నెల్లూరు: ఏ గ్రామానికైనా వెళ్దాం.. ఎవరి హయాంలో లబ్ధి జరిగిందో ప్రజలను అడుగుదాం.. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు, అచ్చెన్నకు చీమూ, నెత్తురు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. నెల్లూరులోని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలకు ప్రతిరూపం చంద్రబాబు అని అన్నారు. బాబు జీవితమంతా అబద్ధాలమయమేనని, మేనిఫెస్టోను మాయం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. మంత్రి కాకాణి ఏం మాట్లాడారంటే.. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందనివారిని గుర్తించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. జూలై 1వ తేదీ రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నీతిమాలిన వ్యక్తి, అబద్ధాల కోరు అని చెప్పడానికి ఆయన నిన్న చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలు మచ్చుకు ఒక ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల ఎదగడానికి హైదరాబాద్‌లో టీడీపీ స్థాపించిన మైక్రోసాఫ్ట్ కారణమని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. సత్య నాదెళ్ల 1984–88 మధ్య బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1988లో ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత అమెరికా వెళ్లారు. 1990 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. సన్ మైక్రో సిస్టమ్‌లో చేరారు. 1992లో సన్ మైక్రో సిస్టమ్ నుంచి మైక్రోసాఫ్ట్‌లో చేరారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరేనాటికి చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కూడా పొడవలేదు. వెన్నుపోటు పొడవకముందే, ముఖ్యమంత్రి కాకముందే.. 1992లో మైక్రోసాఫ్ట్ చేరిన సత్యనాదెళ్లను హైదరాబాద్‌లో 1999లో ప్రారంభించి 2004లో ఓపెన్ చేసిన మైక్రోసాఫ్ట్‌లో పనిచేయబట్టి సీఈవోగా ఎదగాడని నోరుతెరిస్తే అబద్ధాల కంపుకొట్టే నోటితో మాట్లాడుతున్నావంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..? చంద్రబాబు నోరు తెరిస్తే.. ప్రతి ఒక్కటీ నా గొప్ప, నేను లేకపోతే ఏదీ లేదని మాట్లాడే పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. నిలువెత్తు అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు. ఇంత నీతిమాలిన, నీచమైన అబద్ధాలు ఎన్నో చెప్పాడు. నేషనల్ హైవే కాన్సెప్టుకు నేనే కారణమని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. చంద్రబాబుకు మతిభ్రమించిందని అనేకమంది వైద్యులు అంటున్నారు. చంద్రబాబు మాట్లాడే ‘బ్రీఫ్డ్ మీ’ ఇంగ్లిష్‌కు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు వస్తాయా..? మన పిల్లలకు ఇంగ్లిష్ రావాలి.. బాగా మాట్లాడాలనే తపన, తాపత్రయం సీఎం వైయస్ జగన్‌కు ఉంది. పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించడం తప్పు అన్నట్టుగా మాట్లాడే నీచ స్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. నిసిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధం చెప్పడానికి వెనకాడని వ్యక్తి చంద్రబాబు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చార్జ్‌షీట్ వేయడానికి టీడీపీ నేతలకు ఏ అర్హత ఉంది..? టీడీపీలాగా మేనిఫెస్టోను మేము దాచిపెట్టలేదు, మీలా హామీలు, యాడ్స్‌ను యూట్యూబ్ నుంచి తొలగించేలేదు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధైర్యంగా చేతుల్లో పట్టుకొని ఇంటింటికీ వెళ్తున్నాం. అర్హత కలిగిన కుటుంబానికి ఏయే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వివరిస్తున్నాం.. సాంకేతిక కారణాలతో అర్హులెవరైనా మిగిలిపోతే వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని కొత్త నిర్వచనం చెప్పిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించిన నీచ చరిత్ర చంద్రబాబుది. 650 వాగ్దానాల్లో 10 శాతం కూడా అమలు చేయలేని సిగ్గుమాలిన వ్యక్తి చంద్రబాబు. నవరత్నాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాం. దొంగ హామీలతో ఓట్లు వేయించుకొని నమ్మిన ప్రజలను వంచించడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచిన చరిత్ర టీడీపీకి ఉందా..? చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు సవాల్ విసురుతున్నా.. మీకు సంబంధించిన నియోజకవర్గాల్లో మీరు కోరుకున్న గ్రామానికి వెళ్దాం.. చంద్రబాబు గెలిచిన కుప్పం అయినా, అచ్చెన్నాయుడు గెలిచిన టెక్కలికైనా వెళ్దాం.. మీకు అనుకూలంగా ఉండే గ్రామానికి వెళ్లి అన్ని వర్గాల దగ్గరకు వెళ్దాం.. ప్రతి ఇల్లు తిరుగుదాం.. చంద్రబాబు హయాంలో మీకు జరిగిన లబ్ధి ఏంటీ..? వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన లబ్ధి ఏంటని ఆ గ్రామంలో తిరిగితే చంద్రబాబు, అచ్చెన్న ముఖాల్లో జనాలు ఉమ్మేస్తారు. రూ.2.23 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తే.. నవరత్నాలు అమలు లేదని చెప్పడానికి చంద్రబాబుకు నోరెలా వస్తుంది. హద్దు మించి పచ్చి అబద్ధాలు మాట్లాడే స్థాయికి దిగజారారు. నాలుగేళ్లలో ప్రజలకు మేలు గురించి అసెంబ్లీలో చర్చిద్దాం.. వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా..? చంద్రబాబు, అచ్చెన్నకు చీము, నెత్తురు ఉంటే నా సవాల్‌ను స్వీకరించండి. మీరు కోరుకున్న గ్రామానికి వెళ్దాం.. జరిగిన మంచిని అడిగి తెలుసుకుందాం.. సవాల్‌కు సిద్ధమా’’ అని మంత్రి కాకాణి ప్రశ్నించారు.