పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నాం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తాం

మ‌న రాష్ట్రంలోని వ‌న‌రుల‌ను స‌మ్మిట్‌లో వివ‌రిస్తాం

అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నందున్న పోర్టుల అభివృద్ధికి కృషి

పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం

ఏపీని పారిశ్రామిక అభివృద్ధికి, ఎక్స్‌పోర్ట్స్‌కు గేట్‌ వేగా నిలిపేందుకు ప్రయత్నం

పరిశ్రమ, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విజయవాడ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి, మన రాష్ట్రంలో ఉన్న వనరులను తెలియజేసి, పెట్టుబడులు తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 నిర్వహిస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈస్ట్‌ కోస్ట్‌లో మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి, ఎక్స్‌పోర్ట్స్‌కు గేట్‌ వేగా ఉండాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. విజయవాడలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

‘‘ఎలక్ట్రిక్‌ వెహికిల్, ఎడ్యుకేషన్, స్కిల్‌ డెవలప్‌మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌పై ప్రధాన దృష్టిసారించాం. ఎంఎస్‌ఎంఈలను బాగా పటిష్టం చేయాలనేది ముఖ్యమంత్రి ప్రధాన ఆలోచన. మరిన్ని ఎంఎస్‌ఎంఈలను తీసుకురావాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు సంబంధించిన సెక్టార్‌లో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి రోల్‌మోడల్‌గా ఉంది. 

ప్రధానమైన సెక్టార్లను ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ.. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను దృష్టిపెట్టుకొని ఏ పరిశ్రమ స్థాపిస్తే బాగుంటుందో వాటిపై ప్రధానంగా ఫోకస్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొన్నాం. పెట్రో కెమికల్‌కు సంబంధించి ఆంధ్రరాష్ట్రానికి ఉన్న అవకాశాలను ప్రదర్శించే అవకాశం దొరికింది. 

విశాఖపట్నం, కాకినాడకు సంబంధించి పీసీపీఐఆర్‌ కారిడార్‌ దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్‌ కారిడార్‌గా ఉంది. 640 చదరపు కిలోమీటర్ల విశాఖ, కాకినాడ పీసీపీఐఆర్‌ దేశంలోనే అతిపెద్ద కారిడార్‌గా ఉంది. దానిపై కూడా ప్రధానంగా ఫోకస్‌ పెట్టాం. మేజర్‌గా రాష్ట్రానికి ఉన్న పోర్టులెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసి తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. భావనపాడుకు సంబంధించి రైతులతో మాట్లాడాం. భూసేకరణ అంశాన్ని క్లియర్‌ చేసేందుకు అధికారులు పనిచేస్తున్నారు. మచిలీపట్నంలో బందర్‌ పోర్టుకు సంబంధించి కోర్టు కేసులు క్లియర్‌ అయ్యాయి. దానికి కూడా త్వరలోనే ఫౌండేషన్‌ వేస్తాం. 

రాష్ట్రంలో 10 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం జరుగుతున్నాయి. మరో 5 హార్బర్లకు నిర్మాణం చేపట్టనున్నాం. రామాయపట్నం పోర్టుకు మొదటి షిప్‌ 2023 డిసెంబర్‌ నాటికి తీసుకురావాలని సీఎం టార్గెట్‌ ఇచ్చారు. నెల అటు, ఇటు అయినా 2024 జనవరి నాటికి మొదటి షిప్‌ తీసుకువస్తాం. జనవరిలో జువ్వెలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి, ఎక్స్‌పోర్ట్స్‌కు గేట్‌వేగా ఉండాలని, ఈస్ట్‌కోస్ట్‌లో విశాఖపట్నం, భావనపాడు నుంచి మొదలుకొని చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలను ఎకనామిక్‌ గ్రోత్‌లో ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలని, వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను తెలియజేసి పెట్టుబడులు తీసుకురావాలనే గొప్ప ప్రయత్నం జరుగుతుంది’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. 
 

Back to Top