విశాఖపట్నం: వైజాగ్ మీకు ఏం అన్యాయం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. శాఖలకు నగరంలో భవనాల కేటాయింపును అందులో వివరించారు. దీనిపై ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈ ప్రాంత ప్రజలందరి తరపున సీఎం వైయస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే దీనిపై ఎల్లో మీడియా మాత్రం నిన్నటి నుంచి విషం కక్కుతోంది. ఉత్తరాంధ్ర అసలు ఈ రాష్ట్రంలో లేనట్లు, ఈ ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతోందని ధ్వజమెత్తారు. విశాఖపట్నం సర్క్యూట్‌హౌజ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టుగా వచ్చి పోతున్న చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు కానీ, దత్తపుత్రుడు కానీ.. టీడీపీ అనుకూల మీడియా కానీ.. అందరూ ఈ ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాలు ఎలా తరలిస్తారని బాధ పడుతున్నారు. ఈ ప్రాంతంపై కోపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు తప్ప, ఈ నాలుగున్నర ఏళ్లలో ఏనాడైనా 50 రోజులు రాష్ట్రంలో ఉన్నారా? అదే కదా మీ భయం?: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ కేవలం గెస్టుగానే ఉన్నారు తప్ప, ఏనాడూ ఈ ప్రాంతాన్ని ఓన్ చేసుకోలేదు. ఆయన సొంత ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఓడిపోయిన తర్వాత మొత్తం ఆయన అక్కడే ఉంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ ఒప్పుకోవడం లేదు. కేవలం గ్రాఫిక్స్‌లో చూపిన అమరావతి నుంచే పరిపాలన సాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు తరలిస్తే, అమరావతిలో తమ భూములకు విలువ పడిపోతుందని చంద్రబాబు భయం. ఆందోళన. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతామని భయం. అదే వారిలో బాధ. అదే కనిపిస్తోంది. ఇక్కడి వారు మిమ్మల్ని క్షమించరు: ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని కానీ, బాగా వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర కూడా బాగు పడుతుందని కానీ, శక్తివంతమైన నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందని కనీస ఆలోచన చేయడం లేదు. ఇది బాధాకరం. విశాఖ పేరు ఎత్తినా, అక్కడి నుంచి పరిపాలన చేస్తామని చెప్పినా సరే.. ఈ ప్రాంతంపై చంద్రబాబు, ఆయన కుమారుడు ఈ ప్రాంతంపై విషం కక్కుతున్నారు. చివరకు ఇదే ప్రాంతానికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం సరికాదు. దీన్ని ఇక్కడి ప్రజలు క్షమించరు. సీఎంగారి నిర్ణయం ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా వారు వ్యతిరేకించడం ఏ మాత్రం సరికాదు. నిజానికి ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడి ప్రజలంతా ఆమోదిస్తున్నారు. అయినా ఇక్కడ విశాఖలో కార్యాలయాలు ఎలా పెడతారని ప్రధాన విపక్షం ప్రశ్నిస్తోంది. ప్రశ్నించే హక్కు మీకు లేదు: మీ మాదిరిగా జగన్‌గారు, హైదరాబాద్‌లో ఉండడం లేదు కదా? రాష్ట్రంలోనే ఉంటున్నారు. విజయవాడ నుంచి విశాఖ వస్తామని చెబుతున్నారు. కాబట్టి ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. సీఎంగారు ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. దీన్ని అందరూ గుర్తించాలి. కాబట్టి ఎల్లో మీడియాలో దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. నిజానికి ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు విశాఖ సెంటర్. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో విశాఖకు గుర్తింపు ఉంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైయస్సార్‌గారు విశాఖను ఎంతో అభివృద్ధి చేశారు. అవి ప్రభుత్వ భవనాలు..తప్పేమిటి?: నగరంలోని మిలేనియం టవర్స్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తే, అక్కడ ఐటీ పరిశ్రమలు రావని రాయడం దారుణం. అది 2 లక్షల చదరపు అడుగుల్లో కట్టిన భవనం. అది ప్రభుత్వానిది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పెడితే తప్పేమిటి? ప్రభుత్వ నిర్ణయం వల్ల, విశాఖకు ఐటీ పరిశ్రమలు రావా? ఏమిటా రాతలు? విశాఖ మీకు ఏం అన్యాయం చేసింది? ఎందుకా విమర్శలు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. మీరు మాత్రం అదే పనిగా విషం చిమ్ముతున్నారు. వాటిని మేనిఫెస్టోలో పెట్టగలరా?: ప్రజలకు మరింత చేరువలో సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. దానికి అనుగుణంగా అధికారులు పెరిగారు. దీని వల్ల ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. మరి వాటిని మీరు తప్పు పడితే, వచ్చే ఎన్నికల్లో అదే విషయం చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే, గ్రామ, వార్డు సచివాలయాలు తొలగిస్తామని, మళ్లీ 13 జిల్లాలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించండి. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించండి. 72 గంటల్లోనే ఆదుకున్నాం: ఎక్కడ, ఏం జరిగినా వేగంగా స్పందిస్తున్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు తగలబడితే.. మూడు రోజుల్లోనే చొరవ చూపి దాదాపు రూ.7.5 కోట్లు ఇచ్చాం. దాదాపు 49 మంది పడవల యజమానులు, వాటిపై ఆధారపడిన మరో 450 మందికి కూడా ఆర్థిక సాయం చేశాం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హుద్‌హుద్, తిత్లీ తుపానుల్లో నష్టపోయిన బోటు యజమానులకు ఏ మాత్రం చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయానికి, న్యాయం చేయాలని అనుకుంటున్నాం. దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ విధంగా మేము వేగంగా స్పందించి, ఒక నష్టం జరిగితే, కేవలం 72 గంటల్లోనే 80 శాతం ఆర్థిక సాయం చేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మత్స్యకారులకు అండగా నిలబడి, వారు ఊహించిన దాని కంటే ఎక్కువే సీఎంగారు ఇచ్చారు. మత్స్యకారులకు భరోసా. అండ: ఇవాళ దత్తపుత్రుడు వస్తున్నాడు. ఆయన రూ. 50 వేలు ఇస్తాడట. మళ్లీ టీడీపీ వారొచ్చి లక్ష ఇస్తారట. నిజానికి బోట్లు తగలబడితే పూర్తిస్థాయిలో మత్స్యకారులకు అండగా నిలబడిన సీఎంగారు, వారు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఇచ్చారు. మరోవైపు నిన్నటి వరకు తెలంగాణలో ఇక్కడి వారిని, రాష్ట్రాన్ని తిట్టిన వ్యక్తి, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడో తెలియదు. ఏదేమైనా సీఎంగారు రాష్ట్రంలోని మత్స్యకారులను పూర్తి భరోసా ఇచ్చారు. వారిని ఆదుకున్నారు. వారికి మనోధైర్యం ఇచ్చారు. ఇందుకు సీఎంగారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.