎవరు దోచుకున్నా శిక్షార్హులేనని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూముల డాక్యుమెంట్లు ట్యాంపరింగ్‌ జరగకుండా చూడాలని, ఎవరైనా భూములు కబ్జా చేస్తే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. గతంలో ఈ–పాస్‌ పేరుతో రికార్డులను తారుమారు చేశారని, ఈ తరహా అక్రమాలకు చెక్‌ పెట్టాలని అధికారులకు సూచించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో న్యాయపరంగా కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. 

Back to Top