విశాఖకు పరిపాలన రాజధాని సాధించుకొని తీరుతాం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ గర్జనలో లక్షలాదిగా పాల్గొని మా ఆకాంక్షను తెలియజేస్తాం

హైద‌రాబాద్‌ కోసం జరిగిన పోరాటం.. మళ్లీ అమరావతి కోసం జరిగితే నష్టపోవడానికి సిద్ధంగాలేం

మా ఆకాంక్షను హేళన చేయొద్దు, మా మనోభావాలను దెబ్బతీయొద్దు

ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల‌ తరఫున చేతులు జోడించి ఎల్లో మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం

మా ప్రాంతమే కాదు.. రాయలసీమ, అమరావతి బాగుండాలని పోరాటం చేస్తున్నాం

విశాఖ: ఎవరెన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలో మార్పు ఉండదని, విశాఖకు పరిపాలన రాజధాని సాధించుకొని తీరుతాం అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖ గర్జన అహింస మార్గంలో జరగాలని, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రజలకు తెలియజెప్పాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చిందన్నారు. అభివృద్ధి కేంద్రీకరణ, హైదరాబాద్‌ కోసం జరిగిన తెలంగాణ పోరాటం.. మళ్లీ అమరావతి కోసం జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేమని తెలియజెప్పేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే.. 
‘అమరావతి పేరుతో దండయాత్రగా వస్తున్నవారికి మా ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు. వారు ఉత్తరాంధ్ర ప్రాంతంపైకి దండయాత్రకు రాకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఆకాంక్ష బయటపడేది కాదు. అమరావతి టు అరసవెల్లి మన ప్రాంతం మీదకు దండయాత్రకు వస్తున్న క్రమంలో పుట్టిన ఈ పోరాటం, ఆకాంక్ష, కోరిక బలంగా ప్రపంచానికి వినిపించే బాధ్యత జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తీసుకుంది. విశాఖ గర్జనకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి ఉత్తరాంధ్ర ఆకాంక్షను తెలియచెప్పబోతున్నారు. బలంగా వినిపించబోతున్నారు. 

అహింస మార్గంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలియజేద్దాం. అనేక రకాలుగా విశాఖ గర్జనను నీరుగార్చాలని, డైవర్ట్‌ చేయాలనే ఆలోచనలు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లకు ఉన్నాయి. మా పోరాటాన్ని చూపించే బాధ్యత తీసుకోకపోయినా పర్వాలేదు. మా ప్రాంత ప్రజల ఆకాంక్షను హేళన చేయొద్దు, అగౌరవ పర్చొద్దు. మనోభావాలను దెబ్బతీయొద్దు అని ఉత్తరాంధ్ర ప్రజల తరఫున చేతులు జోడించి అర్ధిస్తున్నాం. మా పోరాటానికి హాని చేయకుండా ఉండాలని కోరుతున్నాం. 

ఎవరెన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలో మార్పు ఉండదు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకొని తీరుతాం. విశాఖ నగరం ఎంతోమందికి అవకాశాలు ఇచ్చింది. ఎంతోమందిని ఆదరించింది. అన్ని కులాలు, అన్ని మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిపిన ప్రాంతం విశాఖ. కవులు, కళాకారులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులను అందించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. మా ప్రాంతం ఒక్కటే కాదు.. మాతో పాటు రాయలసీమ, అమరావతి బాగుండాలని పోరాటం చేస్తున్నాం. అన్ని ప్రాంతాలకు మంచి జరగాలనే కోరికతో పోరాటం చేస్తున్నాం. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతాం’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top