విశాఖపట్నం: చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడో.. ఆయన అనుసరించిన అవినీతి మార్గాలేంటనేది ఐటీ శాఖ నోటీసుల ద్వారా బయటపడింది. వాటిపై చంద్రబాబు ఇచ్చిన సమాధానాల్ని కూడా ఐటీ శాఖ రిజెక్ట్ చేసిన సంగతి ఈరోజు హిందూస్థాన్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. మరి, ఇదే చంద్రబాబు అవినీతిపై గతంలో ఏం మాట్లాడాడు.? నేను సత్యహరిశ్చంద్రుడ్ని. అవినీతి అంటేనే నాకు తెలియదు. అవినీతి డబ్బంటే ఏంటో కూడా తెలియదంటూ చిలుకపలుకులు పలికాడు. ఇప్పుడు ఐటీశాఖ అధికారులేమో చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని తేల్చేశారని చెప్పారు. శుక్రవారం విశాఖపట్నం, సర్క్యూట్‌హౌజ్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. బాబు అండ్ కో స్పందించరేం?: ఏదైనా చిన్న విమర్శ చేస్తేనే దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక నానా యాగీ చేసే టీడీపీ నేతలు ఇప్పుడెందుకు మౌనం దాల్చారు? చంద్రబాబు పాపం పండింది. ప్రజల సొమ్మును భారీస్థాయిలో దోపిడీ చేసి ఆస్తుల్ని పెంచుకుని ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? హిందూస్థాన్ టైమ్స్ కథనం అబద్ధం. మాకేమీ ఐటీ నోటీసులు రాలేదు. వాటికి మేము సమాధానాలిస్తే ఐటీ రిజెక్టు చేయలేదని చంద్రబాబు కానీ, ఆయన కొడుకు లోకేశ్ కానీ బయటకొచ్చి సమాధానం చెప్పాలి కదా? అసలు, ఈ విషయంపై ఇప్పటివరకు వారు ఎందుకు స్పందించలేదు?. ఆ కథనంపై దావా వేసే దమ్ముందా?: చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమీ అనకపోయినా.. నా భార్యను అవమానించారంటూ బాధపడ్డ సందర్భం చూశాం. అప్పుడే తన తల్లిని రాజకీయాలకు వాడుకుంటూ.. ఎవరో నీచంగా తూలనాడారంటూ లోకేశ్ కూడా కేసులు పెట్టడం.. కోర్టుల్లో దావాలేయడం జరిగింది. మరి, ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై రాసిన హిందూస్థాన్ టైమ్స్ కథనం మీద వారు ఏమైనా కేసులు పెడతారా..? ఆ కధనంపై కోర్టులో దావా వేసే దమ్మూ ధైర్యం చంద్రబాబు, లోకేశ్‌కు ఉన్నాయా?. ఆనాడే ఆధారాలతో సహా చెప్పాం: చంద్రబాబు అవినీతి గురించి గతంలోనూ అనేక జాతీయ మీడియా పత్రికలు రాశాయి. ప్రస్తుతం ఐటీ శాఖ దేనిమీదనైతే నోటీసులిచ్చిందో.. అదే సబ్జెక్టుపై నేను శాసనసభ సాక్షిగా దాదాపు 45 నిముషాలు మాట్లాడాను. ఆయన తన సహాయకుల్ని అడ్డం పెట్టుకుని బోగస్ కంపెనీలకు అవినీతి డబ్బును ఎలా తరలించారనేది ఆధారాలతో సహా నిరూపించే విధంగా సుదీర్ఘంగా వివరించి ప్రజలకు తెలియపర్చాం. ఆ రోజుల్లో మేం ఏం మాట్లాడినా.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తిప్పికొట్టే కార్యక్రమాలు చేశాడు. అలాంటిది, ఈరోజు హిందూస్థాన్ టైమ్స్ దాన్నే తేటతెల్లం చేసింది. దీనిపై బాబు అండ్ కో.. ఏం సమాధానం చెబుతారు..? రాష్ట్ర సంపద పిండి లక్షల కోట్లు కూడబెట్టి!: అవినీతికి ప్యాంటు, షర్టు వేస్తే అది చంద్రబాబు అని చెప్పాలి. రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబుకు లక్షల కోట్లు ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? రాజధాని పేరిట పోగేసిన సొమ్మెంత..? కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లుగా తీసుకున్న సొమ్మెంత?. వీటన్నింటిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలి. గతంలో ఏటా సెప్టెంబర్ 2న నా ఆస్తులు ఇవి అంటూ చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పేవారు. మరి ఇప్పుడెందుకు అలాంటి ప్రెస్‌మీట్‌లు పెట్టడం లేదు? ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయనా? హెరిటేజ్ పాలు అమ్మి.. పాలు పిండి ఇన్ని లక్షల ఆస్తులు సంపాదించాను అనైనా చంద్రబాబు చెప్పాలి కదా..? అలా చెబితే, అందరూ పాలుపిండి లక్షల కోట్లు సంపాదించుకునేవారు కదా..? నిజమేంటో.. ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రబాబు ఈ రాష్ట్ర సంపదను పిండుకునే లక్షల కోట్లు ఆస్తుల్ని సంపాదించాడని అందరికీ అర్ధమైంది. బాబు అవినీతిపై ఆనాడే ప్రెస్ రిలీజ్: చంద్రబాబు అవినీతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ), 2020, ఫిబ్రవరి 13న ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. అందులో ఏముందంటే.. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా పని చేసిన వారి ఇళ్లలో ఐటీ శాఖ చేసిన సోదాల్లో లెక్కల్లో చూపని దాదాపు రూ. 