చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం

నిన్న కౌన్సిల్‌లో జరిగింది బ్లాక్‌ డే కాదు.. ఎల్లో డే

విచక్షణాధికారులు సభాధ్యక్షుడికే కాదు.. సభా నాయకుడికీ ఉంటాయి

మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోతే ఇంకా రెఫరెండం దేనికి?

బరితెగించి మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

 

అసెంబ్లీ: చంద్రబాబు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బరితెగించి సభలో, టీవీల్లో మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కన్నబాబు కోరారు. అసెంబ్లీలో కన్నబాబు ఏం మాట్లారంటే.. ‘మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు, కౌన్సిల్‌లో జరిగిన పరిస్థితులు చూసిన తరువాత కొన్ని విషయాలను చర్చించాలని అనుకుంటున్నా. ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో గొప్ప సంస్కరణకు సీఎం వైయస్‌ జగన్‌ తెరతీశారు. అధికారం, పరిపాలన వికేంద్రీకరణ జరిగే విధంగా కొన్ని కమిటీలు నియమించి వారు ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలని డిసైడ్‌ చేసి సభలో చర్చించి బిల్లు పాస్‌ చేసి కౌన్సిల్‌కు పంపించడం జరిగింది. చంద్రబాబు అనే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఏనాడో చేసుకున్న పాపం కూడా..
వ్యవస్థలను నిర్వీర్యం, విధానాలను ఖూనీ చేయడంలో, సంప్రదాయాలను తుంగలో తొక్కడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశ చరిత్రలోనే ఎవరూ ఉండరు. కేవలం కుట్ర, కుతంత్రంతో పూర్తిగా రాజకీయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. కౌన్సిల్‌లో నిన్న జరిగిన తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. మొన్న కౌన్సిల్‌కు బిల్లు వెళ్లినప్పుడు అవకాశం లేకపోయినా రూల్స్‌ అతిక్రమించి రూల్‌ 71 తీసుకువచ్చి దాని కోసం రోజంతా వృథా చేసి సాయంత్రానికి చర్చకు తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఒక హైడ్రామా క్రియేట్‌ చేశారు. కౌన్సిల్‌ చైర్మన్‌ ఎదురుగా గ్యాలరీలో చంద్రబాబు 4 గంటల పాటు ఒంటికాలుపై నిల్చున్నాడు. సభలో నేరుగా చైర్మన్‌ను ప్రభావితం చేయడానికి చంద్రబాబు పడిన తపన, వేధన కళ్లారా చూశాను.

చైర్మన్‌ పెద్ద హోదాలో ఉండి న్యాయమూర్తిగా వ్యవహరించాల్సిన చైర్మన్‌.. నేను తప్పు చేస్తున్నాను.. నాతో తప్పు చేయిస్తున్నారని అర్థం అయ్యే విధంగా చెప్పాడు. రూల్స్‌ ఒప్పుకోకపోయినా.. రూల్స్‌ ప్రకారం జరగలేకపోయినా నా విచక్షణాధికారం ఉపయోగించి సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్‌ చెప్పాడు. విచక్షణాధికారంపై చర్చ జరగాలి. చైర్మన్‌కు ఒక్కడికే ఆ అధికారం ఉంటుందా..? చైర్‌లో కూర్చున్నప్పుడు ఏ విధంగానైనా రూల్స్‌ను పక్కనబెట్టి నాకు విచక్షణాధికారం ఉందని, ఒక నిర్ణయాన్ని తీసుకొని తమకు ఉన్న సంఖ్యాబలంతో చప్పట్లు కొట్టిచ్చే కార్యక్రమం చేయొచ్చా అనేది చర్చ జరగాలి.

ఎస్టాబ్లిషుడ్‌ ప్రొసీజర్, రూల్స్‌ను అతిక్రమించేందుకు లేదు. అవేమీ లేనప్పుడు నీ విచక్షణాధికారం ఉంటుంది. వికేంద్రీకరణపై చర్చ జరిగేందుకు స్పష్టమైన రూల్స్‌ ఉన్నాయి. రూల్స్‌తో డిబేట్‌ జరిగినప్పుడు చైర్మన్‌ ఒక పార్టీ సొత్తు కాదు. దురదృష్టం ఏంటంటే గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మండలి చైర్మన్‌ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. కొత్త దుష్టసంప్రదాయానికి తెరతీశారు.

