ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకున్న ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌దే

ప్రధాని ప్ర‌క‌టించిన ఆత్మ నిర్భ‌ర్‌తో ఉప‌శ‌మ‌నం

ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌టానికి  ఉన్న మార్గాల‌ను అన్వేషిస్తున్నాం

మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి

తాడేప‌ల్లి: క‌రోనా నేప‌థ్యంలో  ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్న‌మైంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఆర్థిక‌, పారిశ్రామిక రాష్ట్రాభివృద్ధికి పున‌రంకిత‌మ‌వుదామ‌ని మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి పిలుపునిచ్చారు.  క‌రోనా క‌ష్ట‌కాలంలో దేశ‌వ్యాప్తంగా వాణిజ్య‌, పారిశ్రామిక రంగాలు నెమ్మ‌దించాయ‌న్నారు.  సుక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను ముందుగా ఆదుకున్న‌ది వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకునేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రూ.1168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చార‌ని చెప్పారు. జూన్ 30 క‌ల్లా ప్ర‌క‌టించిన మొత్తం రెండు విడ‌త‌లుగా ఇచ్చామ‌న్నారు.  రూ.905 కోట్ల పెండింగ్ ప్రోత్సాహ‌క బ‌కాయిలు అందించామ‌ని చెప్పారు.  ప‌రిశ్ర‌మ‌ల వెసులుబాటు కోసం విద్యుత్ స్థిర ఛార్జీలు రూ.188 కోట్లు మాఫి చేశామ‌ని, మ‌రో రూ.200 కోట్ల నిధితో సూక్ష్మ‌, చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌డ్డీకి రుణాలు ఇచ్చే వెసులుబాటు క‌ల్పించామ‌న్నారు. కీల‌క ‌రంగాల‌ను ఎంచుకొని ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌టానికి  ఉన్న మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌న్నారు. ఉద్యోగం లేని వారికి నైపుణ్య‌త చూసి ప‌రిశ్ర‌మ‌ల‌లో ఉద్యోగాలివ్వ‌డంపై దృష్టి పెట్టామ‌న్నారు. ప్రధాని ప్ర‌క‌టించిన ఆత్మ నిర్భ‌ర్‌తో ఉప‌శ‌మ‌నం క‌లిగింద‌ని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ ప్ర‌భావాన్ని అధిగ‌మించి అభివృద్ధి అంచ‌నాల‌ను సాధిస్తామ‌ని గౌతంరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top