గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు

గిరిజన ప్రాంతాల్లో నెలాఖరు వరకు రైతు భరోసాకు అవకాశం

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైయస్‌ జగన్‌ ఆలోచన

పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలు స్థిరంగా ఉండవు

టీడీపీ నేతలకు ఆస్తులు ఏమైపోతాయనే భయం పట్టుకుంది

మంత్రి కన్నబాబు

తాడేపల్లి: గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ఇన్‌పుట్‌ కేంద్రాలపై సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. కన్నబాబు మాట్లాడుతూ.. గిరిజనుల్లో ఎవరైనా రైతు భరోసా పథకం అందకుండా మిగిలిపోతే ఈ నెలాఖరులోగా గుర్తించేందుకు గడువు పెంచాలని సీఎం ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ఇన్‌ఫుట్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు అక్కడికి వచ్చి విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయవచ్చు. రైతులు కోరుకున్న ఎరువులు, విత్తనాలు 48 గంటల్లో అందజేస్తాం. గ్రామాల్లో నాలెడ్జ్‌ కేంద్రాలుగా మార్చాలని సీఎం వైయస్‌ జగన్ ఆదేశించారు.  ఇన్‌ఫుట్స్‌ను విక్రయించడంతో పాటు భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సీజన్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే పంపిణీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. విత్తనాలు అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. దశల వారిగా పంట ఉత్పత్తి కేంద్రాలుగా వీటిని మార్చే ఆలోచన ఉంది. బయో కెమికల్స్‌ పరీక్ష లేకుండా రైతులకు అందడానికి వీల్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అమ్మే వాటికి ఎంవోయూ ఉంటుంది. పశుదానాను కూడా రైతులకు అందజేసే అవకాశాలు కల్పిస్తున్నాం. నాలెడ్జ్‌ సెంటర్లో డిజిటల్‌ లైబ్రరీ ఉంటుంది. రైతుల విజయగాథలు ఉంటాయి. రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించే ఏర్పాటు చేస్తున్నాం. అక్వా ఫీడ్‌కు నాణ్యత పరీక్షలు లేవు. దాని కోసం త్వరలోనే నాణ్యత పరీక్షలు చేసేందుకు ఒక చట్టం చేసేలా సీఎం ఆదేశించారు. అగ్రి ఇన్‌ఫుట్‌, అగ్రి వర్క్‌ షాపుల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కల్పించాల్సి ఉంది. పంటల భీమా, పశు బీమా నమోదును ఈ కేంద్రాల్లోకి తీసుకువస్తాం. వీటితో పాటు గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, యానిమల్‌ హస్బండరీ అసిసెంట్‌ ఇక్కడే ఉండి సేవలందిస్తారు. రైతులకు అన్ని అందుబాటులో ఉండేలా వీటిని సమీకృత కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నాం. వీటికి సంబంధించి ప్రోక్యూర్‌మెంట్‌కు సంబంధించి సీఎం ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్‌లో ఎంత ధర ఉందో ఈ సెంటర్లో ఏర్పాటు చేస్తాం. రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్ర వ్యవసాయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. 

వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి?
రాజధాని విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ చాలా స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పారు. రాజధానికి అంత డబ్బు ఖర్చు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. వికేంద్రీకరణ జరగాలని సీఎం మాట్లాడారు. టీడీపీ నేతలకు రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందన్న భయంతో ఏదో  ఒకటి మాట్లాడుతున్నారు. 13 జిల్లాల్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు అయినా ఐదేళ్లలో చంద్రబాబు తీసుకువచ్చారా? వాటిని సరిదిద్దేక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ అర్ధవంతమైన అడుగులు వేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో కర్నూలులో ఏం మాట్లాడారో అందరికి తెలుసు. నా మనసుకు కర్నూలే రాజధాని అన్నారు. మనసుకు ఒకటి, మనిషికి ఒకటి రాజధాని ఉంటాయా? పవన్‌ చేస్తే ఒప్పు..మేం చేస్తే తప్పా? నాయకుడికి స్థిరమైన అభిప్రాయం ఉండాలి. లక్ష కోట్లు తీసుకొచ్చి ఒక చోట మహా నగరాన్ని ఎలా కడతారు. ప్రగల్భాలు పలకడానికి వైయస్‌ జగన్‌ సంసిద్ధంగా లేరు. వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? ఇవాళ చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైయస్‌ జగన్‌ ఆలోచన. ప్రజాభిప్రాయం మేరకు, కమిటీ సిపార్స్‌ల మేరకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారు. వైజాగ్‌లో టీడీపీ నేతలకే విలువైన భూములు ఉన్నాయి. 
 

తాజా ఫోటోలు

Back to Top