ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు

ఇళ్ల స్థలాలపై కోర్టుమెట్లెక్కిన బాబు పేదలను ధనికులుగా మారుస్తాడా..?

మంత్రాలేంటి బాబూ..? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..?

ప్రజలకు మంచిచేయాలంటే కావాల్సింది విలువలు, విశ్వసనీయత, చిత్తశుద్ధి

పేదల కోసం ధైర్యంగా నిలబడే మనస్తత్వం సీఎం వైయస్‌ జగన్‌ సొంతం

పనికిమాలిన వాగుడు తప్పు.. సవాళ్లను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు లేదు

నీ కొడుకు పప్పులా దొడ్డిదారిన మేం మంత్రులం కాలేదు

తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లుదండాలు పెట్టినా లోకేష్‌ ఎమ్మెల్యేగా గెలవలేడు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్‌

తాడేపల్లి: ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు మాయమాటలు నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కడుపుమంటతో కోర్టుమెట్లెక్కిన చంద్రబాబు పేదలను ధనికులుగా మారుస్తాడా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. రాజకీయాలపై అవగాహన లేని కొంతమంది ఐ–టీడీపీ బ్యాచ్‌తో మీటింగ్‌ పెట్టి సెల్‌ఫోన్‌ కనిపెట్టాను అని చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటున్నాడని, చంద్రబాబు చెప్పినదాంట్లో ఒక్కటైనా నిజం ఉందా..? అని ఆ మీటింగ్‌లో పాల్గొన్న యువకులను మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. 

2014లో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు, ఏడాదికి 12 సిలిండర్లు అన్నాడు, రూ.14,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణాలు మాఫీ అన్నాడు, హైస్కూల్‌ విద్యార్థులకు సైకిళ్లు ఇస్తానన్నాడు.. వీటిల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశాడా..? బెల్ట్‌షాపులు ఎత్తేస్తానని మొదటి సంతకం పెట్టి రాష్ట్రంలోని ప్రతి ఇంటిముందు మద్యాన్ని ఏరులై పారించిన నీచపు చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మంత్రి జోగి రమేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
పీ3, పీ4, పీ5 మంత్రం అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబూ..? పూర్‌ టు రిచ్‌ అని మాయమాటలు చెబుతున్నాడు. నువ్వు పేదలను ధనికులుగా చేస్తావా..? ఎవడైనా నిన్ను నమ్ముతాడా..? అధికారంలో ఉన్నప్పుడు పేదలను పట్టి పీడించాడు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కడుపుమంటతో జెలిసిల్‌ సిరప్‌ తాగాడు. పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే ఓర్వలేక కోర్టులకు ఎక్కాడు.. పేదలకు మంచి జరుగుతుంటే తట్టుకోలేక గిలగిలా కొట్టుకున్న చంద్రబాబు.. పేదలను ధనికులుగా మారుస్తాడా..? 

మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎందాకైనా పోరాడే శక్తి కావాలి.. అది సీఎం వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. మనసుపెట్టి ప్రజల బాధ, ఆవేదనలను గమనించి, వాటిని తీర్చడానికి వెన్నువిరిగి మీదపడినా పేదలపక్షాన నిలబడే మనస్తత్వం వైయస్‌ జగన్‌ సొంతం. కాబట్టే సుప్రీం కోర్టు వరకూ వెళ్లి సాధించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఏడ్చిన చంద్రబాబు.. పెత్తందార్ల పక్షాన పోరాడాడు. సీఎం వైయస్‌ జగన్‌ పేదల పక్షాన నిలబడిపోరాడారు. సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 

2014లో కేంద్రంలోని ఏన్డీయే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండి ఏమీ చేయలేని చవట దద్దమ్మ చంద్రబాబు భోగాపురం గురించి మాట్లాడుతున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అది దమ్మున్న లీడర్‌ వైయస్‌ జగన్‌ నాయకత్వం. 

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో కనీసం ఒక్క అడుగు నిర్మాణం జరగలేదు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అది మనసున్న లీడర్‌ పాలన అంటే. పోలవరం డబ్బును దోచుకున్న నీచుడు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాడు.

ఎన్టీఆర్‌ పేరు ఒక మంత్రం అని చంద్రబాబు అంటున్నాడు. బతికున్నప్పుడు కుర్చీ కోసం వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు మంత్రం అంటూ మాయమాటలు చెబుతున్నాడు. చంద్రబాబు డ్రెస్‌ మార్చుకొని బాబా వేషం వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతాడు. ప్రజలకు మంచి చేయాలంటే విలువలు, విశ్వసనీయత, చిత్తశుద్ధి ఉండాలి కానీ, పీ3, పీ4, పీ5 మంత్రాలు ఏంటీ..? 

చంద్రబాబు కొడుకు లోకేష్‌లా దొడ్డిదారిన మేము మంత్రులం కాలేదు. ప్రజల విశ్వాసం, అభిమానాన్ని పొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం. సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో మంత్రులమయ్యాం. దొడ్డిదారిన అడ్డగాడిదలా లోకేష్‌లా మంత్రులం కాలేదు. చంద్రబాబు కుటుంబం దొడ్డిదారి కుటుంబం. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను 10 ఇళ్లు కూడా కట్టలేనని చంద్రబాబు మాట్లాడాడు. చంద్రబాబు వస్తే చూపిస్తా.. ఎన్ని గృహాలు నిర్మాణంలో ఉన్నాయో.. వాగడం తప్ప సవాల్‌ను స్వీకరించడం, చర్చకు వచ్చే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేదు. తలకిందులుగా తపస్సు చేసినా, పాదయాత్ర అంటూ పాక్కుంటూ పొర్లుదండాలు పెట్టినా లోకేష్‌ని  ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గెలిపించలేడు. ఎమ్మెల్యే అయ్యే అర్హత చంద్రబాబు కొడుకు పప్పుకు లేనేలేదు’’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.  
 

Back to Top