2 వేల కోట్ల సొమ్ము వివిధ రూపాల్లో తాము గుర్తించామని చెప్పింది. ఆ తర్వాత కొనసాగింపుగా చంద్రబాబుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల్లోనూ ఆ వివరాల్ని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఒక బడా కాంట్రాక్టర్ సంస్థకు చెందిన వ్యక్తి ^è ంద్రబాబు దగ్గరకొచ్చినప్పుడు తన పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి వెళ్లాలని ఆయన ఆదేశించిన సంగతి కూడా ఐటీ శాఖ బయట పెట్టింది. అంతే కాకుండా, ఆ పర్సనల్ సెక్రటరీ సదరు కాంట్రాక్టు సంస్థ మనిషితో ఏఏ డొల్ల కంపెనీలకు డబ్బును బదిలీ చేయమని చెప్పింది.. ఇతర దేశాల్లోనూ నగదు మార్పిడులు చేయించింది.. ఇలా పలు కీలక విషయాలన్నింటినీ ఐటీ శాఖ గుర్తించింది. ఇవే అంశాల్ని నేను కూడా అన్ని అధారాలతోనూ శాసనసభలో బయటపెట్టడం జరిగింది. పాపం పండింది కాబట్టే చిక్కాడు: ఊరూరు తిరుగుతూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తూ నోరు పారేసుకుంటున్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు?. గతంలో అనేక కేసులపై స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడేం చేయగలడు?. ఎందుకంటే, అవినీతి చక్రవర్తి తానేనంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఐటీ శాఖ సోదాల్లో ఆయన పర్సనల్ సెక్రటరీ నిజాలన్నీ వెళ్లగక్కాడు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండింది. తన అవినీతి సామ్రాజ్యం, తాను చేసిన పాపాలు, ఘోరాలన్నింటికీ తగిన మూల్యం చెల్లించే చివరి అంకం వచ్చిందని చంద్రబాబు గమనించాలి. ఢిల్లీ పెద్దల ప్రాపకానికి పడిగాపులు: చంద్రబాబు శేష జీవితం జైల్లో గడపాల్సి వస్తుందనే భయంతో ఈమధ్య ఢిల్లీకి తరచూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని సార్లు ఢిల్లీకి Ðð ళ్లని ఆయన ఇప్పుడెందుకు పదేపదే ప్రయాణాలు చేసి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఎందుకంటే, తన అవినీతి కుంభకోణాలకు సంబంధించి కేసుల్ని మాఫీ చేసుకోవడానికి ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కడానికి వెళ్తున్నారు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన ఘనుడైన అతడు.. మమ్మల్ని నిందిస్తూ నీతులు మాట్లాడుతున్నాడు..? మరి, ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకహోదాను అడుగుతున్నావా..? నీ కేసుల గురించి మాట్లాడుతున్నావా..? బీజేపీతో కలిసి మేము పోటీ చేస్తున్నాం. బీజేపీ పది, పాతిక సీట్లు ఇస్తున్నామంటూ పని గట్టుకుని బాబు లీకులిస్తున్నాడు. ఏం చేసినా.. నీ పాపం పండింది కనుక అవినీతి కేసుల నుంచి నిన్ను కాపాడేవారెవ్వరూ లేరనే సంగతి చంద్రబాబు గుర్తించాలి. బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు: అవినీతి, అక్రమాల ద్వారా లక్షల కోట్లు పోగేసుకున్న చంద్రబాబు మరలా ప్రజల్ని ఏదో ఉద్దరిస్తానంటూ రేపట్నుంచి ఏదో భవిష్యత్తుకు గ్యారెంటీ అని తిరుగుతాడంట. ప్రస్తుతమున్న కేసుల పరిస్థితికి బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ కనిపించడంలేదు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసి ఏవేవో హామీలిచ్చారు. మరి అధికారంలోకొచ్చాక వాటిని నెరవేర్చారా..? రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని.. రూ.87 వేల కోట్లు రుణాలుంటే.. వాటినేమైనా మాఫీ చేశారా.? అంటే, లేదు అనే సమాధానం చెప్పుకోవాలి. అదే విధంగా రూ.16 వేల కోట్లు మాఫీ చేయాల్సిన డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల్ని ఎందుకు మాఫీ చేయలేదు. ఆడబిడ్డ పుడితే తల్లుల అకౌంట్లలో రూ.25 వేలు చొప్పున వేస్తానన్న బాబు ఎందుకు జమ చేయలేదు..? చివరికి రూ.10 వేల పసుపు కుంకుమతో అక్కచెల్లెమ్మలను మభ్య పెట్టాలని చూసినప్పుడు వాళ్లు ఈ చంద్రబాబుకు 2019లో ఎలా బుద్ధి చెప్పారో తెలుసు కదా..? స్కామ్‌ల పితామహుడు.. స్కీమ్‌లివ్వని మోసగాడు: మ్యానిఫెస్టోను చెత్తబుట్ట చేసే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఏవేవో హామీలంటూ ప్రజల ముందు ఊదరగొట్టడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన స్కామ్‌ల పితామహుడే గానీ.. స్కీమ్‌లిచ్చే నాయకుడైతే కాదని ప్రజలు గుర్తించారు. మహిళాశక్తి, భవిష్యత్తుకు భరోసా అంటూ ఉత్తుత్తి పథకాల్ని మహిళా సోదరులు నమ్మరని తేలిపోయింది కనుక, అందుకే ఆయన ఇప్పుడు జనసేన, బీజేపీ అంటూ పక్కపార్టీల వైపు చూస్తున్నాడు. బాబు ఏ పార్టీ జెండా పట్టుకున్నా కూడా అతని అజెండా మాత్రం అధికారంలోకొచ్చి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడమేనని మంత్రి శ్రీ అమర్‌నాథ్ అన్నారు.