నారా లోకేష్‌ సభ లోపల కూర్చొని వీడియో తీస్తున్నాడు. గ్యాలరీలో తండ్రి, సభలో కొడుకు, వీరిద్దరికీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కుడిభుజంగా ఉన్న యనమల రామకృష్ణుడు. మొత్తం వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా వీళ్లంతా భాగస్వాములుగా మారి నిన్న చేసిన డ్రామాను పార్లమెంటరీ ప్రొసీజర్స్‌ చూసే వారికి సభ తెలియజేయాలని కోరుతున్నాను. ఇంత దారుణమైన కుట్ర, కుతంత్రాలకు సభ వేదిక కాకూడదు అంటే.. పార్లమెంటరీ ప్రొసీజర్స్‌లోనే మార్పులు తీసుకువచ్చేలా ఈ శాసనసభ తెలియజేయాలని కోరుతున్నాను. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నాయకులు ప్రవర్తిస్తే ఇంకా రూల్స్, బుక్స్‌ ఎందుకు..? మండలి చైర్మన్‌ గంబీరంగా మాట్లాడుతుంటే రాజీనామా చేస్తాడేమో.. తప్పు చేయడానికి ఇష్టం లేక అని అనుకున్నాం. కానీ వెంటనే ప్లేట్‌ ఫిరాయించారు. ఉదయం పచ్చ పేపర్లలో గొప్ప క్రియాశీలక కార్యకర్తగా మండలి చైర్మన్‌ నిరూపించుకున్నారని రాశారు. కార్యకర్తగా బయట పనిచేస్తే తప్పులేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అల్లా లాంటివాడని మండలి చైర్మన్‌ ప్రకటన చేశారు. రాజకీయంగా చంద్రబాబును ఏ దేవుడితో పోల్చినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అదే ప్రవర్తన చూపిస్తే.. పార్లమెంటరీ ప్రొసీజర్స్‌కు సంబంధించి అక్కడి కమిటీలకు రెఫర్‌ చేయాలని కోరుతున్నారు.

మంత్రులు అంతా తాగేసి వచ్చారని యనమల రామకృష్ణుడు అంటున్నాడు. ఇంకొకతను టీవీ డిబేట్‌లో కూర్చొని బ్రీత్‌ ఎనలైజర్స్‌ పెట్టాలని మాట్లాడుతున్నాడు. ఏంటి కండ్ల కావరమా..? ఆ బరితెగింపు ఏంటీ..? మిమ్మల్ని చూపించే చానల్స్‌ ఉంటే.. మీకోసం రాసే పత్రికలు ఉంటే ఇష్టం వచ్చినట్లుగా సభ్యుల గరించి మాట్లాడుతారా..? ఎవరైతే టీవీల్లో కూర్చొని శాసనసభ్యులను, మంత్రులను కించపరిచేలా మాట్లాడారో.. వారిని ప్రివిలైజ్‌ మోషన్‌ కింద సభకు పిలిచే అవకాశం ఉంటే చూడండి. కొత్త విధానాలను సభకు, దేశ దృష్టికి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. దమ్మున్న నాయకుడు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడూ చేయలేము. ప్రజల నుంచి ఎన్నికై వచ్చిన వారిని కించపరిస్తే ఎవరిని, ఏ వ్యవస్థను కించపరిచినట్లు. వ్యవస్థలను ఖూనీ చేసి బయట తప్పుడు ప్రచారాలు చేయడం సబబు కాదు.

సంఖ్యాబలం ఉందని చెప్పి బిల్లును నాలుగు రోజులు ఆపగలిగితే అది గొప్ప అన్నట్లుగా సంకలు గుద్దుకుంటున్నారు. గత ఐదేళ్లలో రాజ్యసభలో 22 బిల్లులు రద్దు అయిపోయాయి. ఎందుకంటే లోక్‌సభలో ఆమోదించి.. రాజ్యసభకు పంపిస్తే దాన్ని చర్చకు స్వీకరించకపోవడం వల్ల రద్దు అయిపోయాయి. సాక్షాత్తు చైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఈ పద్ధతులు కరెక్టు కాదు.. బిల్స్‌ను ఈ విధంగా చేయకూడదు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన సభ్యులు లోక్‌సభలో ఆమోదించి పంపించిన బిల్లులను ఎలా రద్దు చేస్తాం.. ఇది పద్ధతి కాదని మాట్లాడిన వీడియోలు చూశాను. రాజ్యసభలో కూడా బిల్లులు రద్దయ్యాయి. అంతమాత్రాన ఓడిపోయినట్లు.. విజయం సాధించినట్లుగా అక్కడ ప్రచారం జరగడం లేదు. తిమ్మిని బొమ్మిని చేసి చూపించడం గతంలో చదువుకున్నాం.. ఇప్పుడు  పచ్చ మీడియా వల్ల చూస్తున్నాం. చంద్రబాబును ఎంత మహానాయకుడిగా అయినా చిత్రీకరిస్తారు.

