నెల్లూరు: అర్హత గల కుటుంబాలకు సంక్షేమ అందించడమే వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా నాలుగు సంవత్సరాల పాలన కొనసాగిందని వ్యవసాయ శాఖ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త, దిబ్బమీద ప్రాంతాల్లో పర్యటించారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగిన మంచిని ఇంటింటికీ వెళ్లి వివరించారు. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న అవినీతి, వివక్ష రహిత పాలన గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందాయో తెలుసుకొని, ఏదైనా సాంకేతిక కారణాలతో అందకపోతే అందించడమే అజెండాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి కాకాణి చెప్పారు. గ్రామాల్లో పర్యటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.