మేమిచ్చిన లక్షలాది ఉద్యోగాలు మీకళ్లకు కన్పించడం లేదా..?

రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్న బాబు అండ్ కో

సీఎం వైయ‌స్‌ జగన్ హయాంలో రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం

బాబుకు చేతికర్రలే ఆ రెండు పచ్చ పత్రికలు

పారిశ్రామిక ప్రగతిని చూసి ఓర్వలేకే ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా వార్తలు

బాబును గద్దెనెక్కించాలన్న ఎల్లో మీడియా తపన చూస్తే జాలేస్తోంది

ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా టీడీపీకి 2019 ఫలితాలే రిపీట్

ప్రజలంతా సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వం కోరుకుంటున్నారు

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ 

తాడేప‌ల్లి: కొంతకాలంగా రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నాయ‌ని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోంద‌ని ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించాలి అనే వారి తపన చూస్తే నిజంగా జాలేస్తోందన్నారు. ఎలాగోలా చంద్రబాబు, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని రామోజీ, రాధాకృష్ణ, టీవీ5లు తపన పడుతున్నారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ ప్రజలందరికీ గ్రాఫిక్స్‌ చూపి మోసం చేసి దోచుకోవాలనేదే వారి ఆలోచన అన్నారు. విశాఖలో రూ.22 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొదటి సారిగా అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.  ఉత్తరాంధ్ర ప్రజల కలైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూ. 4200 కోట్లతో శంకుస్థాపన, శ్రీకాకుళంలో ప్రతిష్టాత్మకమైన మూలపేట పోర్టును రూ.4300 కోట్లతో శంకుస్థాపన జరిగింద‌న్నారు. ఈ నెల 22వ తేదీన రూ.5వేల కోట్ల విలువైన బందరు పోర్టు శంకుస్థాపన జరగబోతోందని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ చెప్పారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అమ‌ర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
 
గత ఏడాది రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభించి ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేశాం. ఆ పోర్టులో మొట్ట మొదటి వెసెల్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ రూ.8800 కోట్లతో జింథాల్‌ కంపెనీ నిర్మాణ పనులు చురుగ్గా సాగిస్తోంది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4 పోర్టుల ఏర్పాటు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, పరిశ్రమలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. 

రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం..
ఇవన్నీ తట్టుకోలేక నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైయ‌స్ జగన్‌పై వారు రాస్తున్న రాతలు జుగుప్సాకరంగా మారుతున్నాయి. వారికి అసలు సిగ్గూ శరం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. కేవలం చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ఈ పత్రికలు చూస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది  ఉండేవారు. వైయ‌స్ జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఆరు  లక్షలు దాటింది. వీరికి తోడు మూడు లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చింది సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి. మరి ఈ ఉద్యోగాలన్నీ ఎవరికి వచ్చాయి..? వేరే దేశంలో ఉన్న వారికి ఇచ్చారా అనేది రామోజీ సమాధానం చెప్పాలి. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే సుమారు 1.30 లక్షల మందికి శాశ్విత ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 49 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అవి వారికి కనిపించడం లేదు. 

పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఏపీ..
ప్రైవేటు రంగంలో కేవలం ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లోనే నాలుగేళ్లలో రూ.24 వేల కోట్ల పెట్టుబడులు వస్తే 12.60 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. భారీ పరిశ్రమల్లో 85 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్టార్‌లో చంద్రబాబు హయాంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు, 14వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో సీఎం వైయ‌స్‌ జగన్ సారధ్యంలో రూ.5700 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్టార్స్‌లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మొన్న శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్‌తో పాటు విజయవాడ, తిరుపతి, అనంతపురాల్లో ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కుల ద్వారా మరో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లు అభివృద్ధి చెందుతుంటే..మూడు కారిడార్లు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 50 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రలు స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన మౌలిక వసతులన్నిటినీ కల్పిస్తూ ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తోంది. తద్వారా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలో తిరుపతిలో రెండు, శ్రీసిటీ, కొప్పర్తిల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్న ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

నాలుగేళ్లలో నాలుగు పోర్టుల అభివృద్ధి
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు మరో నాలుగు పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి చేపట్టాం. దీని ద్వారా పోర్టు ప్రాంతాల్లోని స్థితిగతులు మారబోతున్నాయి. వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. వీటితో పాటు 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. లీడ్స్‌ ఇచ్చిన ఈజ్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌లోనూ మొదటి స్థానంలో ఉన్నాం. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో బల్క్‌ డ్రగ్‌పార్క్‌ సాధించిన ఘనత మన రాష్ట్రానిదే. 2022 సంవత్సరంలో అత్యధికంగా పెట్టబడులు ఆకర్షించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఏపీ ఉంది. డీపీఐటీ ఇచ్చిన నివేదికలు ఈ రాతలు రాసే పత్రికలకు కనిపించడం లేదు. 

అన్నింటా దూసుకుపోతున్న ఏపీ..
గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వచ్చారు. అంబానీ, అదానీ, ఓబెరాయ్‌ లాంటి వారు వచ్చి చెప్పిన మాటలు వీరికి కనిపించవు..వినిపించవు. ఏదో ఒక రకంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని వారి తాపత్రయం. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్‌ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించుకోదు. 192 స్కిల్‌ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉపాధి విషయంలో ముందడుగు వేశాం. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశాం. 17 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులను అందులో భాగస్వామ్యులను చేశాం. రానున్న కాలంలో ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. 

పచ్చ పత్రికలను నమ్మెద్దు..
ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతలను ప్రజలు ఎవరూ నమ్మవద్దు. తెలంగాణాలో ఒక పరిశ్రమ పెడితే అది ఇక్కడ నుంచి పారిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ అమెరికా నుంచి ఇక్కడకు వస్తే అది అమెరికా నుంచి పారిపోయి వచ్చినట్లా..? ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు..? వీళ్లంతా రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నారు. ఈ ప్రాంతం మీద బతికి, ఈ ప్రాంతంలో మీరు వ్యవస్థలను స్థాపించి పెద్ద స్థాయికి వెళ్లి.. తిరిగి పుట్టిన ప్రాంతంపై విషం కక్కుతున్నారు. వాళ్లు ఏది అనుకుంటే అది రాస్తున్నారు తప్ప ..వాస్తవాలు రాయడం లేదు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోంది. సీనియర్‌ సిటిజన్‌ చంద్రబాబుకు ఈ రెండు పత్రికలు రెండు చేతికర్రల్లా పనిచేస్తున్నాయి. వీరంతా తప్పుడు వార్తలు, లేనటువంటి అంశాలను ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేం నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాం..మేము ఏం చేశామో చెప్తున్నాం. ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్‌ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2019లో వచ్చిన ఫలితాలే టీడీపీకి మళ్లీ వస్తాయి. పారిశ్రామిక వేత్తలకు మేం ఏవిధమైన సహకారం అందిస్తున్నామో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మాకు వస్తున్న ర్యాంకింగ్‌లను బట్టే అర్ధం అవుతుంది. 

Back to Top