తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధాల ఫ్యాక్టరీ

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 

అసెంబ్లీ: తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతుంది. ఆ ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధం ప్రొడ్యూస్‌ చేసి జనం మీదకు వదులుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శాసనసభలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మంత్రుల బృందం ఉంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను టీడీపీ రోడ్డు మీద వదిలేసింది. ప్రభుత్వం తరుఫున ఒక దళారీని పెట్టి, ఆ దళారీకి ఎంప్లయీస్‌ను పెట్టుకునే అవకాశం గత ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం రూ.15 నుంచి 20 వేలు ఇస్తుంటే.. ఆ దళారీ ఉద్యోగికి రూ.6 వేలు ఇస్తున్నాడు. ఉద్యోగ భద్రత లేదు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లేదు.. ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితి నడుస్తున్నప్పుడు.. ఆ నియామకాలకు కూడా అవినీతి, అక్రమాలకు తెరతీసి ఇష్టం వచ్చిన వాళ్లను డబ్బులు తీసుకొని ఇచ్చే కార్యక్రమం టీడీపీ చేసింది. ఇవన్నీ పాదయాత్రలో సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చాయి. అందుకే ఇవాళ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారని మంత్రి కన్నబాబు వివరించారు.

Back to Top