యనమల రామకృష్ణుడు నిన్న నీతులు, సుద్ధులు మాట్లాడాడు. యనమల గురించి చెప్పాలంటే ఎన్టీఆర్‌ వెన్నుపోటు గురించి మాట్లాడుతారు. అది యనమలకు ఉన్న చరిత్ర. రూల్స్‌ ఉన్నవే అతిక్రమించేందుకు అన్నట్లుగా యనమల మాట్లాడుతున్నారు. నిన్న ఒక వీడియో చూశాను.. బ్రహ్మాండంగా చేశారు.. బెజవాడ రౌడీయిజం చూపించారని చంద్రబాబు ఎమ్మెల్సీలతో చెబుతున్నాడు. బెజవాడ రౌడీయిజం వంగవీటి రంగా మర్డర్‌తోనే చంద్రబాబు రౌడీయిజం చూశాం. వికేంద్రీకరణ బిల్లు ఓడిపోతే సీఎం పదవి వస్తున్నట్లుగా చంద్రబాబు ఫీలవుతున్నారు. మాట్లాడితే అమరావతి మీద రెఫరెండం పెట్టండి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. కన్న కొడుకు మంగళగిరిలో పోటీ చేస్తే ఓడిపోయారు. ఇంకా రెఫరెండం అంటాడు.

పేకాటకు అలవాటు పడిన వ్యక్తి ఒక్కడే ఆడుకున్నట్లుగా చంద్రబాబు అన్ని పార్టీల రాజకీయం చేయాలని ఆయనే చేయాలని చూస్తాడు. సుజనా చౌదరి గ్యాంగ్‌ను తీసుకెళ్లి బీజేపీకి అంటించాడు. ఇంకోకాయనను తీసుకెళ్లి బీజేపీతో పొత్తుపెట్టించాడు. కమ్యూనిస్టులను అమరావతి ఉద్యమంలో కలిపాడు. చంద్రబాబుకు లొంగకుండా నీ సంగతి తేల్చుతాను సుమా అని ఎదురుపడిన ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. మోడీ కంటే సీనియర్‌ని మోడీ ఎవరు అంటాడు. మోడీని తీసుకొచ్చి మళ్లీ పొగుడుతాడు. మోడీ చంద్రబాబుకు ఇచ్చిన సర్టిఫికేట్‌ ఏంటంటే.. ఇది సన్‌రైజన్‌ సిటీ కాదు.. సన్‌(కొడుకు)రైజ్‌ సిటీ అని చెప్పాడు.

ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లు, ఇంగ్లిష్, వికేంద్రీకరణ మూడు బిల్లులు తీసుకువచ్చాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును ఆపగలిగారా..? పాసైంది. ఇంగ్లిష్‌ మీడియం బిల్లు ఈరోజు పాసైంది. వికేంద్రకరణ బిల్లు కూడా పాసవుతుంది. ఒక సభను కించపర్చడం మా ఉద్దేశం కాదు. మండలి అవసరమా అనే చర్చ మీడియాలో స్టార్ట్‌ అయ్యింది. 1983లో ఎన్టీఆర్‌ కౌన్సిల్‌ను రద్దు చేసినప్పుడు ప్రొసీడింగ్‌లను చదివాను. సభకు సమున్నత స్థానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. దాని పేరు పెద్దల సభ.. లోకేష్‌ లాంటి చిన్నవయస్సు ఉన్నవారు వస్తారు. అది దొడ్డిదారిన ఎంచుకుంటారు కాబట్టి. మండలి బిల్లుపై సూచనలు ఇవ్వాలి కానీ, రూల్స్‌ వెతుకుతున్నారు.

బ్లాక్‌ డే ఇది అంటున్నారు. బ్లాక్‌ డే అనుకోవడం లేదు.. ఎల్లో డేగా గుర్తించాలి. విచక్షణాధికారులు సభాధ్యక్షుడికే ఉంటే సభా నాయకుడికి కూడా ఉంటాయి. ఆ అధికారాలతో సీఎం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కౌన్సిల్‌ చైర్మన్‌పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. రూల్స్‌ ఉన్నప్పుడు కచ్చితంగా పాటించాలి. పాలించేలా చేయడం సభాపతి ధర్మం అని నమోదు కావాలి. విచక్షణాధికారం ఉందని గ్యాలరీలో కూర్చున్న నాయకుడి సైగలను ఫాలో అవుతామంటే ఎలా..? చంద్రబాబు సంగతి తెలియని వారు ఎవరూ లేరు.. మోడీని అవమానించి తరువాత కౌగిలించుకున్నాడు. కౌటింగ్, పోలింగ్‌ మధ్య 29 రాష్ట్రాలు తిరుగుతున్నానని చెప్పాడు.. కౌలింగ్‌ తరువాత 29 గ్రామాలకు పరిమితం అయిపోయాడు. 29 గ్రామాల ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారంటున్నారు. 29 దాటి 30వ గ్రామానికి వెళ్తే రాళ్లు చల్లుతారని మర్చిపోతున్నాడు. ఈ రాష్ట్రానికి అధికార, పరిపాలన వికేంద్రీకరణ శరణ్యం. అలా చేయడానికి ఎలాంటి మార్గాలు ఉంటే అలాంటి మార్గాలు తయారు చేయాలని పెద్దలను కోరుతున్నాను.

Back to Top